Online Puja Services

కోరిన కోర్కెలు త్వరగా తీర్చి, ఆరోగ్యాన్నిచ్చే వృద్ధకాశీ .

13.58.60.192
కోరిన కోర్కెలు త్వరగా తీర్చి, ఆరోగ్యాన్నిచ్చే వృద్ధకాశీ .  
- లక్ష్మి రమణ 
 
 కాశీ కన్నా పురాతనమైన పుణ్యప్రదమైన దివ్యప్రదేశం వృధ్ధాచలం. కాశీ కన్నా పురాతనమైనది అని అంటే ఆశ్చర్యపోకండి మరి ! ఈ ఆలయ స్థలపురాణం చెబుతున్న మాట ఇది . తమిళనాడులోనే కాదు ఇది ఈ భూమిమీదే అతి ప్రాచీనమైన ఆలయం. కేవలం అరుణాచలమే కాదు, తమిళనాట ఉన్న వృద్ధాచలం కొండ కూడా స్వయంగా ఆ పరమేశ్వర స్వరూపమే . వృద్ధ కాశీగా పేరొందిన ఈ క్షేత్రాన్ని దర్శిస్తే, కోరికలు త్వరగా నెరవేరతాయట . అనేకానేక మహిమలతో కూడిన అతి పురాతనమైనవాడు , అందుకే వృద్దుడు , వృద్ధాచలేశ్వరుడు అని పేరొందినవాడు అయిన ఈశ్వర దర్శనం చేద్దాం రండి !
 
స్థల ఐతిహ్యం : 
 
 అది బ్రహ్మ దేవుడు సృష్టి చేయాలని ప్రయత్నిస్తున్న సమయం. అనంత జలరాశిలో భూమి కోసం ప్రయత్నిస్తూ, పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా సమయం. అప్పుడు మధుకైటభులని విష్ణుమూర్తి సంహరించారు .  వాళ్ళ శరీరాలు నీటిమీద మహా  పర్వతాలలాగా తేలాయి . పరమ శివుడు కూడా బ్రహ్మ కోరిక మీద ఒక పర్వత రాజంగా అవతరించారు . ఆ మధుకైటభుల శరీరాల్ని జలంతో కలిపి మేథిని అనే పేరుతొ భూమిని సృష్టించారు.  అయితే వీటన్నింటికన్నా ముందుగా తానే  పర్వతంగా, భూమిగా అవతరించి, ఆ భూమి , తానూ ఒక్కటే అనే సత్యాన్ని బ్రహ్మదేవునికి తెలియజేశారు.  అలా పర్వతంగా దర్శనమిచ్చిన పరమేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు పూజించారు.  ఆ వృద్ధ గిరీశ్వరుడే వృద్ధాచల పరమేశ్వరుడు .     
 
                                                            ఈ దివ్య క్షేత్రాన్ని వృద్ధకాశీ అని పిలుస్తారు . శైవులకి ముఖ్యమైన క్షేత్రాలు 108 వున్నాయి.  వాటిలో 4 క్షేత్రాలు అతి ముఖ్యమైనవాటిగా చెప్తారు.  అందులో తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో విరుదాచలం అతి పురాతనమైన క్షేత్రం.  ఇది కాశీకన్నా పురాతన క్షేత్రమని, ప్రళయకాలంలో కూడా చెక్కు చెదరకుండా నిలిచిందనీ భక్తుల నమ్మకం.   ఇది అతి పురాతనమైన క్షేత్రంగనుక, ఇక్కడ స్వామిని సేవించినవారికి కాశీలో విశ్వనాధుని సేవించినదానికన్నా కొంచెం ఎక్కువ పుణ్యం వస్తుందంటారు.  పైగా ఇక్కడ పరమ శివుడు ఆనంద నాట్యం చేశాడంటారు.  ఇక్కడ పుట్టినా, గిట్టినా, నివసించినా, భగవంతుణ్ణి ప్రార్ధించినా, ఈ స్వామిని తలచినా మోక్షం లభిస్తుందంటారు.
 
వన్ని చెట్టు ఆకులే కూలీగా ఇచ్చిన వృద్ధాచలేశ్వరుడు : 
 
 పూర్వం ఒకసారి ఈ ఊరి ప్రజలు కరువు కాటకాలతో, చాలా ఇబ్బందులలో వుంటే, స్వామి నాకు సేవ చేయండి, చేసినవారికి చేసినంత ఫలితం లభిస్తుందని  చెప్పాడుట.  ఆ సమయంలో  విభాసిత మహర్షి ఇక్కడ మణిముతా నదిలో స్నానం చేసి, ఈ ఆలయ పునరుధ్ధరణ కార్యక్రమం చేపట్టారు .  అక్కడ పనిచేసిన వారికి ఆయన స్ధల వృక్షమైన వన్ని చెట్టు ఆకులు కూలీకింద ఇచ్చేవాడుట. ఆ మనిషి చేసిన పని, దాని నాణ్యతకు తగినట్లుగా ఆ ఆకులు నాణాలుగా మారేవిట.  అప్పటినుంచే చేసినవారికి చేసినంత, చేసుకున్నవారికి చేసుకున్నంత అనే నానుడులు వచ్చాయంటారు. ఈ వృక్షం 1700 సంవత్సరాల క్రితందని పరిశోధకులు చెప్తారు!! ఒ
 
సుందరార్ కూ బాగారునాణాల బహుమతి : 
 
కసారి సుందరార్ అనే గాయక భక్తుడు తిరువారూర్ కి బయల్దేరాడు.  ఆయన  ఈ క్షేత్రంనుంచి వెళ్తూకూడా స్వామిని స్తుతించకుండా పోబోతే, స్వామి ఆయనని ఆపి, పాడించి మరీ బహుమతిగా 12,000 బంగారు నాణాలు ఇచ్చాడుట.  ఆ నాణాలు సుందరార్ తీసుకు వెళ్తే దోవలో దొంగల భయం ఎక్కువగా వుండటంవల్ల నష్టపోతాడేమోనని ఆ నాణాలను మణి ముత్తానదిలో వేసి తిరువారూర్ వెళ్ళాక అక్కడ ఆలయంలో వున్న  కొలనులోంచి తీసుకొమ్మని చెప్పాడుట.  ఆయన అలాగే తీసుకున్నాడుట.  ఇది భగవంతుని అద్భుత లీల కాకపోతే ఏమిటి!?
 
 వృధ్ధాచలంలో నదిలో వేసిన నాణాలు తిరువారూరు కోవెల పుష్కరిణిలోంచి, అందులో రెండింటికీ ఏ విధమైన అనుసంధానమూ లేదు, తీసుకోవటమేమిటి భగవంతుని మాయకాకపోతే!!  సుందరార్ కి ఆ నాణాల విషయం అనుమానం వస్తే అవి నిక్కమైనవేనని పరీక్షించి చెప్పినవాడు వినాయకుడు!  ఎంత చిత్రమో చూడండి!!  తండ్రి ఇచ్చిన నాణాలని సర్టిఫై చేసిన కొడుకు విఘ్నేశ్వరుడు!  
 
కోరిన కోరికలు త్వరగా తీరతాయి  : 
 
అరుణాచలం (తిరువణ్ణామలై)లో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికీ భక్తులు ఇక్కడా గిరి ప్రదక్షిణ చేస్తారు.  ఇక్కడ వల్లీ దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువుతీరి వున్నాడు.  ఈయన ఆలయంలో పైన చక్రాలుంటాయి. అవి శ్రీ చక్రం, సుబ్రహ్మణ్య చక్రం, అమ్మవారి చక్రం.   సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువ శివాలయాలలో చూస్తాము.  అందులో ఇది ఒకటి.  అందుకే ఇక్కడ స్వామికి విన్నవించుకున్న కోరికలు త్వరగా తీరుతాయట.  
 
28 శివలింగాలు స్థాపించిన సుబ్రహ్మణ్యుడు : 
 
శైవ సిధ్ధాంత ప్రకారం 28 ఆగమ శాఖలు వున్నాయి.  సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ 28 సిధ్ధాంతాలకు ప్రతీకగా 28 శివ లింగాలను ఇక్కడ ప్రతిష్టించి పూజించాడు.  ఆ సిధ్ధాంతాల పేర్లతోనే శివుని పేర్లు కూడా కామికేశ్వరుడు, యోగేశ్వరుడు వగైరా పేర్లు కూడా చూడవచ్చు.   ఈ విశేషంవల్ల ఈ ఆలయానికి ఆగమ ఆలయమనే పేరుకూడా వున్నది.  ఈ విశేషం వున్న ఆలయం ఇది ఒక్కటే.  ఇక్కడ వున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలోనే ఈ శివ లింగాలు వున్నాయి.  ఈ ఆలయం ప్రధాన శివాలయానికి నైఋతి మూలన వున్నది. ఆలయంలోకి ప్రవేశిస్తూనే ఎడమవైపు కనిపించే ఉపాలయంలో విఘ్నేశ్వరుడు కొలువు తీరి వున్నాడు.
 
 విఘ్నేశ్వర ప్రశస్తి : 
 
శ్రీ కాళహస్తిలో లాగానే  ఇక్కడ విఘ్నేశ్వరుడు భూతలంనుంచి కిందకి వున్న ఆలయంలో వుంటాడు.  ఈయనని దర్శించటానికి 18 మెట్లు దిగి వెళ్ళాలి. 
 
అమ్మవారు వృధ్ధాంబిక:
 
ఇక్కడి అమ్మవారి పేరు వృధ్ధాంబిక.  పూర్వం నమశ్శివాయార్ అనే భక్తుడు చిదంబరం వెళ్తూ ఒక రాత్రి ఇక్కడ బస చేశాడు.  ఆయనకి బాగా ఆకలయింది.  పరమేశ్వరిని ఆకలి తీర్చమంటూ చేసిన స్తుతిలో అమ్మని   “కిజతి”   అంటే పెద్దావిడ, ముసలావిడ అనే పదం వాడాడు.  ఆ తల్లి వృధ్ధురాలి వేషంలో వచ్చి, నమశ్శివాయార్ తో ముసలివాళ్ళు భోజనం పెట్టలేరు, చిన్నవాళ్ళే పెట్టగలరని చెప్పిందట.  అప్పుడు ఆ భక్తుడు అమ్మవారిని యువతిగా వర్ణిస్తూ పాడేసరికి అమ్మ ఒక యువతిగా వచ్చి ఆయనకి భోజనం పెట్టిందట.  అప్పటినుంచి అమ్మని బాలాంబిక అంటారు.  
 
చితాభస్మం : 
 
చనిపోయిన వారి చితా భస్మాన్ని ఇక్కడున్న మణి ముత్తా నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్ళుగా మారి నది అడుగున వుంటాయిట.
 
 ఆలయ ప్రత్యేకతలు :                                                                 
 
ఇక్కడ శివుడు స్వయంభువుడు.  ఇక్కడ శివుణ్ణి ప్రార్ధించినవారికి మనశ్శాంతి కలగటమేకాక అన్ని రకాల శరీర రుగ్మతలనుండి వెంటనే విముక్తి కలుగుతుంది.
 
 ఇక్కడ వున్న దుర్గాదేవిని పూజిస్తే వివాహం, పిల్లలు పుట్టటం, వగైరా కోరికలు నెరవేరటమేకాక, జీవితంలో  అభివృధ్ధికి ఆటంకాలు కూడా తొలుగుతాయి. 
 
ఆదివారం, రాహుకాల సమయంలో .. అంటే 4-30 నుంచి 6 గం. ల దాకా .. భక్తులు ఇక్కడ భైరవుడికి వడమాల వేసి పూజలు చేయిస్తారు.  దీనివలన ఒకటి తర్వాత ఒకటిగా వచ్చే కష్టాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. 
 
ఈ ఆది దేవుణ్ణి ఇక్కడ కొలిచినవారికి ఈ జన్మలో సుఖంగా వుండటమేగాక, పై జన్మలోకూడా మంచి జీవితం లభిస్తుందని భక్తుల నమ్మకం.
 
 ఆలయంలో 5 నెంబరుకు విశిష్టత వున్నది.  ఈ ప్రాంగణంలో పూజలందుకునే మూర్తులు 5.  వారు వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు. ఇక్కడ స్వామికి 5 పేర్లున్నాయి.  విరుధ గిరీశ్వరుడు, పఝమలైనాధార్, విరుధ్ధాచలేశ్వర్, ముద్దుకుండ్రీశ్వరుడు, వృధ్ధ గిరీశ్వరుడు. ఇక్కడ 5 వినాయక విగ్రహాలున్నాయి. ఐదుగురు ఋషులు స్వామి దర్శనం చేశారు.  వారు రోమేశుడు, విబాశిధ్ధు, కుమారదేవుడు, నాదశర్మ మరియు అనవర్ధిని. ఆలయానికి 5 గోపురాలు, 5 ప్రాకారాలు,  5 మండపాలు, 5 నందులు వున్నాయి. వేకువఝామునుంచి రాత్రిదాకా స్వామికి నిర్ణీత సమయాల్లో 5సార్లు పూజలు చేస్తారు. ఆలయానికి 5 రధాలున్నాయి.  వినాయకుడికి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి, పఝమలైనాధార్ కి, పెరియనాయకికి (శివుడు, పార్వతి), వీరభద్రుడికి. 5 పేర్లున్నాయి.  తిరుముద్దుకుండ్రం, వృధ్ధకాశి, వృధ్ధాచలం, నెర్ కుప్పాయ్, ముద్దుగిరి. పరమ శివుడు నటరాజ రూపంలో నాట్యానికి ప్రసిధ్ధి.  ఈయన చిదంబరంలో కాళితో పోటీపడి నృత్యం చేస్తే, ఇక్కడ వృధ్ధాచలంలో తన సంతోషంకోసం నాట్యం చేశాడుట.  అంటే స్వామి సంతోష తరంగాలలో తేలిపోతూ ఇక్కడ నాట్యం చేశాడు.  అంతటి పవిత్ర ప్రదేశం ఇది. 
 
 వృధ్ధాచలాన్ని వృధ్ధ కాశి అని కూడా అంటారు.  కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది అంటారు.  ఇక్కడి స్ధల పురాణం ప్రకారం వృధ్ధకాశీ అని చెప్పబడే ఈ వృధ్ధాచలంలో మరణించిన వారికి అంతకన్నా కొంచెం ఎక్కువ పుణ్యమే వస్తుందిట.  కాశీలో చెప్పబడ్డట్లుగానే ఇక్కడకూడా చనిపోతున్నవారి శిరస్సు తన ఒడిలో వుంచుకుని అమ్మ వృధ్ధాంబిక తన చీరె కొంగుతో విసురుతూండగా, వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి, వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు.
 
 దర్శన సమయాలు
 
ఉదయం 6 గం. ల నుంచి 12 గం. ల దాకా, తిరిగి సాయంకాలం 3-30 నుంచి 9 గం.
 
ఇలా వెళ్లొచ్చు : విల్లుపురం దాకా రైలు సౌకర్యం ఉంటుంది. దగారి విమానాశ్రయం చెన్నై . బస్సు సౌకర్యం చెన్నై నుండీ సరాసరి వృద్ధాచలం వరకూ ఉంటుంది . 
 
యాత్రా విశేషాల రచయిత్రి శ్రీమతి PSM లక్ష్మి గారి రచన ఆధారంగా కృతజ్ఞతలతో .  

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda