Online Puja Services

శివుడు కపాలంలో భిక్షని స్వీకరిస్తారా ? ఎందుకు ?

18.217.67.16

శివుడు కపాలంలో భిక్షని స్వీకరిస్తారా ? ఎందుకు ?
- లక్ష్మి రమణ 

బ్రహ్మకపాలం - ఈ ప్రాంతాన్ని గురించి  చార్ధామ్ యాత్రీకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఈ దివ్యస్థలంలో స్వయంగా బ్రహ్మ కపాలం పడడం వలన ఆ ప్రాంతానికి బ్రహ్మకపాలం అనే పేరొచ్చింది . ఇక్కడ కింద చెప్పిన విధంగా చేశారంటే, పితృ దేవతలకి ఉత్తమ గతులు కలుగుతాయి . బ్రహ్మకపాలంలో పిండం పెడితే, ఇక ప్రతి ఏడాదీ పితృ తిథి పాటించాల్సిన అవసరం లేదని కూడా చెబుతూ ఉంటారు .  

  శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు. నాలుగు ముఖాలతో మంత్రోఛ్ఛారణ చేస్తున్నారు.  కానీ, ఆయన ఊర్ధ్వ ముఖం పార్వతీదేవీ సౌందర్యానికి మోహపరవశమై, చేష్టలుడిగి చూస్తుండి పోయింది. 

ఇది గమనించిన పరమశివుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు బుధ్ధి చెప్పాలని చేయిచాచి ఒక దెబ్బ వేశాడు. మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా.! దాని ప్రభావనికి బ్రహ్మ ఊర్ద్వముఖం తెగిపోయింది. కానీ కిందపడలేదు, శివుడి అరచేతికి అతుక్కుపోయింది. 

ఎంత విదిలించినా అది ఆయన చేతిని వదలలేదు. క్రమక్రమంగా ఎండి,చివరికది కపాలంగా మారిపోయింది. బ్రహ్మ అపరాధం చేశాడు.దానికి ఆదిదేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది. కానీ అది సరాసరి బ్రహ్మ హత్యగా పరిణమించి, ఆ పాపం అంతటి మహాదేవుడుకీ అంటింది. జగద్గురువు , మహాతపస్వి అయినా , మహాదేవుడంతటి వాడికి సైతం  పాప ఫలం తప్పలేదు. దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగింది చెప్పి, తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గమేమిటో సూచించమన్నాడు.

అప్పుడు వాళ్ళు ,  “ఓ దేవాదిదేవా ! పరమజ్ఞానివి. నీకు తెలియని ధర్మం లేదు. ఈ జగత్తును నడిపిస్తున్నవాడివి. శాసించగలవాడివి. అయినా, మాపై కృపతో ఒక సలహా ఇవ్వమని కోరావు. కనుక, మా జ్ఞాన పరిమితికి తోచింది చెబుతున్నాము. 

నువ్వు ఈ కపాలాన్నే భిక్ష పాత్రగా భావించి, ఇంటింటికీ తిరుగుతూ ప్రతిచోటా నీ పాపమేమిటో చెప్పుకుని, భిక్షాటన చేయి.  కొంత కాలానికి ఆ పాపం తరిగిపోయి,  ఈ కపాలం రాలిపోవచ్చు ‘ అని అన్నారు దేవతలు.  పరమశివుడికి అది సమంజసంగా అనిపించింది . అంతే ఈశ్వరుడు  భిక్షువుగా మారి ముల్లోకాలు తిరుగుతూ ,  తన వివాహం జరిగిన చోటుకి  చేరుకున్నారు. 

ఇదంతా జరిగేందుకు పూర్వమే ,హిమాలయపర్వతాల్లో ఈశ్వరుడు కేదారేశ్వరుడిగా అవతరించి ఉన్నాడు. అందుకు  సంతసించిన మామగారు హిమవంతుడు ఆ ప్రాంతాల్లోని శిఖరాలను, నదులను ఈశ్వరునికి కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడి దగ్గరకు వచ్చి “పరమశివా, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలున్నాయి కదా ! ఈ బదరీవనంతో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా ?” అని అడిగాడు. 

కేశవుడే అభ్యర్థిస్తే, శివుడు ఇవ్వకుండా  ఉండగలడా ? పరమేశ్వరుడు పరమ సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు. అప్పటి నుంచి శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు. ఇదిలా ఉంటె, ప్రస్తుతం భిక్షాటన చేస్తున్న ఆ  శివుడు బదరీనారాయణుడి దగ్గరకి భిక్షకు బయలుదేరాడు. ఈ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు. 'పరమశివుడే నా దగ్గరకు భిక్షకి వస్తున్నదని సంతోషించాడు. నిజానికి ఆ బదరీవనమే శివుడిది. ఆయన కానుకగా ఇస్తేనే ఈ ప్రదేశం నాదయ్యింది . ఇది పరమేశ్వరుడి సొంత ఇల్లు వంటిది. అయినా సరే, ఆయన నాదగ్గరికి భిక్షకోసం వస్తున్నారంటే, అది ఆయన వైరాగ్యానికి పరాకాష్ట. ఈ అద్భుతాన్ని జగత్తులో నిలిచేలా మార్చేయాలని “ సంకల్పించారు . 

ఆ విధంగా బదరీ క్షత్రం ముందుగా పరమేశ్వరుడిది . అక్కడికి నారాయణుడు విచ్చేయడం వలన లయ, స్థితి కారులిద్దరూ ఉన్నట్టయ్యింది . శివుని చేతికి అంటుకొని ఉన్నది  బ్రహ్మ కపాలం.  దానివల్ల బ్రహ్మ గారు కూడా ఈ క్షేత్రానికి వచ్చినట్లయ్యింది .  పైగా ఆ బ్రహ్మ కపాలం ఊర్థ్వ ముఖానిది . అంటే, క్రింది లోకాలనీ, ఊర్ధ్వలోకాలతో అనుసంధానం చేసేటటువంటిది . చిరకాలం శివుని చేతిని అంటిపెట్టుకొని ఉండడం వలన దానికి ఉన్న దుర్భావనలు  నశించిపోయాయి . పరమ పవిత్రమైన ఆ కాపాలాన్ని ఈ బదరీ వనం లోనే పడేలా చేస్తే, త్రిమూర్తులూ ఈ క్షేత్రంలో నిలిచినట్టవుతుందని నారాయణులు కృప చేశారు . 

ఆ విధంగా ఎప్పుడైతే, శివుడు  నారాయణుడి ముందర తన కపాల భిక్ష పాత్రని చాచారో , ఆ క్షణం ఆ పాత్ర ఆయన చేతి నుండీ  విడిపడి కింద పడిపోయింది . శిలా రూపమైన శివలింగంగా మారిపోయింది .  ఊర్ధ్వ లోకాలతో అనుసంధానం చేయగలిగిన ఆ బ్రహ్మ కపాలం అప్పటి నుండీ, ఆరాధించిన వారి పితరులకు పుణ్య లోకాలని అనుగ్రహిస్తూ బ్రహ్మ కపాల తీర్థంగా పేరుగాంచింది.  

ఇలా చేరుకోవాలి :

చార్ ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్ కు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే బ్రహ్మకపాలం ఉంది. బద్రీనాథ్ వరకూ వాహనాలు వెలుతాయి. అక్కడి నుంచి నడక దారిన బ్రహ్మ కపాలం చేరుకోవచ్చు.

brahma kapalam, chardham badrinath, shiva, siva, brahma, parvathi, parvati

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha