Online Puja Services

భక్త కన్నప్ప - నేత్రేశనాయనారు

13.58.121.131

భక్త కన్నప్ప - నేత్రేశనాయనారు. | Bhaktha Kannappa | Netresa Nayanar
లక్ష్మీ రమణ 

పాశుపతాన్ని సాధించడం అర్జనుడికి చాలా అవసరం . అందుకే పరమేస్వరుణ్ణి గురించి ఘోరమైన తప్పస్సుని ఆచరిస్తున్నాడు . భక్త సులభుడైన పరమేశ్వరుడు సంతోషించాడు. సర్వవ్యాపకుడైన స్వామికి ఆ భక్తుని  కోరిక ఏమిటో తెలీదా? అయినా సరే, ప్రసాదించాల్సింది పాశుపతం.  కాబట్టి, వరాన్ని అనుగ్రహించే ముందు అర్జనుని పరీక్షించాలి అనుకున్నాడు. కిరాత వేషాన్ని ధరించి అర్జనుడి ముందు నిలిచాడు.  ఆ తర్వాత అర్జనుడికి శివుడు పాశుపతాన్ని ప్రసాదించినప్పటికీ, శివుడు కిరాతుడై తన ముందు ప్రత్యక్షమయిన  ఆ సమయంలో తనముందు నిలిచింది సాక్షాత్తూ ఆ పరమశివుడే అన్నది అర్జనుడు గ్రహించలేకపోయాడు.  అదే అతన్ని మరుజన్మలో కిరాతునిగా జన్మించేలా చేసింది. శివ లీల చూడండి , ఆ కిరాతుని జన్మమే అర్జనుడికి మహా శివభక్తులైన  నాయనార్ల సరసన చోటు కల్పించింది . ఈ ఉదంతాన్ని శ్రీకాళహస్తీశ్వర పురాణం విశిదంగా తెలియజేస్తోంది.  అర్జనుడు నాయనారుగా మారిన భక్తిరస సమన్వితమైన కథని ఇక్కడ తెలుసుకుందాం . 

  అది పోతప్పినాడు రాజ్యం. అందులో ఉడుప్పూర్ అనే ఒక బోయలగ్రామం ఉంది . దానికి రాజు నాగడు. అతని భార్య దత్త . భార్యాభర్తలిద్దరూ కూడా సుబ్రహ్మణ్యస్వామి భక్తులు. ఆ స్వామి దయ వలన వారికి ఒక కొడుకు పుట్టాడు . అతనికి నాగడు "తిన్నడు" అని పేరు పెట్టి బోయరాజు నేర్చుకోవలసిన విద్యలన్నీ నేర్పించాడు. 

తిన్నడు ఏకసంథాగ్రాహి. విలువిద్యలో గొప్ప యోధుడని పేరుతెచ్చుకున్నాడు.  చిన్న వయసులోనే ఆ బోయ రాజ్యానికి రాజుగా అభిషిక్తుడయ్యాడు .  తిన్నడి మనసు స్వచ్ఛమైనది.  ధర్మము అతని మార్గమయ్యింది .  దాంతో మంచి పాలకుడని పేరుకూడా తెచ్చుకున్నాడు . ధర్మమూ , న్యాయమూ , స్వచ్ఛమైన సమర్పణ  ఎక్కడుంటాయో అక్కడ పరమాత్ముని  ప్రత్యేకంగా ప్రార్ధించాల్సిన అవసరం లేదు.  ఆహ్వానించాల్సిన అవసరం అంతకన్నా లేదు . ఎందుకంటె, ఆయనే  స్వయంగా అక్కడ ప్రకటమవుతాడు. 

బోయ కుల ధర్మమము వేట. వేటాడిన జంతువులని పచనం చేసి ఆహారంగా స్వీకరిస్తారు . వారి దృష్టిలో ఆహారం అంటే అదే. తిన్నడు ఈ ఆటవిక ధర్మంలోనూ జీవకారుణ్యాన్ని పాటించేవాడు . జంతువులలో పిల్లలని, ఆడవాటిని, రుగ్మతతో ఉన్న జంతువులని అతడు వేటాడేవాడు కాదు. ఇదిలా ఉండగా ఒకనాడు తిన్నడు వేటకు వెళ్లాడు. మాంచి అడవిపందిని చూసి వెంటపడ్డాడు. నాముడు , కాముడు అనే తన అనుచరులతో కలిసి దానిని వేటాడుతున్నాడు తిన్నడు . దాదాపుగా ఆ పంది వాళ్ళని స్వర్ణముఖీ నది తీరందాకా తీసుకెళ్లాక, అక్కడ తిన్నడి  బాణానికి బలయ్యింది.  

అలిసిపోయిన తిన్నాడు అతని అనుచరులూ ఆ స్వర్ణముఖీ నదిలో నీటిని త్రాగారు.  ఆ పవిత్ర తీర్థం ప్రభావమేమో, ఆ సమయంలో తిన్నడికి ఎదురుగా ఉన్న శ్రీ కాళహస్తీశ్వరుని పర్వతం దివ్యకాంతులతో కనిపించింది. ఆపైనున్న శివయ్య దేవాలయం తనని ఆహ్వానిస్తున్నట్టు అనిపించింది. “ఆ దేవాలయం ఎవరిది?” అని నాముణ్ణి అడిగాడు తిన్నడు. “అది కుడుము దేవారుది తిన్నా!” అని చెప్పాడు నాముడు. కుడుము దేవారు అంటే పిలక ఉన్న దేముడు అని అర్థం.  ఆ మాట శిఖతో ఉన్న శివుణ్ణి సాక్షాత్కరింపజేసిందేమో తిన్నని మనసులో ! వెంటనే కొండ ఎక్కి ఆయన్ని చూడాలన్న స్ఫురణ , తీవ్రమైన వాంఛ కలిగాయి తిన్నడికి . వెంటనే ఆ కొండపైకి ఎక్కసాగాడు.  

ఈశ్వరుడున్న ఆ  శిఖరం మాత్రం సామాన్యమైనదా! సప్తచక్రాలలో ఉన్నతమైన సహస్రార సమానమైనదికాదూ ! ఒక్కో అంచెనీ అధిగమిస్తుంటే , శరీరం తేలికగా మారుతున్న అనుభూతి కలుగుతోంది . ఆ శిఖరం పైన తన జీవన లక్ష్యం సాకారమవుతున్నట్టు అనిపించింది. నారాయణుణ్ణి చూసిన అన్నమాచార్యునిలా, రాముని దర్శనంతో పరవశించిన త్యాగయ్యలా , రంగని చేరిన రంగదాసిలా తిన్నడు తనని మరచి, తనువు స్పృహని విడిచి ఈశ్వర దర్శనంలో తాదాత్మ్యతని పొందాడు.  

కుడుము దేవారు అని పిలుచుకునే ఆ శివయ్య మీద అనంతమైన ప్రేమ అసంకల్పితంగా అతని ఆత్మలో పెల్లుబికింది. ఈ భావన కలిగేందుకు గతజన్మలో అర్జనుడిగా చేసిన నిరంతర శివారాధన , శివ తపస్సు, వాసుదేవుని సాహచర్యం కారణమయ్యాయేమో కానీ, ఇప్పటి జన్మలో కిరాతసంప్రదాయకుడే కదా ! దాంతో ఆగమవిధులు తెలియని ఆ తిన్నడు తన పద్ధతిలో ఈశ్వరార్చన ఆరంభించాడు . ఆ శివ లింగమును రెండుచేతులతో గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ స్వామిని ముద్దులతో ముంచేశాడు . ఆత్మానందంతో తన  కన్నులు వర్షించిన ఆనంద భాష్పాలతో అభిషేకించాడు . 

అంతేనా , "అయ్యో! శివయ్యా ! ఇంతదట్టమైన అడివిలో ఒంటరిగా ఎట్టాగున్నవు? నీకు ఆకలైతే బువ్వ ఎవరు పెడతారు ? క్రూర మృగాలు తిరిగే ఈ చోట నిన్నెవరయ్య కాపాడతారు?” అంటూ అమాయకంగా, స్వచ్ఛంగా బాధపడిపోయాడు. అనంత సృష్టి తనలోనే నింపుకొని సృష్టిస్థితిలయలు తన కనుసన్నలలో చేసే ఆ స్వామికి తోడూ, నీడా, గూడూ అవసరమా? ఆకలిదప్పులు ఉంటాయా ? కానీ ఆ స్వామి మీదున్న అనంతమైన ప్రేమ , అనురాగం తిన్నడిలో అటువంటి భావాలని ప్రేరేపించాయి. దాంతో “ ఇగో స్వామీ ! ఇవాళ నుండీ నిన్ను ఇట్టా ఉండనీయను.  నీకు నేను వేట తెస్తా ! నీకు తోడుగా రక్షణగా ఇక్కడే ఉంటా! నీకు మరేం భయం లేదు!” అని ఈశ్వరునికి అభయమిచ్చాడు తిన్నడు. అంతేకాదు ఆయనకీ మంచిగా పచనం చేసిన పందిమాంసం ముక్కలు తేవడానికి కొండదిగడం ఆరంభించాడు . 

అప్పటికే కొండకింద కాముడు వేటాడిన పందిమాంసాన్ని చక్కగా కాల్చి ఆకుదొన్నెల్లో పెట్టి ఉంచాడు. శబరి ఏ పండు రుచిగా ఉందో, తానూరుచిచూసి రాములోరి అర్పించింది.  అలా ఏ మాంసం ముక్క మెత్తగా , బాగా కాలి, రుచికరంగా తయారై ఉందొ రుచిచూసి వాటిని ఎంచి పక్కన ఉంచనారంభించాడు తిన్నడు.  “ ఎవరికయ్యా  తిన్నా ఆ ఎంచిన ఆహారం?” అన్నాడు నాముడు. “ఇది కొండమీదున్న శివయ్యకి పెట్టడానికి తీసుకుపోతున్నా”నన్నాడు తిన్నడు. “శివయ్యకా ! ఆయనకీ ఆహారం పెట్టె ముందు, తలమీద నీళ్ళు పొయ్యాలి . ఇన్ని పూలు కూడా ఎట్టాలి.” అని తనకు తెలిసిన పూజని చెప్పాడు నాముడు.  

సరేనని తిన్నడు తిన్నగా ఆ స్వర్ణముఖీ నది దగ్గరికి వెళ్ళాడు. పుక్కిటి నిండా నీరు పట్టాడు.   అక్కడ ఉన్న తామర పుష్పాలని తెంపి వాటి కాడలని తననోటిలో జాగ్రత్తగా ఇరికించాడు. ఇక  ఒక చేతిలో ఆ మాంసఖండాలు నింపిన ఆకు దొన్నె పట్టుకొని , మరో చేతిని ఆసరాగా చేసుకొని కొండయెక్కాడు. నోటిలో ఉన్న నీటిని ఆ ఈశ్వర లింగం పైన వదిలాడు . అది శివాభిషేకం అయ్యింది.  పూలని ఆయనమీద పడేశాడు . అది పుష్పార్చన అయ్యింది.  మాంసఖండాలని నివేదించాడు. అది అమృతనైవేద్యమయ్యింది. ఆపై రాత్రంతా ఆ లింగం ముందు జాగరణ చేస్తూ, విల్లు బాణాలు పట్టుకొని కాపలా కాసేవాడు తిన్నడు . రోజూ ఇదే తంతు. నాముడు, కాముడూ తిరిగి గూడేనికి పోదామన్నా తిన్నాడు పోనే లేదు. పైగా తల్లిదండ్రులు వచ్చి బ్రతిమలాడినా తన శివయ్యని వీడేదేలేదని తెగేసి చెప్పాడు.    

తిన్నడి వ్యవహారం ఇలా,  ఆ శివాలయంలో అర్చకుడైన శివగోచారి బాధ మరోలా ఉంది.  ఆగమ విహితంగా పూజించే ,  నిష్టాగరిష్టుడైన సద్బ్రాహ్మణుడు ఆ శివగోచారి.  నిత్యమూ తానుచేసే పూజని కాదని, మాంస ఖండాలని గర్భాలయంలో ఉంచడం ఆయనకీ భరింపశక్యం కాకుండా ఉన్నది . తిన్నాడు వేటకి వెళ్ళిన సమయంలోనే ఆయన రావడం వలన వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ఎదురుపడలేదు. శివగోచారి ప్రతిరోజూ  మంత్ర యుక్తముగా స్వామికి సంప్రోక్షణ చేసి,  మళ్ళీ స్నానము చేసి, మడిగా కుండలో స్వర్ణముఖీ జలములు తీసుకొచ్చి  అభిషేకము చేసి, పూలతో అలంకారం చేసి , విభూతి పూసి వెంటతెచ్చిన పళ్లు మధుర పదార్ధములు నివేదన చేసి వెళ్ళేవాడు . అలా ఆయన వెళ్ళగానే , తిన్నడు తనపద్ధతిలో అర్చనలు చేసేవాడు.  ఈ విధంగా ఐదు రోజులు జరిగాయి. 

పూజారి శివగోచారి ఆ అనాచారాన్ని సహించలేకపోయాడు . ఆపై ఇక ఉండబట్టలేకపోయాడు. దుఃఖంతో ఆ ఈశ్వరునికి మొరపెట్టుకున్నాడు. "ఈ ఘోర కలిని ఆపవయ్యా శివయ్య” అని ఆవేదనతో ఎలిగెత్తి ప్రార్ధించాడు. శివుడు శివగోచారికి తిన్నడి భక్తి ఎలాంటిదో పరిచయం చేయాలి అనుకున్నాడు. భక్తి ఆచారమా, అనాచారామా  కాదాయనకి ముఖ్యం . భక్తి మాత్రమే ముఖ్యం అని శివగోచారికి తెలియజెప్పాలని భావించాడు . 

మరుసటిరోజు శివగోచారిని లింగమువెనుక దాగి ఉండి , అక్కడ జరిగే తంతుని గమనించమని, ఏం జరిగినా బయటికి రావద్దని ఆదేశించారు. 

 అది ఆరవనాటి ఉదయం.  శివగోచారి ప్రాతః కాల పూజావిధిని నిర్వహించి , శివాదేశానుసారం లింగంవెనుక దాగిఉన్నాడు .  ఇంతలో యథావిధిని తిన్నడు ఆలయానికి వచ్చాడు. శివుని లీలావిలాసం ఆరంభమయ్యింది . ఆయన   కుడికన్ను నుండి రక్తము కారడం మొదలయ్యింది . అది చూడగానే దెబ్బతగిలిన పిల్లవాడిని చూసిన తల్లిలా తిన్నడి మనసు అల్లకల్లోలం అయిపొయింది .  అర్చన కోసమని తానూ తెచ్చిన వస్తువులన్నీ పక్కనపడేసి, తనకు తెలిసిన మూలికా వైద్యాన్ని ఉపయోగించి యేవో పసరులు తెచ్చి ఆ కంటికి పూశాడు.  వెంటనే శివుని కంటినుండీ రక్తం ఆగకపోగా, మరింత ఉదృతంగా కారసాగింది . కంటికి మారుగా కన్నే మందు అనుకున్నాడు తిన్నడు. వెంటనే తన కన్నుని బాణం మొనతో పెకిలించి ఈశ్వరునికి పెట్టాడు . ఆశ్చర్యకరంగా ఆ కన్ను బాగయింది . రక్తధారలు ఆగిపోయాయి. 

తిన్నడు తల్లిప్రేమని ప్రదర్శించాడు . సంతోషించాడు .  లింగానికి తిరిగి ముద్దులు పెట్టాడు . తన కంటి నుండీ ధారలు కడుతున్న రక్తాన్ని, నొప్పిని మరచి , శివయ్య కన్ను బాగయ్యిందన్న ఆనందంతో నృత్యం చేశాడు . అంతలోనే ,  శివుని ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావడం ఆరంభించింది. మందు తెలిసిపోయింది . ఆలోచించలేదతను. తన రెండవకన్నుకూడా పెకిలించాక, శివుని కన్ను ఎక్కడుందో గుర్తించలేడు.  కాబట్టి శివుని కన్ను వద్ద తన పాదం బ్రొటనవేలిని గుర్తుగా పట్టి,  రెండవకంటిని పెకలించబోయాడు. అంతే ! ఒక్క సారిగా ముక్కంటి అక్కడ ప్రత్యక్షమయ్యి , కన్నప్పా ! ఆగు .  అని మూడు సార్లు హెచ్చరిస్తూ, చేయిపట్టి ఆపాడు .  

అనుగ్రహించి ,” కన్నప్ప ! అనితర సాధ్యమైన నీ భక్తికి మెచ్చాను. నా పట్ల  నీ ఆత్మీయత , నీ తపన మునులు చేసే తపస్సు కన్నా మిన్నైనది . స్వచ్ఛమైన , కల్మషంలేని మనసుతో నువ్వు చేసిన అర్చనలకి, నీ భక్తికి మెచ్చాను.” అని ప్రశంసించాడు. తిరిగి నేత్రాలని ప్రసాదించాడు . శివగోచారికి తిన్నని నిర్మలమైన భక్తి తెలిసివచ్చింది . అప్పటినుండీ అనితర శివ భక్తుడై కన్నప్పగా సుప్రసిద్ధుడై అంత్యాన శివలోకమును పొందాడు భక్త కన్నప్ప . 

భక్త కన్నప్పని నేత్రేశనాయనారు అని అంటారు . కన్నప్ప నాయనారు అని కూడా వాడుకలో ఉంది .  తెలుగువారికి భక్త కన్నప్ప తెలియనివారేమీ కాదు కదా ! ఆ విధంగా అరిషడ్వార్గాలని , బంధాలనీ, అనుబంధాలనీ కూడా వద్దని నిర్మల భక్తితో ఈశ్వరునికి సర్వశ్యశరణాగతి చేసిన కన్నప్ప 63మంది నాయనార్లలో చోటు దక్కించకున్నారు . శివభక్త శిఖామణిగా అనితర సాధ్యమైన శివలోక సాయుజ్యాన్ని పొందాడు.  

శివయ్య అందరివాడూ ! భక్తితో ఎలా పిలిచినా పలుకుతాడు.  అన్నింటా నిండిన పరమాత్మ ఆ ఈశ్వరుడు. తిన్నని భక్తి కథతో ఆయన ముందర  వెలిగించిన ఈ చిరుదివ్వె మనలో ఆధ్యాత్మిక వెలుగులు నింపాలని, సనాతనధర్మం వర్ధిల్లాలని ఆశిస్తూ … సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి పాదారవిందార్పణ మస్తు !

 

Bhaktha Kannappa, Netresa Nayanar

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi