Online Puja Services

గ్రహబాధలు తీర్చే - నవగ్రహాలయాలు !

3.149.250.1

గ్రహబాధలు తీర్చే - నవగ్రహాలయాలు !
సేకరణ లక్ష్మీ రమణ  

మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. జ్యోతిష్యంపై నమ్మకం ఉన్నవారు సమస్యకు కారణం తెలిసిన వెంటనే సంబంధిత గ్రహాన్ని పూజించి, శాంతి మార్గములు అనుసరించి ,ఆ గ్రహానుగ్రహం పొంది, తత్‌సంబంధమైన భాదల నుండి విముక్తి పొందుతుంటారు. ఈ గ్రహబలం ఎలాంటిది అంటే, పరమేశ్వరుడిని చెట్టుతొర్రలో కూర్చోబెట్టేంత ! చక్రవర్తి సత్యహరిశ్చంద్రుణ్ణి , కాటికాపరిగా మార్చేంత . గ్రహాల బాధలు ఎలా ఉంటాయో తెలిసేలా పెద్దవాళ్ళు , ‘ నాపాలిటి గ్రహంలా దాపురించావురా ‘ అని తిడుతుంటారు కదా ! అందుకే మరి గ్రహాలతో పెట్టుకోకుండా వాటి అనుగ్రహాన్ని పొందాలని చెబుతుంటారు . అటువంటి అనుగ్రహాన్ని సులభంగా సిద్ధింపజేయగలిగిన మహిమాన్విత నవగ్రహాల ఆలయాల వివరాలు ఇక్కడ మీకోసం .   

ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యచ్చ రాహావే కేతవే నమః..!! 

అని నవగ్రహాలనూ తలుచుకొని నమస్కారం చేసుకుంటాం . ఈ  తొమ్మిది గ్రహాలకూ - ఒకొక్క గ్రహనికి ఒక్కొక్క దేవాలయము ఉన్నది. ఇవి తమిళనాడు లోని కుంభకోణం క్షేత్రానికి అతి సమీపంలో విస్తరించి ఉన్నాయి . ఈ నవగ్రహ దేవాలయాలు దర్శించిన భ‌క్తులు విశేషంగా, వారి  గ్రహ పీడలను తొలగించుకొంటారు. ఈ ఆలయాలనే నవగ్రహ స్థలాలు అని కూడా అంటారు.

1) సూర్యనార్ కోయిల్ , తిరుమంగళంకుడి. 

తమిళనాడు రాష్ట్రము లోని తంజావూరు జిల్లాలో కుంభకోణం నుండి 15 k.m దూరములో గల తిరుమంగళంకుడి అను ప్రాంతములో సూర్యనార్ కోయిల్ అనీ పిలువబడే సూర్యదేవాలయము వున్నది. ఈ ఆలయములో సూర్యభగవానుడు ఆయన సతీమణులు అయిన ఉష , ఛాయా సమేతముగా భక్తులకు దర్శనమిస్తున్నారు .ఈ ఆలయాన్ని క్రీ . శ 1075 -1120 సంవత్సరాల మధ్య కాలంలో నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది .

ఈ ఆలయ ప్రాంగణములో కాశీ విశ్వేశ్వరుడు -విశాలక్ష్మీని, నవగ్రహాలచే ప్రతిష్టించిన వినాయకుని దర్శించుకోవచ్చు. ఈ ఆలయములో సూర్యభగవానుడికి తామర పుష్పాలతో పూజలు చేయడము విశేషము.

ఈ ఆలయంలో పూజలు చాల గొప్పగా జరుగుతాయి, పూజాంనతరము (పూజ తరువాత) ఆలయము చుట్టూ 9 సార్లు ప్రదక్షణ చెయ్యవలసి వుంటుంది .  ఇక్కడ పూజలు చేయిస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని భక్తుల విశ్వాసం . 

‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్.’ 

రవి సంపద ప్రదాత కూడా. 1100వ సంవత్సరంలో కులోత్తుంగ చోళ మహారాజు సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. ప్రతి ఏడాది పంటలు చేతికి వచ్చే జనవరి మాసంలో సూర్యునికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విశేషమైన ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు.

2) చంద్రగ్రహ దేవాలయము, తిరువైయార్. 

తిరువైయారుకు 5 k.m దూరములో చంద్రగ్రహ దేవాలయము వుంది. తిన్గాలుర్ కోవిల్ అని పిలువబడే చంద్ర దేవాలయములోని చంద్రభగవానుని దర్శనము సుఖాన్ని, దీర్ఘాయుస్సున్ని, ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకము. మానసిక ఒత్తిడి, దుఖాన్ని తగ్గించేవాడు చంద్రుడని చెబుతారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో వచ్చే ఫాల్గుణ నక్షత్ర సమయాలలో చంద్రకాంతి ఇక్కడి ఆలయములోని శివలింగముపై సరాసరిగా ప్రసరించడము విశేషమయినది.

3) అంగారక (కుజ) గ్రహ దేవాలయము, వైథీశ్వరన్ కోవిల్.

తిరువైయార్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో కుజ దేవాలయం ఉంది. దీనికి ‘’వైథీశ్వరన్ కోవిల్’’అని పేరు. అనేక వ్యాధులను అంగారకుడు పోగొడతాడని విశ్వాసం. ధైర్యం విజయం శక్తికి అంగారకుడే కారణం. 

ఇక్కడే జటాయువు, గరుడుడు, సూర్యుడు అంగారకుని పూజించారని స్థల పురాణం చెపుతోంది. వివాహం ఆలస్యం అయితే అంగారక క్షేత్రాన్ని దర్శిస్తే వెంటనే పెళ్ల‌యిపోతుంది. 

ఇక్కడ అనేక వ్యాధులను అంగారకుడు రూపుమపుతాడని భక్తుల విశ్వాసము, నమ్మకము. ధైర్యము, విజయము, శక్తికి అంగారకుడే కారణము. వివాహము ఆలస్యము అయితే ఈ అంగారక క్షేత్రాని దర్శిస్తే వెంటనే వివాహము అవుతుందని స్థానికులు చెపుతున్నారు .

4) బుధగ్రహ దేవాలయము,తిరువెన్నాడు.

అంగారక ఆలయానికి 10 k.m దూరములో బుధగ్రహ దేవాలయము వున్నది. ఇక్కడి స్వామి శ్వేతారన్యేశ్వరుడు. అమ్మవారు బ్రహ్మవిద్య అంబికాదేవి.

వాల్మీకి రామాయణములో ఈ దేవాలయము గురించి వుంది అని చెబుతారు. కనుక ఈ ఆలయానికి 3000 ఏళ్ల నాటి చరిత్ర వున్నది అని తెలుస్తుంది .ఇక్కడ బుధగ్రహ దేవాలయము దర్శించిన వారికి వ్యాపారానికి మరియు బుద్ధిని ప్రసాదిస్తాడని 
ఇక్కడ ప్రజలకు నమ్మకము.

5) బృహస్పతి (గురు) గ్రహ దేవాలయము. ఆలంగుడి.

కుంభకోణానికి 18 k.m దూరములో ఆలంగుడి లో గురు గ్రహ దేవాలయము వున్నది. 
ఈ ఆలయాన్ని గురు దక్షిణామూర్తి ఆలయంగా భక్తులు పిలుస్తారు. ఇది తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన దివ్యక్షేత్రము. దీనిని క్రీ.శ 1131 లో విక్రమచోల చక్రవర్తి నిర్మిచారు.

శివుడే దేవ గురువు బృహస్పతి నామదేయముతో గురుదక్షిణామూర్తిగా పూజలు అందుకుంటూన్న పుణ్యక్షేత్రము ఇది. 

పార్వతి అమ్మవారు ఇక్కడి ఆలయం లోపలున్న అమృత పుష్కరిణిలో పునర్జననం పొందిందని కధనం. ఇక్కడే శివునిలో ఐక్యమైందని చెబుతారు. భోలాశంఖరుడు ఇక్కడే హాలాహలంని సేవించి గొంతులో దాచిన స్థలము ఇదే. ఆ విధముగా ఆపద నుంచి గట్టెకించిన శివుణ్ణి ' ఆపత్ సహాయేశ్వరర్ (ఆపద్భాందవుడు) గా కొలిచారు దేవతలు.

గురుడికి ఇష్టమైన గురువారము నాడు, నాన బెట్టిన శనగలను, పసుపుతాడుతో మాలగ చేసి ఇక్కడ గురు గ్రహానికి దండగా వేస్తారు. చదువులో వెనుకబడిన వారు, ఆటంకాలు ఎదుర్కొనేవారు , చేతికొచ్చాక , చేజారిపోయే పరిస్థితులు, ఇలాంటి కష్టాలన్నీ తొలగి పోతాయని నమ్మకము.

గురు గ్రహ దోషాలు వున్నవారు దక్షిణామూర్తి గుడి చుట్టూ 24 ప్రదక్షిణలు చేసి ఈ స్వామి సన్నిధిలో నేతితో 24 దీపాలు భక్తితో వెలిగిస్తే ఆ దోషాలు తొలిగిపోయి, గ్రహ శాంతి కలుగుతుంది అని భక్తుల ప్రగాడ విశ్వాసము.

6) శుక్ర గ్రహ దేవాలయము, కామ్చనూరు.

కంచానూర్లో సూర్య దేవాలయానికి 3 k.m దూరములో శుక్ర గ్రహ దేవాలయము వుంది .
దీనికి పలాశవనం, బ్రహ్మపరి, అగ్నిస్థలము అని పేర్లు కూడా వున్నాయి. ఇక్కడే బ్రహ్మ దేవుడు పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని దర్శించాడట. ఇక్కడ తమ భార్యల ఆరోగ్యము కొరకు తమ భర్తలు పూజలు చేస్తారు.

7) శని గ్రహ దేవాలయము, తిరునల్లార్.

ఇది కుంభకోణానికి 53 k.m దూరంలో , కరైకాల్‌కు 5 కి.మీ దూరంలో వున్నది .ఇక్కడి నది తీర్ధములో స్నానం చేస్తే సర్వపాపాలు హరించిపోతాయి అని భక్తుల నమ్మకము. ఈ ఆలయములో వెలిసిన స్వామివారి పేరు దర్భారన్యేశ్వరుడు, ఈ దేవుడికి గరిక అంటే చాల ప్రీతి. అందుకే ఈ గుడిలో గరిక మొక్కను అతి పవిత్రముగా భావిస్తారు . అందువల్ల ఈ స్వామిని దర్భాదిపతి అని కూడా అంటారు.

ఈ దేవాలయము దర్శించినపుడు భక్తులు దర్భల కొసలు ముడివేస్తారు. ఇలా ముడివేస్తే తమ కష్టాలు గట్టు ఎక్కుతాయని భక్తుల నమ్మకము .ఇచట నలనారాయణ అనే విష్ణు దేవాలయము వున్నది. ఇక్కడ నలదమయంతుల విగ్రహాలు వున్న గుడి ఇదే.
శనీశ్వరునితో పాటు నలదమయంతులకి కూడా పూజ చేస్తే శని ప్రభావము ఉండదు . 

ఇక్కడ బ్రహ్మదండ అనే తీర్ధము కూడ వున్నది. ఇక్కడే నల మహారాజును శని పట్టుకొని పీడించటం ప్రారంభించాడని కధ. ఇక్కడి ‘’నల తీర్ధం ‘’చాలా మహిమ కలిగింది. ఇందులో స్నానం చేస్తే పాపాలన్నీ కొట్టుకు పోతాయ‌ని భ‌క్తుల న‌మ్మిక‌. ఇక్కడ శనీశ్వరునికి నిత్యము అభిషేకము జరుగుతుంది.

8) రాహు గ్రహ దేవాలయము, తిరునగేశ్వరము.

ఈ క్షేత్రం కుంభకోణానికి 5 k.m దూరములో వుంది. రాహు గ్రహామునకు గల దేవాలయము ఇది ఒక్కటే. ఇక్కడ నిత్యము వచ్చే రాహుకాల సమయములో పాలాభిషేకము చేస్తారు. ఆ పాలాభిషేకము జరిపినపుడు రాహువు శిరస్సు పైన నుండి పాలు పోస్తే కంట భాగము (మెడ) దగ్గరకు వచ్చేసరికి పాలు అన్ని నీలము రంగులోకి మారతాయి. మిగిలిన సమయాలలో ఇలా జరగదు.

ఇక్కడి శివుడు నాగనాద స్వామి. అమ్మవారు ‘’గిరి గుజాంబికా దేవి’’. ఇక్కడ ఆదిశేషుడు, దక్షుడు, కర్కోటకుడు. రాహువు స్థలమైన ఈ శివుడిని అర్చిస్తే, పూజలు చేస్తే, అలాంటి వారికి రాహు దోషాలు పోతాయి.

9) కేతు గ్రహ దేవాలయము, కిల్ పేరుంపళ్లమ్.

తిరువేన్నాడ్ నుండి 6 k.m దూరములో వున్నది ఈ కేతుగ్రహ ఆలయం . ఇక్కడ  కేతు గ్రహ దోషానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ ఒకే పళ్ళెంలో 7 ప్రమిదలలో దీపము వెలిగిస్తారు. ఇలా చేసిన వారికి కేతుగ్రహ బాధలు తొలగిపోతాయని విశ్వశిస్తారు . ఇక్కడ కేతు గ్రహానికి సంబందించిన నివారణ పూజలు చేస్తారు. 

ఇక్కడి శివుడు మహా మహిమాన్వితుడు. రాహుకేతువులు జంట సర్పాకారంలో కలిసి ఉండి, క్షీర సాగర మథనంలో శివునికి సాయం చేశారని ప్రతీతి. ఈ రూపాన్ని ఇక్కడ దర్శించవచ్చు . 

ఈ ఆలయాల వద్ద గల 9 పుష్కరిణిలో స్నానములు చేసి 12 వారాలు నవగ్రహాలను ఆరాదిస్తే, ఈ నవగ్రహ అనుగ్రహము లభిస్తుంది అని చెబుతారు . 

నవగ్రహానుగ్రహ ప్రాప్తిరస్తు || 
స్వస్తి..!

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda