Online Puja Services

సుమంగళిగా దీవించే సోమవార వ్రత మహత్యం.

13.59.122.162

భార్యాభర్తల అన్యోన్యతని పెంచి, సుమంగళిగా దీవించే సోమవార వ్రత మహత్యం. 
- లక్ష్మి రమణ 
 
శివునికి సోముడు అని పేరు. ‘సోమ: ఉమయాసహిత: శివ:’ అంటే, సోమ శబ్దానికి పార్వతీదేవితో కలిసి ఉన్న శివుడని అర్థం .  ఈ ఆది దంపతులని వారికి ఇష్టమైన సోమవారంనాడు పూజిస్తే, సకల శుభాలూ కలుగుతాయి . భార్యాభర్తలకి మంచి అన్యోన్యత కలుగుతుంది . సంసారం అనే సాగరాన్ని దాటడానికి కావలసిన శక్తి లభిస్తుంది . పిల్లలు ఆరోగ్యంగా , పూర్ణాయుష్హుతో మంచి నడవడిక గలిగిన వాళ్ళయితారు . పార్వతీ పరమేశ్వరుల ఆరాధనలో విశిష్టమైన ఈ వ్రతాన్ని గురించిన కథని స్కాందపురాణం ఇలా వివరిస్తుంది. నలదమయంతుల మనుమడైన చంద్రాంగదుని ఎడబాసిన అతని భార్యకి మైత్రేయి మాత ఈ వ్రత మహత్యాన్ని వివరిస్తారు. ఆ తర్వాత వారిద్దరూ ఒక్కటై జీవిత పర్యంతమూ ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించారు . విధంగా ఆ దంపతులిద్దరూ కూడా  వ్రతాన్ని ఆచరించినప్పుడు జరిగిన ఒక గొప్ప మహాత్యాన్ని తెలుసుకుందాం. 

సోమవార వ్రత మహిమ - 

విదర్భ దేశములో వేదమిత్రుడు, సారస్వతుడు అని ఇద్దరు బ్రాహ్మణ స్నేహితులుండేవారు . వేదమిత్రుని కొడుకు సుమేధుడు. సారస్వతుని కొడుకు సామవంతుడు. వీరిద్దరు కూడా ఒకే గురువు దగ్గర విద్యలన్నీ  అభ్యసించి పండితులయ్యారు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా ! విద్యలకి , పాండిత్యానికీ లోటులేకపోయినా, ఆ పండితులకి సంపదలకు మాత్రం లోటే. కొడుకులిద్దరూ పెళ్ళీడుకి రావడంతో, వాళ్ళని రాజుగారి ఆస్థానానికి పంపి, వలసినంత ధనం సంపాదించుకొనేలా చెయ్యాలని ఆ తండ్రులు ఆలోచించారు .  కొడుకులిద్దరూ వారి తండ్రుల మాటని గౌరవించి రాజాస్థానానికి బయలుదేరారు . 

రాజదర్శనము చేసి, తమ పాండిత్యప్రకర్షను ప్రదర్శించారు. ఆ రాజు గారు, బహుమతిగా మీకేమి కావాలి అని అడిగారు. ‘రాజా !మేము  వివాహము చేసుకోవాలి అనుకుంటున్నాము. కాబట్టి మా సంసారము గడుపుకోవడానికి తగిన బహుమాన మిప్పించండి’ అని అడిగారు. 

రాజుగారు మంచివారే ! కానీ బుద్ధి కొంచెం కొంటెది . అందువల్ల ఆయనన్నారు ,  "మీలో ఒకరు ఆడ వేషము వేసుకొని,  భార్యాభర్తల లాగా నటిస్తూ , నిషధ రాజైన చంద్రాంగదుని దగ్గరికి వెళ్ళండి . ఆయన భార్య సీమంతిని మహాశివభర్తురాలు.  సోమవారమునాడు వ్రతము చేసి, అందులో భాగముగా  దంపతీపూజ చేసి, అపరిమితమైన ధనములను కానుకగా సమర్పిస్తారు. వాటిని తెచ్చుకున్నట్టయితే మీ దరిద్రం తీరిపోతుంది " అని చెప్పారు. 

సుమేధుడు , సామవంతుడు ఇద్దరూ కూడా పండితులే ! యుక్తా యుక్త విచక్షణ తెలిసినవారే ! డబ్బు కోసం ఇటువంటి దొంగపనికి వాళ్లిద్దరూ కూడా ఇష్టపడలేదు . కానీ రాజుగారు ఇది రాజాజ్ఞ . మీరిలా చేయవలసిందే అని వారిని బలవంతపెట్టారు . పైగా  అంత:పుర పరిచారికలను పిలిచి,  సామవంతునికి ఆడవేషము వేయించారు. దాంతో  వారు సంకోచిస్తూనే, నిషధ సామ్రాజ్యం చేరారు . 

చంద్రాంగదుడు, సీమంతిని దంపతులు చేసే వ్రతముకు దంపతులుగా వెళ్లారు. ఆవిడ నిజంగానే మహా భక్తురాలు . వీరిని చూసీ చూడగానే , నిజము గ్రహించారు . అయినా, నవ్వుకొని, పీఠముపై కూర్చుండబెట్టి పార్వతీ పరమేశ్వరులుగా భావన చేసి, సమస్తోపచారములతో యథావిధిగా పూజించారు.  షడ్రసోపేతమైన విందు చేసి అపారమైన ధనములను దక్షిణగానిచ్చి సాగనంపారు . 

వాటన్నింటినీ తీసుకొని వారు తిరుగు ప్రయాణమయ్యారు . దారిలో సామవంతుడు, సుమేధునితో ప్రణయ సంభాషణ మొదలుపెట్టాడు . సుమేధుడు, "ఏమిరా! నిజముగానే అమ్మాయివైపోయానని అనుకుంటున్నావా? విచిత్రంగా మాట్లాడుతున్నావ్ ?” అన్నాడు . అప్పుడు  సామవంతుడు "అవును సుమేథా! నేను ఇప్పుడు నిజంగా నే అమ్మయిగా మారిపోయాను . ఒక్కసారి నన్ను పరిశీలనగా చూడమన్నాడు .  “ సుమేధుడాశ్చర్యపడి ఆమెను నిశితముగా చూశాడు. 

సామవంతుడు నిజముగానే  స్త్రీ అయ్యాడు . సుమేధుడు "నీవు నిజముగా స్త్రీవైతే నిన్ను నేనే పెళ్లిచేసుకుంటాను. పద మనం మన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో ఈ విషయాన్ని చెబుదాం అనుకుని ఇంటికి చేరారు . 

సారస్వతుడు తన ఏకైక కుమారుడు స్త్రీయైనందుకు విచారించాడు.  రాజుదగ్గరికి వెళ్లి , "నీ ధూర్తత్వము వల్ల  నా కొడుకు స్త్రీగా మారిపోయాడు . నాకు వంశాభివృద్ధి లేకుండా పోయింది . రాజులకు ఇటువంటి పరాచికాలు తగవని” హితవు చెప్పారు .  రాజు కూడా సామవంతుడు  నిజముగా స్త్రీగా మారినందుకు ఆశ్చర్యపోయాడు .  సోమవారవ్రత మహాత్మ్యమును గ్రహింపలేక తాను చేసిన శివాపరాధమునకు పశ్చాత్తాపము పొంది, వీరందరితో కలిసి దేవాలయమునకు వెళ్లి నియమముతో నిరాహారుడై మూడు రోజులపాటు జగన్మాతని ఆరాధించి, ఆమె శరణు వేడారు . 

దేవి ప్రత్యక్షమయ్యింది.  రాజు ఆమెకు సాష్టాంగ ప్రణామము చేసి, తన అపరాధమును మన్నింపుమని ప్రార్థించారు.  "తల్లీ! ఈ స్త్రీగా మారిన యువకుని మరల పురుషునిగా జేయు"మని కోరారు.  ఆ తల్లీ.. "రాజా! నా భక్తురాలి భావనను మార్చే శక్తి నాకు లేదు. ఈమె సుమేధునికి తగిన భార్య.  సారస్వతునికి వంశోద్ధారకుడైన మరో కుమారుడు కలుగుతాడని " వరమిచ్చింది. జగన్మాత చెప్పినట్లు సామవతిని సుమేధునికిచ్చి సారస్వతుడు పెండ్లి చేశాడు . అతనికి తరువాత ఒక కొడుకు పుట్టాడు . 

ఈవిధంగా సోమవారం వ్రతం చేసి, పార్వతీ పరమేశ్వరులని అర్చించడం వలన భార్యాభర్తల మధ్య అనురాగాలు చిగురిస్తాయి.  వంశం నిలబడుతుంది . ముఖ్యంగా మహిళలకి అఖండమైన సౌభాగ్యాన్ని ఆ ఆదిదంపతులు అనుగ్రహిస్తారు . శుభం . 

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda