Online Puja Services

దుష్టగ్రహబాధలు నివారించే కాలభైరవుడు

3.142.119.241

దుష్టగ్రహబాధలు నివారించే కాలభైరవుడు 
-లక్ష్మీ రమణ  

మార్గశిర మాస శుక్లపక్ష అష్టమి రోజున కాలభైరవస్వామి జయంతి దీనినే భైరావాష్టమి అని అంటారు. సాక్షాత్ పరమ శివుని అవతారం కాలభైరవుడు.ఈ స్వామి వాహనం శునకం(కుక్క)అందుచేత ఈ రోజును కుక్కలను పూజించి ఆహారం సమర్పిస్తారు.ఈ భైరవావతారానికి సంబంధించిన వృత్తాంతం శివపురాణంలో కనిపిస్తుంది . 

ఒకానొక సందర్భంలో బ్రహ్మ ,విష్ణువు మధ్య వివాదాంశం తలెత్తింది.విశ్వాన్ని ఎవరు కాపాడుతున్నారు? పరతత్వం ఎవరు? ఇది చర్చకు దారి తీసింది. అప్పుడు మహర్షులు ఇలా చెప్పారు-సమస్త విశ్వానికి మూలమైన పరతత్వం తెల్చిచెప్పాడానికి వీలుకానిది ఈ సమస్య దీనికి కారణం మీరిద్దరూ ఆశక్తి విభూతి నుండే ఏర్పడిన వారే కదా! అన్నారు ఋషులు. ఈ వాదనను అంగీకరించిన శ్రీ మాహావిష్ణువు మౌనం వహించాడు.కాని బ్రహ్మ అందుకు అంగీకరించలేదు. ఆ పరతత్వం మరెవరోకాదు ,నేనే అని బ్రహ్మ అహంను ప్రదర్శించాడు. అప్పుడు వెంటనే పరమశివుడు భైరవ స్వరూపాన్ని చూపి బ్రహ్మకు గర్వభంగం కలిగించాడు.ఆయన  ఐదవ తలని తన కొనగోటితో త్రుంచేశాడు . ఈ బైరవ అవతారానికి కారణమైన రోజు మార్గశిర మాస శుద్ధ అష్టమి కావటంతో "కాలభైరవాష్టమి" గా ప్రసిద్ధి చెందింది.

కాలభైరవుని చేతికి అంటుకున్న బ్రహ్మకపాలాన్ని మాత్రం వదిలించుకోలేక పోయాడు.  ముల్లోకాలూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఆ  కాశీనగరంలో కాలుపెట్ట గానే, కపాలం చేతినుండి విడిపోయింది.భైరవుడు ఆనంద తాండవం చేశాడు.  కాశీ క్షేత్రంలోని ఈ ప్రాంతమే ‘కపాలమోచన దివ్యతీర్ణంగా ప్రసిద్ధమైంది. కాలభైరవడికి కాశీనగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు.

కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం 
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం.  

అని ఆ కాలభైరవునికి ఒక బిల్వదళాన్ని గనుక సమర్పిస్తే, అంతటి రౌద్రరూపుడైన  స్వామి కరిగి కరుణాసముద్రుడై అనుగ్రహిస్తాడని పురాణోక్తి .  

 ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. పాపాల్ని పరిహరించే వాడిగా పాపభక్షకుడు అయ్యాడు. ఈ తీర్ధానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుతీరి ఉంటాడు. ఈ క్షేత్రంలో మహాభైరవాష్టమిని ఘనంగా జరుపుతారు. కార్తికమాసంలోని కృష్ణపక్ష అష్టమినే కాలాష్టమిగా కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు. మార్గశిర కృష్ణపక్ష అష్టమిని మహాభైరవాష్టమిగా నిర్వహించు కునే వారూ కూడా ఉన్నారు. ఆ రోజు కాలభైరవుడి సన్నిధిలో జాగరణ చేస్తారు. రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు కట్టించుకుంటారు. దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పిచడం ఇక్కడి ప్రత్యేకత . 

ఉజ్జయినిలో వెలసిన కాలభైరవుడు కూడా మహాశక్తిమంతుడని భక్తుల నమ్మకం. దిల్లీ నగరంలోనూ కాలభైరవ క్షేత్రం ఒకటుంది. కాలభైరవుడిని ఉపాసిస్తే మనలోని దుర్గుణాలు తొలగి పోతాయని సాధకులు చెబుతారు. 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi