Online Puja Services

శ్రావణ బహుళ అష్టమి కృష్ణాష్టమి

18.221.47.203
కృష్ణాష్టమి 2020 
 
 చిన్నికృష్ణుడిని ఎలా ఆరాధించాలి...
శుభముహుర్తం ఎప్పుడంటే.. 
 
శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు. ఇలా కృష్ణుడు పుట్టినరోజునే జన్మాష్టమి, గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు.
 
హిందూ సంప్రదాయం ప్రకారం పూజలన్నీ ఉదయం ప్రారంభమైతే... కృష్ణ జన్మాష్టమి రోజున మాత్రం మధ్యాహ్నం సమయంలో పూజలు ప్రారంభమవుతాయి. ఎందుకంటే శ్రీకృష్ణుడు అర్థరాత్రి జన్మించాడు. కాబట్టి కృష్ణాష్టమి పూజలను కూడా కొన్ని ప్రాంతాల్లో రాత్రి సమయంలో జరుపుకునే ఆచారం కూడా ఉంది.
 
ఈ నేపథ్యంలో మహిళలంతా ఎలాంటి హడావుడి లేకుండా పూజకు అవసరమైనవన్నీ ముందే సిద్ధం చేసుకోవచ్చు. ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి, ఇంటి ముంగిట మామిడి తోరణాలు కట్టి, గడపలకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, బాలకృష్ణుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు కృష్ణ పాదముద్రలు వేస్తారు.
 
ఇదిలా ఉండగా.. ఈ సంవత్సరం కరోనా వంటి కష్టకాలంలో కృష్ణాష్టమి మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక అలంకరణలు చేస్తారు. చాలా మంది తమ ఇళ్లను అందంగా అలంకరిస్తారు.
 
ఇంతకీ కృష్ణాష్టమి ఏ తేదీన వచ్చింది... ఏ సమయంలో శుభముహుర్తం ఉంది? శ్రీకృష్ణుని ప్రాముఖ్యత వంటి విషయాల గురించి తెలుసుకుందాం...
 
పురాణాల ప్రకారం.. శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో అర్థరాత్రి సమయంలో జన్మించాడు. కాబట్టి ఈరోజున కృష్ణాష్టమి, గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు.
 
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభ సమయం..
శ్రావణ మాసంలోని అష్టమి రోజున ఈ శుభ సమయం సుమారు 24 గంటల పాటు ఉంటుంది.
ముహుర్తం ప్రారంభ సమయం : ఆగస్టు 11వ తేదీ ఉదయం 9:06 గంటలకు
ముహుర్తం ముగింపు సమయం : ఆగస్టు 12వ తేదీ తెల్లవారుజామున 03:27 గంటలకు
రోహిణి నక్షత్రం ప్రారంభ సమయం : ఆగస్టు 13వ తేదీ తెల్లవారుజామున 03:27 గంటలకు
రోహిణి నక్షత్రం ముగింపు సమయం : ఆగస్టు 14వ తేదీ ఉదయం 05:22 గంటలకు
 
శ్రీకృష్ణుని పూజా విధానం..
కృష్ణ జన్మాష్టమి రోజున చిన్నికృష్ణున్ని ఆరాధిస్తాం. అంటే చిన్న పిల్లలకు ఒంటికి నూనె రాసి, నలుగు పెట్టి, స్నానం చేయించి, అలంకరించి ఎంత మురిపెంగా చూసుకుంటామో.. అదే విధంగా చిన్ని కృష్ణున్ని కూడా అలాగే ఆరాధించాలి.
 
చిన్నికృష్ణుని విగ్రహానికి పంచమ్రుతాలతో, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో అభిషేకం చేయాలి. అనంతరం కొత్త బట్టలు కట్టి, ఆభరణాలతో అలంకరించాలి.
 
శ్రీకృష్ణుడికి తులసీ దళాలంటే చాలా ఇష్టం. కాబట్టి శ్రీకృష్ణుని తులసి మాలను మెడలో వేయాలి. పువ్వులను, ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత కృష్ణుని విగ్రహాన్ని ఊయలలో ఉంచి లాలి పాట పాడుతూ ఊయలను ఉపాలి. ముత్తయిదవులను పిలిచి వాయినాలివ్వాలి. అనంతరం కాసుపు గీతాపఠనం చేయాలి.
 
చిన్నికృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. కృష్ణాష్టమి రోజున ఆ వెన్ననే నైవేద్యంగా సమర్పించాలి. అయితే పురాణాల ప్రకారం, కృష్ణాష్టమి రోజున 102 రకాల పిండి వంటలు చేయాలి. ఆరు రకాల పానీయాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలి. వాటిని మనం తీసుకున్న తర్వాత ఇతరులకు పంచాలి.
 
మన తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాష్టమి సందర్భంగా వెన్న, పాలు, పెరుగు, బెల్లం, అటుకులు, శనగపప్పు వంటి వాటిని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాదు.. సొంఠితో తయారు చేసిన కట్టెకరం, చక్కెర కలిపిన మినప్పిండిని కూడా నైవేద్యంగా పెడతారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అప్పుడే జన్మించాడు.
 
అందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
 
- శృతి వెనుగోముల 

Quote of the day

Love is an endless mystery, for it has nothing else to explain it.…

__________Rabindranath Tagore