Online Puja Services

ఈ భువిపైన వెలసిన తొలిశివాలయం ఇదేనా ?

3.143.9.115

ఈ భువిపైన వెలసిన తొలిశివాలయం ఇదేనా ?
లక్ష్మీ రమణ 

లింగాకారుడైన పరమేశ్వరుడు గర్భగుడిలో ఎలా దర్శనమిస్తారు ? జ్యోతిర్లింగ క్షేత్రాలన్నీ దర్శనం చేసినా కూడా , శివుడు పానవట్టం లేదా యోని ఉంది, దాని మధ్యలో లింగాకృతిగా సృష్టి స్వరూపంగా కనిపిస్తారు. కానీ , తెలుగు నేలపైనున్న ఒక ఆలయంలో అందుకు భిన్నంగా శివస్వరూపాన్ని దర్శించుకోవచ్చు. క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న ఈ ఆలయంలో స్వామిని దర్శించుకోవడం అంటే, ఆ భూతనాథుని దర్శించుకోవడమే ! 

 ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో ఉంది. ఇది రేణిగుంట నుండీ 7 కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖీనదీ తీరంలో వెలసి ఉంది. ఈ ఆలయం  క్రీస్తుశకం 1వ శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులంటున్నారు. 1911లో గోపీనాధరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడు. ఇదే ప్రపంచంలోని తోలి శివాలయం కావొచ్చన్న అభిప్రాయాలున్నాయంటే, ఈ శివాలయం ప్రాచీనత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు . 

గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత కలదు.ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము మరియు ముఖమండపముల కన్నా లోతులో ఉంటుంది . ఇక్కడ గర్భగృహములో ప్రతిష్టించబడిన శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు. ఈ లింగము ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. లింగము సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది. 

 లింగముపైన ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా వ్యక్తమవుతున్న శివుడు, అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన (స్థానకమూర్తి) రూపంలో ఉన్నాడు. స్వామి రెండు చేతులతో ఉన్నాడు. కుడిచేతితో ఒక గొర్రెపోతు (తలక్రిందుగా) యెక్క కాళ్ళు పట్టుకొనగా, ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప)ను పట్టుకొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రము) ధరించి ఉన్నాడు. ఆ వస్త్రము మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనుపిస్తున్నాయి. ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీరభాగములు స్పష్టముగా కనుపిస్తున్నాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం.  ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకుఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది.

 గండ్ర గొడ్డలిని ధరించి ఉన్నశివలింగంపైనున్న రూపం  పరశురాముని ప్రతిరూపం కావొచ్చు. అందుకేనేమో, ఆయన పరుశురామేశ్వరుడు అయ్యారు. పరుశురాముడు , విష్ణు స్వరూపం . ఇక ఆయన కాళ్ళ కింద ఉన్న అపస్మారక మూర్త్తి , చిత్రసేన అనే యక్షుడనీ  చెబుతారు . పరుశురాముడు తల్లి రేణుకాని తండ్రి జమదగ్ని ఆదేశానుసారం సంహరించేశాక , తిరిగి బ్రతికించుకున్నప్పటికీ, ఆ బాధనుండీ ఉపశమనాన్ని పొందలేకపోయారట. అలాంటి స్థితిలో మనశ్శాంతిని పొందేందుకు  ఈ ప్రాంతంలో ఒక తటాకాన్ని నిర్మించి, ప్రతిరోజూ అందులో ఉద్భవించే ఒకేఒక పూవుతో ఇక్కడి మహేశ్వరున్ని అర్చించేవారట. ఆ ప్రత్యేకమైన పూవుని రక్షించేందుకే  చిత్రసేన అనే యక్షుణ్ణి కాపలాగా ఉంచారట. ఈ చిత్రసేన బ్రహ్మదేవుని ప్రతిరూపం. చివరికి ఒకనాడు ఆయన పూవుని రక్షించలేకపోవడంతో చిత్రసేనని సంహరించబోతున్న పరుశురామునికి శివయ్య దర్శనమిచ్చి, ఇక్కడ  వారిరువురికీ సాయుజ్యాన్ని అనుగ్రహించి, తన రూపంలో వారిని కూర్చుకొని వ్యక్తం అయ్యారని స్థల పురాణం. 

చోళ,పల్లవ,గంగపల్లవ,రాయల కాలంలో నిత్యం ధూప,దీప,నైవేద్యాలతో కళకళలాడిన ఆలయం ఇది , గతంలో ఎపుడో ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇట్లాంటి శిల్పం ఉంది. ఇక ఇంగువ కార్తికేయ శర్మ రాసిన ‘పరమేశ్వర టెంపుల్‌ ఎట్‌ గుడిమల్లం’ ‘డెవలప్‌ మెంట్‌ ఆఫ్‌ ఎర్లీ శైవ ఆర్ట్‌ అండ్‌ అర్కిటెక్చర్‌ ‘ అనే రెండు పుస్తకాలు ,మరి కొన్ని శిల్ప,కళా చరిత్ర పరిశోధన పత్రాలు మినహా ఈ గుడి గురించి మరే ఇతర సమాచారం లేదు.

ఇలా చేరుకోవచ్చు. 
రేణి గుంటకు రైలు సౌకర్యం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యంత సమీపంలోనే ఈ ఆలయం ఉంది కనుక , తిరుపతికి వెళ్లే యాత్రికులు ఈ ఆలయ దర్శనం కూడా చేసుకోవడం సౌకర్యంగా ఉంటుంది. త్రిమూర్తి స్వరూపమైన ఈ శివలింగాన్ని దర్శించడం వలన గ్రహబాధలు, దుస్సాహపీడలు వదిలిపోతాయని , శత్రు జయం కలుగుతుందని ప్రతీతి . 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi