Online Puja Services

నారదుడు దర్శించిన పరమేశ్వర రూపవిలాసం

18.117.183.150

ఇహపర సౌఖాలని అనుగ్రహించే నారదుడు దర్శించిన పరమేశ్వర రూపవిలాసం  !!
- లక్ష్మి రమణ 

నారద మహర్షి జగదాచార్యుడు.  జగదానందకారకమైన రామ కథని దర్శించి, దృశ్య కావ్యంగా అందించిన ఆ వాల్మీక మహర్షికె గురువైన వారు . ఆయన త్రిలోక సంచారి . ఆ మహానుభావుని స్మరణ లేకుండా ఏ పురాణమూ లేదంటే అతిశయోక్తి కాదు . అటువంటి నారదుడు దర్శించిన సాక్షాత్తూ శివ దర్శనం ఆయన కనులతో మీరు దర్శించాలి అనుకుంటే, ఈ లింక్ పైన క్లిక్ చేయండి . రమణీయమైన ఈ శివ దర్శనం చేసుకున్నవారికి ఇహ పరాలలో అవసరమైన సౌఖ్యాలన్నీ సిద్ధిస్తాయని స్కాంద పురాణం చెబుతోంది . 

ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారద మహర్షి పరమేశ్వరుని దర్శించుకోవడానికి చంద్రుడి లాగా తెల్లగా ప్రకాశించే కైలాస పర్వతానికి వెళ్ళారు.  అక్కడ ఉన్న దివ్యమైన వాతావరణ శోభని ఒకసారి నారద మహర్షి మాటల్లో దర్శించండి . ఎంత గొప్పగా ఉందొ !! 

అమృతం సేవించబడుతున్నట్టుగా ఉన్న ఆ కైలాసం కర్పూరం లాగా తెల్లగా అద్భుతంగా ఉండటం చూసి, నారదుడు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని పొందారు .  దివ్యమైన ఆ కైలాసం,  గానం చేస్తున్న విద్యాధర స్త్రీలతో ఎంతో గొప్పగా ఉంది.  ఎన్నో కల్ప వృక్షాలు లతలతో పని వేసుకుని కనిపిస్తున్నాయి.  ఆ కల్ప వృక్షాల నీడలలో విశిష్టమైన కామధేనువులున్నాయి.  అక్కడున్న పారిజాత వృక్షాల పూల వాసనలు పీల్చాలని తుమ్మెదలు తిరుగుతున్నాయి.  ఆ పర్వతం మీద ఉన్న సరస్సుల్లో కలహంసలు అందంగా సంచరిస్తున్నాయి.  నెమళ్ళు ఆనందంగా కేకా రావాలు చేస్తూ నర్తిస్తున్నాయి.  దించిన పక్షులు పంచమస్వరంతో అందంగా అరుస్తున్నాయి. ఎంతో గంభీరంగా కనిపిస్తున్న మత్తగజాలు ఆడ ఏనుగులతో విహరిస్తున్నాయి.  సింహాలు భీకరంగా గర్జిస్తున్నాయి.  నందిలాంటి వృషభరాజాలు నిరంతరం అంబారావాలు చేస్తున్నాయి. 

అక్కడున్న ఎన్నో రకాల దేవదారు, చందన వృక్షాలు, నాగ, పున్నాగ, చంపక, నాగకేసర, నేరేడు, బంగారు కేతుక వృక్షాలు చాలా అద్భుతంగా ఉన్నాయి . ఇటువంటి వృక్షాలు శివుడికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.  అక్కడ ఆకాశం నుంచి జాలువారుతున్న గంగా ప్రవాహం పరమాద్భుతంగా ఆ కొండ లోయల్లో పడి ప్రవహిస్తోంది. ఆ గంగ నీళ్లతోనే ఈ ప్రపంచమంతా పవిత్రం చేయబడుతూ ఉంది.  ఆ ప్రవాహం ఆదిదంపతుల ప్రతీక అన్నట్టుగా రెండుగా కనిపిస్తోంది.  

నారదుడు ఆ సుందరమైనటువంటి దృశ్యాలను చూస్తూ, ఆనందిస్తూ క్రమంగా కైలాస ద్వారం దగ్గరికి వెళ్ళాడు.  ఆశ్చర్యకరంగా ఇద్దరూ కృత్రిమ ద్వార పాలకులు విశ్వకర్మ చేత చేయబడినటువంటి వారు అక్కడున్నారు.  వారిని చూసి నిజమైన వారిని భ్రమపడ్డ నారదుడు వారి దగ్గరికి వెళ్లి అయ్యా దయచేసి శివున్ని దర్శించడానికి నన్ను అనుమతిస్తారా? అని ప్రార్థించాడు.  వారాయన మాటలు వినకపోవడానికి చూసి నారదుడు ఆశ్చర్యపోయాడు కొద్దిసేపటికి ఆయనకి అర్థమైంది ఆ ద్వారపాలకులు ఇద్దరు నిజమైన వారు కారని నెమ్మదిగా కైలాస ద్వారం దాటి లోపలికి ప్రవేశించాడు.

 దారిలో నిజమైన ద్వార పాలకులు కనిపించి నారదుడికి నమస్కరించారు . ఈ విధంగా ఎన్నో విచిత్ర దృశ్యాలను చూస్తూ నారదుడు చివరికి కైలాస శిఖరం మీద పార్వతీ సహితుడైన పరమేశ్వరుని దర్శించాడు.  నారదుడు దర్శనం చేసినటువంటి పరమేశ్వరుడు ఏ విధంగా ఉన్నాడో చూద్దాం. 

నారదముని దర్శించిన పరమేశ్వరుడు ఎంత వైభవంగా ఉన్నారంటే, శంకరుడి అర్ధాసనం  మీద పార్వతీదేవి దివ్యంగా కొలువై ఉంది.  ముల్లోకాలకి ప్రభువైన శంకరుడు పార్వతీ సహితుడై సర్వాంగ సుందరుడిగా శోభిస్తున్నాడు.  సర్వ శ్రేష్టుడు శంకుడనే సేవకుడు పరమేశ్వరుడి పాద కమలాలని అర్చిస్తున్నాడు.  అతడితో పాటు ధృతరాష్ట్రుడు,  తక్షకుడు తదితర సర్పరాజాలు కూడా పార్వతీ పరమేశ్వరులను సేవిస్తున్నారు. 

సర్పజాతిలో  గొప్పవాడైన వాసుకి శివుడి కంఠానికి చుట్టుకుని హారంలాగా శోభిస్తున్నాడు.  కంబళ, అశ్వతరాలనే నాగులు శివుడికి కరుణాభరణాలుగా ఉన్నారు. మరికొన్ని జాతి సర్పాలు ఆయన జటాజూటంలో వేలాడుతున్నాయి.  ఇంకా ఇతర జాతులకు చెందిన తక్షక, కుళిక, శంఖ, పద్మ, సుదంభ, కరాళ తదితర విష సర్పాలు త్రిలోకపూజ్యుడైన  శివుడికి ఆభరణాలుగా మారాయి.  ఈ సర్పాలలో కొన్ని ఒక పడగతో, మరికొన్ని రెండు పడగలతో, ఇంకొన్ని మూడు, నాలుగు, ఐదు పడగలతో శోభిస్తున్నాయి.  ఆ విధంగా సర్పాలంకార భూషితుడైనటువంటి శంకరుణ్ణి నారదుడు దర్శించారు. 

ఆ విధముగా పరమేశ్వరుడు హారాలుగా ధరించిన  సర్పాల తలలమీదున్న మణులు ఆయనకి భూషణాలుగా ప్రకాశిస్తున్నాయి. 

తలమీద అర్థ చంద్రుడు, నుదుటి మీద ఉన్న మూడో కంటితో ఎంతో సుందరంగా ఉన్నాడు శివుడు.  ఆయన వక్షస్థలం, జఘనం ఎంతో విశాలంగా ఉన్నాయి.  ఆయన దివ్య పాదాలు అందంగా విరాజిల్లుతున్నాయి. అలా విరాజిల్లే చరణాల్ని దర్శించారు  నారదుడు. 

 పరమేశ్వర పాదాలు సాటిలేనివి. వాటిని భావన చేత  మనమూ దర్శిద్దాం .  సంధ్యారాగ కాంతితో మంగళకరంగా ప్రకాశిస్తూ జనుల తాపాలను పోగొట్టేవి, అందరికీ సుఖాన్ని అందించేవి అయిన ఆ సుందర పాదాలు దివ్యతేజస్సుతో సంపన్నమై , ఆపాదాలని చుట్టుకున్న నాగుల నీలమణుల కాంతులతో పోటీ పడుతూ ప్రకాశిస్తున్నాయి. ఆ విధంగా భగవంతుడికి ప్రీతిపాత్రుడైన నారద మహర్షి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తి పూర్వకంగా నమస్కరించి ఎంతో స్తుతించారు. 

 ఆ స్తుతివిని పార్వతీ పరమేశ్వరులు ఎంతగానో సంతోషించారు. నారద మహర్షి ఏం చేసినా అది లోకకల్యాణం కోసమే !! ఆ విదాహముగా ఆయంచేసిన ఈ దర్శనాన్ని మనమూ చేసి , ఈ అధ్యాయాన్ని విన్నా , చదివినా  పరమేశ్వరుని కృపా కటాక్షాల చేత అటువంటివారి ఇహ పర సౌఖ్యాలన్నీ కూడా సమకూరగలవని కోరుతూ .. శుభం !! 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi