Online Puja Services

తన భక్తుని అంతిమ సంస్కారం చేయడానికి దిగివచ్చిన కృష్ణయ్య !

3.17.6.75

తన భక్తుని అంతిమ సంస్కారం చేయడానికి దిగివచ్చిన కృష్ణయ్య !
-లక్ష్మీ రమణ 

బృందావనం నిజంగానే అద్భుత ప్రదేశం . అప్పటికీ ఇప్పటికీ కృష్ణుడు తిరుగాడే చోటు అది . అక్కడ రాధతో కలిసి ఆడే ఆటలు, ఆయన పాడే పాటలు  ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి .  కానీ రాధమ్మతో ఆడిపాడడానికి వచ్చిన స్వామీ ఎవ్వరికీ కనిపించలేదు . కానీ అదే బృందావనంలో స్వయంగా వచ్చి, తన భక్తునికి అంతిమ సంస్కారాలు చేసి , ఊరందరికీ తన దర్శనాన్ని ప్రత్యక్షంగా ఇచ్చిన కృష్ణయ్య కథ ఇది . ! కావాలనుంటే, మీరూ బృందావనం వెళ్లి యమునా తీరంలో ఉన్న ఈ ప్రదేశాన్ని దర్శించుకోవచ్చు . 

కాలం చేసిన ఆ దాసుగారికి కృష్ణుడే కొడుకై దహన సంస్కారాలు చేశారు ! 

అదొక పూరిగుడిసె.  ఇంటి ముందర ఒక పండితుడు అరుగు మీద కూర్చొని పురాణ పఠనం చేస్తున్నారు .  ఆశక్తిగా భక్తులందరూ ఆయన చెప్పే భగవంతుని లీలావిశేషాన్ని ఆలకిస్తున్నారు . అక్కడ ఆ కధామృతం అద్భుతంగా కొనసాగేది .  ఆయన ఏమీ ఆశించేవారు కాదు . భక్తులు ఏమీ సమర్పించేవారూ కాదు .  అప్పుడప్పుడూ ,ఆయన  తాను చెబుతున్న పురాణం మద్యలో అపి, లోనికి వెళ్ళి వస్తూఉండేవారు . 

కథలో అలా అంతరాయం ఏర్పడినా భక్తులు ఆయన కోసం వేచి ఉండేవారు .  ఆయన వచ్చాక , మా పిల్లవాడికి స్నానం చేయించి వచ్చానని, భోజనం పెట్టానని, పడుకో బెట్టాను అనీ, దుస్తులు ధరింప జేశానని చెప్పేవారు.  ఇలా రోజూ జరుగుతూ వుండేది!

కానీ, ఆ  గుడిసె లో పిల్లవాడి అలికిడి, అల్లరి, మాటలు ఎవరికీ వినపడేది కాదు. ఇలా కొన్ని ఏళ్లు గడిచాయి. ఒకరోజు ఆయన అలా కథా కాలక్షేపం చేస్తూనే దేహం చాలించారు. 

గ్రామస్తులు చాలా బాధపడ్డారు. అయ్యో ! ఎంత మంచి వాడు!
ఎంతో భక్తిశ్రద్ధలతో ఎవరిని ఏమీ అడగకుండా, ఎవరివద్దా ఏమీ ఆశించకుండా , అద్భుతమైన భగవంతుని కథాసుధని అద్భుతంగా నిత్యమూ మనకి వినిపించేవారు కదా ! అనుకున్నారు . ధర్మసూక్షములని రంగలించి మళ్ళీ  ఎవరు ఇంత గొప్పగా చెబుతారు? అని కన్నీరు పెట్టుకున్నారు .  

ఇటివంటి విచారముతోటే, గ్రామస్తులందరూ కలిసి ఆయన అంత్యక్రియలు జరిపే సన్నాహాలు మొదలు పెట్టారు . మా అబ్బాయికి అది చేశాను . మా అబ్బాయికి ఇది చేశాను అని రోజూ ఆయన అంటుండేవారుకదా ! మరి అంతిమ సంస్కారానికి అర్హుడు అయినా అతన్ని పిలుద్దామని అంతవరకూ తాము అడుగుపెట్టని గుడిసె లోపలి వెళ్లి చూశారు .  అక్కడ ఆయన నిత్యమూ కొలిచే కృష్ణస్వామి తప్ప వేరెవ్వరూ లేరు .  

ఎటైనా పనిమీద వేళ్ళాడేమో అని ఎదురుచూశారు . ఒక రోజు గడిచింది . అయినా , పిల్లాడి జాడ లేదు !చివరకు వాళ్ళే అతడి దేహాన్నియమునానది ఒడ్డుకు తీసుకు వెళ్లారు.  మంచి గంధపు కట్టెలతో చితిని ఏర్పాటు చేశారు!! ఇక నిప్పు పెట్టడమే తరువాయి . ఆ పుణ్యాత్ముని అంతిమయాత్రా పుణ్యం తమకు దక్కాలంటే, తమకి దక్కాలని, ఆ చితికి నిప్పు పెట్టేందుకు ప్రతి ఒక్కరూ పోటీపడసాగారు . 

అప్పుడు దూరం నుండీ పరిగెత్తుకుంటూ వచ్చాడో పిల్లవాడు . చక్కగా తిరునామాలు ధరించి నీలమేఘశ్యాముడే దిగివచ్చాడా అన్నట్టు పదహారేళ్ళ పడుచు వాడు .  “ఆగండి !! ఆగండి !!""అంటూ పరుగు పరుగున వాటికలోకి అడుగుపెట్టాడు . “ అయ్యలారా !చనిపోయిన ఈ పెద్దాయన నా తండ్రి. !! నన్ను ఒక పని మీద పొరుగూరు పంపించారు !!అది చూసుకొని రావడంలో నాకు కొంత ఆలస్యం జరిగింది!తీరా నేను ఇల్లు చేరుకొనే సరికి నాన్నగారు ఇలా , కాలం చేశారు. నన్ను క్షమించి , దయచేసి నా తండ్రికి అగ్ని సంస్కారం చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి !” అని వారిని వేడుకున్నాడా కుర్రవాడు . 

వారు సరే అన్నారు! కన్నా కొడుకే ఉండగా తమకా అదృష్టం లేదనుకున్నారు . ఆ పిల్లవాడు చక్కగా వేద మంత్రాలు పఠిస్తూ, అంత్యేష్టి కార్యక్రమం  అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాడు! చక్కని పాండిత్యం, అందమైన ఉచ్చారణ ! పనస లు చదువుతూ ఉంటే, పురోహితులు కూడా  ఆశ్చర్య పోతున్నారు! ఏమా వర్చస్సు?! ఏమా శాస్త్ర పరిజ్ఞానం ? ఇంతవరకూ ఎవరూ, కనీ వినీ ఎరుగని శాస్త్ర విది ప్రకారం చేస్తూ చివరకు చుట్టూ ప్రదక్షణ నమస్కారం చేస్తూ   దుఖిస్తూు ,చితికి నిప్పు అంటించాడు! పండితులవారు ఇటువంటి అంత్యేష్ఠికి నోచుకున్నారు . ఆయన పరమ భాగ్యవంతుడు అనుకున్నారు . ఆ క్షణం వారందరికీ ఆ పండితునికి ఇటువంటి కొడుకు ఉన్నందుకు ఒకింత ఈర్ష్యా భావం కలిగింది . 

వారందరూ వాత్సల్యంతో “నాయనా ! ఇక నీవు వెనుదిరిగి చూడకుండా దూరంగా  వెళ్లు” అన్నారు. ఆ పిల్లవాడు అలాగే అన్నట్టుగా తల ఊపి, నేరుగా వెళ్తుండడం, ఒక దాదాపుగా  20 గజాల దూరం వెళ్ళాక, కనిపించకుండా అంతర్ధానం కావడం వారు  అందరూ కళ్ళారా చూశారు. ఆ తర్వాత తమ కళ్ళు మోసం చేశాయేమో అని వెతికే చోట మల్లి వెతుకుతూ ఊరంతా కలియ దిరిగారు . ఆ తేజోస్వరూపుడైన యువకుడు ఎక్కడ కనిపించలేదు వారికి . అప్పటికి గానీ సత్యం బోధపడలేదు వారికి . 

 ఆ వచ్చినవాడు మరెవరో కాదు, స్వయంగా పరంధాముడైన ఆ "కృష్ణయ్య "! ఇన్నాళ్లూ విన్న భాగవత కథల పుణ్యమా అని, శ్రీకృష్ణుని ఒక బాలుని రూపంలో ప్రత్యక్షంగా దర్శించే మహా భాగ్యం లభించింది కదా అనుకుంటూ , ఆ యువకుడు నడచిన నేలపై గల ధూళిని ప్రసాదంగా ,  మహదైశ్వర్యముగా స్వీకరించారు వారంతా !

ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని పరమ పావనం గా పవిత్రంగా భావిస్తూ పూజిస్తూ ఉన్నారు బృందావనవాసులు! మధుర వెళ్లిన వారు ఈ ప్రదేశాన్ని దర్శించుకోవచ్చు . శ్రీకృష్ణుడు అదృశ్య రూపంలో కొలువై నెలవై ,
భక్తుల పాలిట కల్పతరువుగా అచట ఉంటున్నాడనుటకు నిదర్శనం ఈ వాస్తవ గాథ!! 

మా అబ్బాయికి నిద్ర, అహారం, స్నానం ఏర్పాట్లు చేసి వస్తానని చెబుతూ  శ్రీకృష్ణ భగవానుని తన కుమారునిగా భావిస్తూ అదే ధ్యాసతో,అంతిమ శ్వాసను విడిచిన ఆ మహానుభావునికి కృష్ణుడు, కొడుకు రూపంలో వచ్చి, స్వయంగా కన్న తండ్రి కి కొడుకు చేస్తున్నట్టుగా ,శాస్త్ర రీతిలో  పద్ధతిగా  చేశాడు. అలా పరందాముడే స్వయంగా, అంతిమ క్రియలు చేయడం  ఆ గ్రామ వాసులూ  గమనించారు.  భక్తుడు ,ఈ భవ బంధాలను కోరుకోకుండా , నేరుగా భగవంతునితో సంబంధబాంధవ్యాలు పెట్టుకొని , పంచుకుంటూ, పెంచుకుంటూ  ముక్తిని పొందాడు!

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore