Online Puja Services

పూతన సంహారం

18.116.62.45

శ్రీమదాంధ్ర మహా భాగవతం - 67 పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసం నుండి.. 

ఒకానొక రోజున కంసుని పనుపున పూతన అనే రాక్షసి అక్కడికి వచ్చింది. ఆవిడ బాలఘాతకి. ఆవిడ శిశువులు ఎక్కడ వున్నా తొందరగా పసిగట్టి చంపగలదు. ఆవిడ కామరూపిణి. రూపం మార్చుకుంటుంది. మార్చుకుని భవనమునందు ప్రవేశించింది. ఆమె శిశువులను చాలా గమ్మత్తుగా చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది. విషమును పాలలా ఇస్తుంది. పాలు త్రాగి శిశువులు మరణిస్తారు. అది ఆవిడకు ఉన్న శక్తి. 

ఆమె చంపేదానిలా కనపడదు. పెంచేదానిలా కనపడుతుంది. ఆవిడ వచ్చి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. ఆమె ఆకాశంనుండి వస్తున్నప్పుడే నందుని భవనంలో ఉన్న కృష్ణ పరమాత్మను కనిపెట్టింది. లోపల ఊయల దగ్గరకు వెళ్ళింది. పర్యంకము దగ్గరకు చేరింది. ఏ భావనతో చేరినా పరమేశ్వరుని దగ్గరకు చేరింది. ఆమె రాశీభూతమయిన పిల్లవాని సౌందర్యమును చూసి ‘నేను సహజంగా రాక్షసిని. చాలా వికృతంగా ఉంటాను. నా రూపమును మరుగుపరచి చాలా అందమయిన దానిలా వచ్చాను’. అనుకుంది. 

ఈవిడ వస్తుంటే చరాచర ప్రపంచపు ఆంతరమున, బాహ్యమునందు నిండిపోయిన పరమాత్మకు ఈవిడ ఎందుకు వస్తోందో తెలుసు. కాలు చేయి పొట్టకింద పడిపోతే తీసుకోవడం కూడా చేతకాని పిల్లవాడిలా జగత్తునంతా నిండి ఉన్న పరమాత్మ ఏమీ తెలియని వాడిలా లోపల నవ్వుకుంటూ ఒక దొంగ గుర్రు మొదలు పెట్టాడు. ఆమె దగ్గరకు వచ్చి చూసి ఎంత రాక్షసయినా ఆ బాలుని అందమునకు వశపడిపోయింది. ఆమె తెలియకుండానే ‘నేను నీ ప్రాణములను తీసెయ్యడానికి ఇంత అందంగా వచ్చాను. ఇంత అందగాడివి నా పాలు త్రాగితే ఎందుకూ పనికిరాకుండా అయిపోతావు’ అని అన్నది.

పూతన తెలియకుండానే ‘నళినదళాక్షా’ అని పిలిచింది. ‘తామరరేకుల వంటి కన్నులు వున్న పిల్లవాడా! ఎంత అందంగా ఉన్నావు! నా పాలు ఒక గుక్కెడు త్రాగావంటే ఇంత అందం చటుక్కున మాయమయిపోతుంది. నా అందమేమిటో అప్పుడు చూద్దువుగాని! నీ అందానికి సార్థకత వస్తుంది. రా త్రాగు’ అని గబగబా ఉయ్యాలలో ఉన్న పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం వాడి నోట్లో పెట్టబోతోంది. 

ఎక్కడో లోపల పనిచేసుకుంటున్న రోహిణి, యశోదాదేవి చూసి ‘అయ్యో! అదేమిటి అలా మా పిల్లవానికి పాలు ఇస్తున్నావు! మా పిల్లవాడు అన్యస్త్రీల క్షీరమును స్వీకరించడు. ఆగుఆగు’ అంటున్నారు. ఆవిడ స్తన్యమంతా విషమే. ఒక్కసారి ఆ విషమును నోట్లో పెడితే చాలు అనుకుని గబగబా పిల్లవాడిని తీసి ఒడిలో పెట్టుకుని, వాడి ముఖమును త్రిప్పి, ఎలాగయినా సరే స్తన్యం నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. కృష్ణుడు ఏమీ తెలియని వాడిలో ఆవులించాడు. ఒకసారి క్రీగంట చూసాడు. మరల నిద్ర వచ్చేసినవాడిలా కళ్ళు మూసాడు. మళ్ళీ కళ్ళు విప్పాడు. ‘పాలు త్రాగక తప్పదా’ అన్నట్లుగా చూసి విసుక్కుని అయినా పాలను తాగడం అలవాటయిన వాడిలా అమ్మ స్తన్యం త్రాగినట్లే ఆ స్తనమును తన బుజ్జి బుజ్జి వేళ్ళతో పట్టుకుని గుటుకు గుటుకుమంటూ రెండు గుక్కల పాలు త్రాగాడు.

ఆ రెండుగుక్కలలో ఆమె గుండెలలో ప్రాణముల దగ్గరనుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తినంతటిని లాగేశాడు. ఇప్పటి వరకు ‘త్రాగు త్రాగు’ అనడమే తప్ప ‘వదులు వదులు’ అనడం తెలియదు. పూతన ‘వదలరా బాబోయ్ అంటున్నది పూతన. ఆయన పట్టుకుంటే వదులుతాడా? ఆయన త్రాగేశాడు. ఆయన పాలు త్రాగెయ్యగానే ఆమె కామరూపం పోయి ఒక్కసారి గిరగిరగిర తిరుగుతూ నెత్తురు కక్కుతూ భయంకరమయిన శరీరంతో క్రిందపడిపోయింది. పదమూడు కి.మీ దూరం ఎంత ఉంటుందో అంత పెద్ద శరీరంతో నెత్తురు కక్కుతూ నేలమీద పడిపోయింది. 

పడిపోయేటప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. స్తన్యపానం చేస్తున్న కృష్ణుడు ఆవిడ గుండెలమీద ఉన్నాడు. ఆ గుండెల మీద వున్న కృష్ణుడిని అలాగే చేతులతో పట్టుకొని గిరగిర తిరిగి పడిపోయింది. ఆమె కోరలు నాగటి చాళ్ళలా ఉన్నాయి ముక్కు రంధ్రములు పెద్ద కొండగుహల్లా ఉన్నాయి. పర్వత శిఖరములవంటి స్తనములు, కళ్ళు చీకటి నూతుల్లా ఉన్నాయి. ఆమె శరీరం చుట్టూ గోపగోపీ జనమంతా నిలబడి ‘ఎంత పెద్ద రాక్షసి’ అంటున్నారు. కృష్ణుడు ఆమె మీద ఉన్నాడని వాళ్ళకి తెలియదు. అక్కడ కృష్ణుడు ఉన్నాడనే విషయం యశోదా రోహిణులకు మాత్రమే తెలుసు. అయ్యో పిల్లాడు అయ్యో పిల్లాడని పూతన భుజములమీదనుండి పర్వతమును ఎక్కినట్లు ఎక్కారు. పసికూన అయిన కృష్ణునికి ప్రమాదం జరిగి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. 

కానీ కృష్ణుడు చక్కగా నవ్వుతూ హాయిగా ఆవిడ గుండెల మీద పడుకుని ఏమీ తెలియని వాడిలా బోసి నవ్వు నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళు అబ్బో ఎంత అదృష్టమో పిల్లవాడు బ్రతికి వున్నాడని పిల్లాడిని ఎత్తుకుని భుజంమీద పెట్టుకొని ఇంత పెద్ద శరీరంతో ఈ రాక్షసి క్రింద పడిపోతే పిల్లవాడు భయపడి ఉంటాడని అనుకున్నారు. ఆయనకా భయం? ‘భయకృద్భయనాశనః’ అని ఆయనకు పేరు. గోపికలు అనుకుంటున్నారు. వీళ్ళదీ పరమభక్తి అంటే! వాళ్లకి కృష్ణుని గొప్పతనం తెలియదు. వారు కృష్ణుని ప్రేమించారు.

ఆ పిల్లవాడికి రక్ష పెట్టాలనుకుని గబగబా ఆవు దగ్గరకి తీసుకు వెళ్ళారు. ఆవుతోక పిల్లవాడి చుట్టూ తిప్పి, ఆవు మూత్రము ఆయన మీద చల్లి, ‘నీ శిరస్సును కేశవుడు రక్షించుగాక, కంఠమును హృషీకేశుడు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, గర్భమును మాధవుడు రక్షించు గాక, తొడలను ముకుందుడు రక్షించుగాక’ అంటూ పరమాత్మ పన్నెండు నామములు పెట్టి బాలుని శరీరంలోని ప్రధానమయిన అంగములకు పేడ పూస్తూ రక్షపెట్టారు. ‘ఏమి భక్తిరా వీళ్ళది?’ అని ఆయన మనస్సులో నవ్వుకుంటున్నాడు. ఇంతలో ఒక చిత్రమయిన గమ్మత్తు జరిగింది.

నందవ్రజమునకు పూతన రావడానికి పూర్వము నందుడు మధుర వెళ్ళాడు. కంసరాజుకి ఈయన సామంతుడు. ప్రతి ఏడాది కప్పం కట్టాలి. కప్పం కట్టడం కోసమని ధనమును తీసుకువెళ్ళి కంసుడికి కప్పం కట్టేసి, మధురలోనే ఉన్నాడు కదా అని వసుదేవుని చూడడానికి వెళ్ళాడు. వసుదేవుడు ఎదురువచ్చి కౌగలించుకొని ‘నందా! నిన్ను కలవడం చాలా సంతోషం. నీకు కొడుకు పుట్టాడని విన్నాను. ఎంత ఐశ్వర్యము ఉన్నా పిల్లలు లేని ఇల్లు ఐశ్వర్యము లేని ఇల్లే కదా! నీవు గొప్ప ఐశ్వర్యమును పొందావు. నేను చాలా సంతోషిస్తున్నాను’ అన్నాడు. 

నందుడు నువ్వు చాలా గొప్ప మాట మాట్లాడావు. నేను కప్పం కట్టడానికి వచ్చి నిన్ను చూసిపోదామని వచ్చాను. నీకు ఆరుగురు కుమారులు పుట్టారు. ఆరుగురినీ దుష్టుడై కంసుడు సంహరించాడు. వసుదేవా! నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నాకొడుకు నీ కొడుకే’ అని అన్నాడు. నిజమునకు కృష్ణుడు వసుదేవుడి కొడుకేగదా! వసుదేవుడు త్రికాలవేది. వసుదేవుడు ‘నందవ్రజంలో ఉత్పాతములు జరగబోతున్నాయి. నీవు తొందరగా బయలుదేరి వెళ్ళిపో’ అన్నాడు. కంసుడు కృష్ణుడిని పరిమార్చాలని ప్రయత్నిస్తున్నాడని తెలుసు.

నందుడు గబగబా బయలుదేరి తిరిగి వచ్చేస్తున్నాడు. దారిలో పడివున్న రాక్షసి శరీరమును చూశాడు. వసుదేవుడు చెప్పినది యథార్థమని గ్రహించాడు. ఆ శరీరమునంతటినీ ఊరికి దూరంగా తీసుకువెళ్ళి పెద్ద కుప్ప వేసి అగ్నిహోత్రమును వెలిగించారు. ఆవిడ రాక్షసి. శరీరం కొవ్వుతో నిండిపోయి ఉన్నది. అది కాలిపోతున్నప్పుడు దుర్వాసన వస్తుందని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అగరువత్తులు కాలిపోతుంటే ఎటువంటి వాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది. 

కృష్ణుడు పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆమె శరీరంలో వున్న పాపమును కూడా త్రాగేశాడు. పుణ్యమే మిగిలిపోయింది. ఆ శరీరం కాలిపోతుంటే అగరువత్తుల వాసన వచ్చింది. కృష్ణుడి కాళ్ళు చేతులు తగిలినంత మాత్రం చేత నిజంగా శ్రీమన్నారాయణునికి తల్లి ఉంటే ఏ లోకములకు వెళుతుందో ఆ లోకములకు పూతన వెళ్ళిపోయింది. మరి ఆ ‘పిల్లవాడు నా కొడుకు’ అనే ప్రేమతో పాలిచ్చిన తల్లి ఏ స్థితికి వెళుతుందో ఆ స్థితిని నేనుచెప్పలేను అన్నారు పోతనగారు.

ఇది పూతన సంహార ఘట్టము. ఈ ఘట్టమును తాత్త్వికంగా పరిశీలించాలి. భాగవత దశమస్కంధము ఉపనిషత్ జ్ఞానము. ఆవిడ పేరు పూతన. అమరకోశం ‘పునాతి దేహం పూతన’ అని అర్థం చెప్పింది. దేహమును పవిత్రముగా చేయుడానికి పూతన అని పేరు. మనకి సంబంధించిన ఒక వస్తువును చూపించి ఎవరిదీ అని ప్రశ్నిస్తే నాదని చెపుతాము. అయితే నేను అనబడే నువ్వు ఎవరు? దానికి జవాబు మనకే తెలియదు. అదే పెద్ద అజ్ఞానము. ‘నేను నేను’ అంటున్నది ఏది? అంటే తెలియక ఆ ‘నేను’ని చీకటితో, అజ్ఞానముతో కప్పివేశాము. అదే పూతన. అవిద్య. ‘నేను’కు ‘నాది’ తోడవుతుంది. నేను అనేది అబద్ధము. ఈ అబద్ధమునకు నాదనే మరొక అబద్దం తోడవుతుంది. దీనికి అస్తిత్వం లేదు. ‘నా’ అన్నప్పుడల్లా ఒక పాశం వేసుకుంటున్నాడు. ఎన్ని వేసుకుంటే అంత పశువు అవుతున్నాడు. పశువుకి అజ్ఞానం, అవిద్య ఉంటాయి. ‘నేను, నాది’ అనే రెండు పూతన రెండు స్తనములు. ఇందులోంచి విషయములను ఇస్తుంది. విషయమే విషము. దేహము ఎప్పుడూ సుఖమునే కోరుతుంది. 

దేహసంబంధమయిన సుఖములు విషముతో సమానమయినవి. అవి ఎప్పటికీ దేహి సూక్ష్మరూపమును తెలియనివ్వవు. అలా తెలియకుండా జీవుడు ఈ అబద్ధంలోనే చచ్చిపోతాడు. దీనిని ఏమయినా చేయగలమా? ఏ పని చేసినా దానిని భగవత్ ప్రసాదమని భావించాలి. భగవదర్పణ చేసి సుఖములను అనుభవిస్తే అవి మనపట్ల విషములు కావు అమృతములవుతాయి. భగవంతుని అర్పించడం వలన లోపల శుద్ధి జరుగుతుంది. శుద్ధి లేకుండా తింటే విషం. పూతన కృష్ణునికి విషపూరిత స్తన్యమును ఇచ్చింది. విషము అమృతము అయింది. మీకు కూడా అన్నింటినీ ఈశ్వరుడికి చెప్పి తినడం అలవాటయితే అది అమృతం అవుతుంది. మనస్సును దేహమును కూడా శౌచపరచగలదు. ఈశ్వరుని వైపు తిప్పగలదు. ఈ రహస్యమును ఆవిష్కరించడమే పూతన సంహారమునందున్న పెద్ద ప్రయత్నము.

ప్రకృతి వికారమయిన శరీరం పైకి అందంగా ఉన్నట్లు ఉంటుంది. దీనియందే ఉండిపోతే అసత్యమయిన ‘నేను’నందు మీరు ఉండిపోతే అది అమృతత్వమును ఇవ్వదు. అసత్యమయిన ‘నేను’ సత్యమును తెలుసుకోవడానికి ప్రసాద బుద్ధితో భక్తి వైపు వెళ్ళినట్లయితే ఈ భక్తి ఒకనాడు జ్ఞానము అవుతుంది. జ్ఞానము ఎప్పుడు కలిగేదీ మనం చెప్పలేము. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలంటే ముందు భక్తితోనే ప్రారంభించాలి. అది ఎప్పుడో జ్ఞానం అవుతుంది. జ్ఞానమును అగ్నిహోత్రంతో పోలుస్తారు. మీకు తెలియకుండానే ఒకరోజున ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అసలు ‘నేను’ను తెలుసుకుంటారు. అది తెలుసుకోవడానికి భక్తి నుండే వెళ్ళాలి. అదే పూతన సంహారఘట్టం. కృష్ణుని మొదటి లీల పూతన సంహారంతో మొదలవుతుంది. అపవిత్రమయినది పవిత్రం అయింది. పవిత్రము అవగానే లోపల ఉన్న వస్తువును తెలుసుకోవడానికి ఇది ఉపకరణంగా మారిపోతుంది. మారిపోయి అసలు ‘నేను’ను పసిగట్టగలిగిన స్థితికి తీసుకు వెళుతుంది. ఈ ఘట్టమును పరమోత్కృష్టమయిన పరమ పావనమైన ఘట్టంగా పెద్దలు ఆవిష్కరిస్తారు. 

- సేకరణ 

Quote of the day

What matters is to live in the present, live now, for every moment is now. It is your thoughts and acts of the moment that create your future. The outline of your future path already exists, for you created its pattern by your past.…

__________Sai Baba