Online Puja Services

మహానంది

3.133.139.105

మహానంది

సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవు రూపంలో వెలిసిన క్షేత్రం మహానంది

నల్లమల పర్వతాల అడవుల్లో వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో... పరమశివుడు స్వయంభువుగా గోవు(ఆవు) ఆపద ముద్రరూపంలో వెలిశారు! 
ఇక్కడి శివలింగం కింది నుంచి ఏడాది పొడవునా ఒకేస్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంటుంది. 

వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా, వానాకాలంలోనూ మలినాల్లేకుండా తేటగా.. సూది సైతం స్పష్టంగా కనబడేస్థాయి స్వచ్ఛతతో ఉండటం ఈ నీటి ప్రత్యేక లక్షణం

క్షేత్రచరిత్ర/స్థలపురాణం: 

పూర్వీకులు తెలిపిని కథానుసారం.. ఒక రుషి నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకొని కుటుంబంతో జీవించేవాడు. అతడు శిలాభక్షకుడై ఎల్లప్పుడు తపోధ్యానంలో నిమగ్నమై ఉండేవాడు. ఆ మేరకు ఆయన్ను అంతా శిలాదుడని(శిలాద మహర్షి) పిలిచేవారు. 

భార్య తమకు దైవప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుందని ఆకాంక్షించగా.. ఆమె కోరికను తీర్చేందుకు శిలాదుడు ఆ సర్వేశ్వరుడిని గురించిన అత్యంత నిష్టతో తపస్సు ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చిన మహేశ్వరుడు అతని చుట్టూ పుట్టగా వృద్ధి చెందాడు. ఇంకొన్నాళ్ల ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై... కావల్సిన వరాలు కోరుకొమ్మన్నాడు. దేవాధిదేవుడ్ని చూసిన పారవశ్యంలో శిలాద మహర్షి భార్య కోరిన కోరిక మరిచిపోయాడు! మహాదేవా.. నీ దర్శన భాగ్యం లభించింది. ఇంతకన్నా నాకు ఇంకేమి కావాలి? నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రీ.. అని వేడుకున్నాడు. అయితే దయాళువైన పరమశివుడు మహర్షి మరిచిన భార్య ఆకాంక్షనూ గుర్తుంచుకుని.. మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్లిపోయారు. 

ఆమేరకు పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు. శిలాదుడు వెంటనే భార్యను పిలిచి ఇదిగో నీవు కోరిన ఈశ్వర వరప్రసాది... మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు.. అంటూ ఆ బాలుడిని అప్పగించాడు. వారు ఆ బిడ్డకు ‘ మహానందుడు’ అనే పేరు పెట్టారు. 

 అనంతరం మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల దగ్గర అన్ని విద్యలు నేర్చాడు. తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించి తపస్సు చేశాడు. అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై వత్సా.. వరం కోరుకో.. అనగా.. మహానందుడు... దేవాధిదేవా.. నన్ను నీ వాహనంగా చేసుకో... అని కోరారు. అలాగే అని వరమిచ్చిన శివుడు
 ‘మహానందా.. నీవు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి ధార కొలనుగా మారి అహర్నిశలూ ప్రవహిస్తూ, సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది.  పరమ పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతుంది. అని వరమిచ్చారు. తాను ఇక్కడి నవనందుల్లో లింగరూపుడిగా ఉంటానని వరం అనుగ్రహించారు. 

చరిత్ర ప్రకారం: 

పూర్వం నందుడు అనే రాజు పాలనలో గోపితవరం( నేటి గోపవరం) గ్రామంలో ఓ గొల్లవానికి పెద్ద ఆవుల మంద ఉండేది. అందులోని కపిల అనే విశిష్టమైన ఆవు ఈ నల్లమల అడవిలో పచ్చిగడ్డి మేస్తూ ఇక్కడ పుట్టలో ఉన్న శివుడిని గుర్తించి.. రోజూ పాలు ఇస్తూ ఆయన ఆకలి తీర్చేది.ఓ గోమాత రోజూ అడవిలోని ఒకపుట్టలో పాలు విడుస్తోందన్న విషయం నందమహారాజుకు గూఢచారుల ద్వారా తెలిసి.. ఆయన ఆ వింతను కళ్లారా చూడాలని అక్కడికి వస్తాడు. కపిల గోవు పొదల్లోకి వెళ్లి పుట్టవద్ద నిలిచి పాలధారను స్రవిస్తుండగా.. చూసి.. రాజు మరింత స్పష్టంగా ఈ దృశ్యాన్ని చూసేందుకని ముందుకు కదలగా... ఆ అలికిడికి బెదిరిన ఆవు కుడిపాదంతో పుట్టను తొక్కేస్తుంది. ఆపై.. పుట్టలోని బాలరూప శివుడు.. ఆ గోమాత కూడా మాయమైపోగా.. రాజు ఎందుకలా అయ్యిందో అర్థం కాక... అయోమయంగా తిరిగి నగరికి చేరతాడు. ఆరాత్రి అతనికి పరమశివుడు కలలో కనిపించి ‘ నీవు చూసిన పుట్టనుంచి పాలు తాగింది నేనే. అక్కడ దేవాలయాన్ని నిర్మించు... నేనక్కడ లింగరూపినై కొలువుంటా.. నీ కీర్తి శాశ్వతం అవుతుందని చెప్పారు. 

ఆ మేరకు నందరాజు అక్కడ ఆలయాన్ని నిర్మించాడు. దీన్ని రససిద్ధుడు అనే దేవలోక శిల్పి రూపొందించినట్లుగా పురాణగాథ. అన్ని చోట్లా పానవట్టంపై శివలింగం ఉంటుంది. కానీ ఇక్కడ పానవట్టమే శివలింగానికి అమర్చినట్లుగా కనబడటం మహానంది ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
రాజుల చరిత్ర: నందరాజు ఈ ప్రాంతాలను (నందవరం, నంద్యాల, నందికొట్కూరు, మహానందిని
 పాలించాడు. క్రీ.పూ. 323లో మౌర్య చంద్రగుప్తుడు వీరిని ఓడించి సింహాసనాన్ని అధిష్టించాడు. పాండవ వంశీయుడైన ఉత్తుంగ భోజుని కుమారుడైన నందన చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఇతడే కథాకాలం నాటి నంద మహారాజు. వెలనాటి చోళులల్లో విక్రమభోజుడు క్రీ.శ. 1118 నుంచి 1135 వరకు మహేంద్రగిరి(గంజాం) శ్రీశైలం మధ్యగల పర్వత ప్రాంతాలన్నింటినీ పరిపాలించాడు. అతను కూడా ఈ క్షేత్రానికి వచ్చి పరమశివుడిని పూజించి ఆలయ గోపురాలు, కొన్ని కట్టడాలు, మండపాలు నిర్మించి క్షేత్రాభివృద్ధికి దోహదం చేశాడు. ఆ తర్వాత విజయనగర రాజులు సైతం కొన్ని కట్టడాలు, భక్తులకు వసతులు.. రహదారులు ఏర్పాటు చేసి శివుడిని ఆరాధించారు. ఈ క్షేత్రానికి కర్ణాటక, మహారాష్ట్ర సహా పలురాష్ట్రాల భక్తులు వస్తుంటారు.

నీటికొలనులు: బ్రహ్మగుండం, రుద్రగుండం, విష్ణుగుండం ఉన్నాయి. ఇందులో రుద్రగుండంనుంచి రెండు ధారలు బయటికి ప్రవహిస్తుంటాయి. ఈ నీటి ద్వారా పరిసర ప్రాంతాల్లోని సుమారు 2 వేల ఎకరాల్లో అరటితోటలు సాగవుతున్నాయి.

* రుద్రగుండంలో పంచలింగాల మండపం: ఇందులో పృథ్వీ(భూ)లింగం, జలలింగం, తేజో(అగ్ని)లింగం, వాయు లింగం, ఆకాశ లింగం ప్రతిష్ఠించారు.

* నవ నందులు: నంద్యాల పట్టణంలో ప్రమధ నంది, ఆంజనేయస్వామి ఆలయంలో అంతర్భాగంగా నాగనంది, సోమనంది ఉన్నాయి. అలాగే బండి ఆత్మకూరు మండలం పరిధి సోమయాజులపల్లె సమీపంలో శివనంది, నల్లమల అడవిలో కృష్ణ నంది(విష్ణునంది), మహానంది క్షేత్రం ఆవరణలో మహానందితో పాటు వినాయకనంది, గరుడనంది, సుమారు 10 కి.మీ.ల దూరంలోని తమడపల్లెకి 2 కి.మీ.ల దూరంలో సూర్యనంది క్షేత్రం ఉన్నాయి. ఈ నందులన్నింటీని ఒకే రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.

ప్రతిరోజు ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దైవదర్శనం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో మాత్రం కేవలం 15 నిమిషాలు నివేదన సమయంలో దర్శనం నిలుపుదల చేస్తారు. ఆ తర్వాత దర్శనం మామూలే.

వసతి సౌకర్యాలు బాగానే ఉన్నాయి. 

నంద్యాల నుండి APSRTC బస్ లు అందుబాటులో ఉన్నాయి..

- శ్రీనివాస్ గుప్తా వనమా 

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi