Online Puja Services

ఈశ్వరుడే స్వయంగా రాసిన కవిత- ఆక్షేపించిన కవి

18.222.111.24

ఈశ్వరుడే స్వయంగా రాసిన కవిత- దాన్ని ఆక్షేపించిన కవి !? .
-లక్ష్మీ రమణ . 

 అనగనగా ఒక పాండ్య రాజు. ఆయన కవి పండిత  పోషకుడు. ఆయన కొలువులో ఒక శంఖఫలకం ఉంది. పుష్పకవిమానం లాంటిది. అర్హుడైన కవి వస్తే , అది విశాలమై ఆ కవికి ఆసనాన్నిస్తుంది . ఆ శంఖ ఫలకం మీద కూర్చోవడం అపారమైన గౌరవానికి చిహ్నం .

 ఈ  గౌరవం పొందిన ఒకానొక కవీశ్వరుడున్నాడు. ఆయనే నత్కీరుడు. ప్రతిదినం ఎవరో ఒకరు రావడం, కవిత్వం వినిపించడం నత్కీరాది కవీశ్వరులు తర్కించి నిగ్గు తేల్చడం, అర్హుడైతే రాజసత్కారం, అనర్హుడైతే వెనుదిరిగిపోవడం – ఇది ఆ కొలువులో జరుగుతూ ఉండే కథ.

ఇలా ఉండగా ,  ఆ రాజ్యంలో ఒక సారి కరువొచ్చింది. ఆ రాజ్యంలోని ఊళ్ళో ఒక శివాలయం ఉంది .  అందులో ఒక అర్చకుడున్నాడు . కరువు తట్టుకోలేక గుడి విడిచి, ఊరు విడిచి వెళ్ళిపోదాం అనుకుంటూండగా, శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక పద్యం అల్లి పూజారికిచ్చి, "దీన్ని రాజు గారివద్దకు తీసికెళ్ళు, ఆయన నీకు వెయ్యి మాడలిస్తాడు, నీ కరువు తీరుతుంది" అన్నాడు.

పూజారి అలాగే రాజకొలువుకి వెళ్ళి శివుడిచ్చిన పద్యం చదివాడు. 

అందులోని ఒక పాదం ఇలా ఉంది "సిందుర రాజ గమనాధమ్మిల్ల బంధంబు సహజ గంధంబు"

 సిందురం అంటే ఏనుగు. గజరాజ గమనం కలిగిన ఆ స్త్రీ జుట్టుముడి (ధమ్మిల్ల బంధం) సహజ సువాసనతో అలరారుతోంది అని కవితా సారాంశం. రాజుగారి  కొలువులో నత్కీరుడు ఉన్నాడు. ఆయన ఈ పాదానికి  అభ్యంతరం చెప్పాడు. జడకి సహజ గంధం ఉంటుంది అని వర్ణిస్తే లోకం నవ్వదా? అన్నాడు.ఈ కవితా పధ్ధతి తప్పుగా ఉంది . సందర్భోచితంగా లేదు .  పొమ్మన్నాడు . 

అప్పుడా ఆ పూజారి చిన్నబోయి "ఓ ఉత్తములారా! ఈ పద్యాన్ని నాకు ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు. ఇందులోని ఒప్పూ తప్పూ నాకు తెలియవు" అని వెనుతిరిగిపోయాడు. శివాలయానికి వచ్చి శివుడితో విషయంతా చెప్పాడు. తన భక్తుడికి జరిగిన అవమానాన్ని శివుడు తీర్చాలనుకున్నాడు. మానవరూపంలో ఆ పూజారిని వెంటబెట్టుకుని రాజు సభకి స్వయంగా విచ్చేశాడు . 

ఈ రాజుగారిమీద నేను కవిత చెప్పాను. సాహిత్య సంబంధమై ప్రకాశించే మాధుర్యంతో అందమైన  ప్రౌడిమతో నేనే దాన్ని చెప్పి పంపించాను. అది విని మాత్సర్యం వహించి నత్కీరుడుట, ఎవడో! ఊరికే తప్పు పట్టాడట! ఏదీ చెప్పండి, నా కవితలో చందోవ్యాకరణ లక్షణం తప్పిందా? అలంకారంలో దోషం ఉందా? సమాసంలో పొరపాటు జరిగిందా? రసంలో ఔచిత్యం దెబ్బతిన్నదా? దేనికి సంబంధించి, ఏది తప్పిందో వెంటనే చెప్పండి  అని శివుడు నిలదీసాడు.

 నత్కీరుడు అహంకారంతో ఉన్నాడు . వచ్చినవాడు స్వయంగా నిటలాక్షుడే అని తెలిసీ , మునపటిలాగే "కేశపాశాలకి సహజ గంధం ఎక్కడినుంచి వస్తుంది. ఇది లోక విరుద్ధం, కవి సమయ విరుద్ధం" పొమ్మన్నాడు. 

అప్పుడు శివుడు "పార్వతీదేవి పొడవైన కేశబంధం సహజ గంధంతోనే ఉంటుంది. కాబట్టి నేను రాసినది సరియే" అని వివరణనిచ్చాడు . అయినా , నేనే గొప్ప అనుకునే ఆ కవి నక్కీరుడుకి  తలపొగరు దిగలేదు . మరింత నిర్లక్ష్యంగా ,  "ఆవిడ కురుల సంగతి మాకేమి తెలుసు? ఈ లోకంలో ఉండే కాంతలకు అది వర్తించదు" అని బదులు పలికాడు. పైగా అర్థంపర్థం లేని మాటలు చాలించామని వెక్కిరించాడు . ఆమె కేశాలు నువ్వు వాసన చూశావా అని హేళన చేశాడు . అప్పుడు శివుడు తన నిజరూపం చూపించాడు.

 అయినా సరే నత్కీరుడు అవినయంగా మాట్లాడాడు. “తల చుట్టు నూరు  గన్నులు  గలిగిన బద్యంబు దప్పు గాదన వశమే వలదిచ్చట నీ మాయా విలసనములు పనికి రావు విడువు"  

నీకు నుదిటి మీదనే కాదు తలచుట్టూరా కన్నులు ఉన్నా సరే, వాటిని కూడా చూపించినా సరే, నువ్వు రాసిన ఈ పద్యాన్ని తప్పు కాదు అనడం ఎవడి వల్లా కాదు. తప్పు తప్పే. అంచేత - వద్దు. నీ మాయా విలాసాలూ, గారడీ ప్రదర్శనలూ, ఇక్కడ పనికి రావు. చూపించకు. వాటిని వదిలేసెయ్ - అన్నాడు. 

అప్పుడిక శివుడు రుద్రుడే అయ్యాడు . కోపంతో నీవు "గుష్ఠు వ్యాధిం దపియింపుము" అని శపించాడు . 

నత్కీరుడి ప్రతిపాదనలో దోషం లేకపోవచ్చు .  కానీ, ప్రతిభాషణలో దోషం ఉంది. అహంకారం ఉంది. సామాన్యుల అహంకారంవల్ల సమాజానికి కీడు ఆట్టే ఉండదు. కానీ నత్కీరుడిలాంటి మహోన్నతులకు ఇంత అహంకారం ఉంటే లోకానికి కీడు కూడా మహోద్ధృతంగానే ఉంటుంది. అందుకని కాబోలు తీవ్రమైన శాపమే ఇచ్చాడు పరమేశ్వరుడు . 

అప్పటికి నత్కీరుడి కళ్ళు తెరుచుకున్నాయి. అహంకారపు పొరలూ, మోహపు తెరలూ విడిపోయాయి. అపరిమితంగా భయపడిపోయాడు. ఓ స్వామీ! ద్రోహం చేసాను క్షమించు. ఓ కృపాధామా (దయాలవాలా!) శాపవిమోచన మార్గం ఏమిటో (శాపాంతంబు) తెలుపుమా నాకు - అంటూ పాదపద్మాల మీద పడ్డాడు. 

శివుడు భోళా శంకరుడు. వేంటనే శాంతించాడు. "కైలాసాన్ని దర్శించినట్టయితే నీ కుష్ఠురోగం మానిపోతుంది. అదే శాప విమోచన. బయలుదేరు !" అన్నాడు. 

పాపం నత్కీరుడు హృదయంలో పరితపించాడు. ఈ కవితాభిమానము దురభిమానముగా నాకు ఎందుకు పరిణమించాలి?  శంఖ పీఠిపై ఉన్న మిగిలిన కవుల్లాగా ఉండక నేను ఎందుకు దేవునితోనే వాదనకి దిగాలి ? ఆయనపట్ల ఎందుకు అమర్యాదగా ప్రవర్తించాలి ? ఇప్పుడా వెండికొండకి (కైలాసానికి ) వెళ్లాలంటే, ఎలా? ఎన్ని సముద్రాలు, అరణ్యాలు , నదులు, కొండలు , పర్వతాలూ అధిగమించాలి? ఇది నాకు సాధ్యమయ్యే పనేనా ?  అని పరిపరి విధాలా తలపోసి వగచాడు . 

ఈశ్వర నివాసమైన కైలాసాన్ని ఎలా వెళ్ళి చూడటం! ఎప్పుడూ ఎవ్వరూ వెళ్ళింది కాదు. చూసింది కాదు. కాకపోతే విన్నాం. ఉత్తర దిక్కున ఉంది అనీ, అదే శివుడికి ఆవాసమూ అనీ, పెద్దలు చెప్పగా విన్నదే కానీ, కన్నది కాదు. ఓ సదాశివా! ఏమి చెయ్యను స్వామీ! దారిలో ఎదురయ్యే అడవులూ, కూరమృగాలూ, రాక్షసులూ, మధ్యలో జనులు ఉండని ప్రదేశాలెన్నో! దగ్గరవుతున్న కొద్దీ పెను మంచు వానలూ, కాళ్ళకి గాయాలు చేసే రాళ్ళూ రప్పలూ - ఆ దారుల్లో ప్రయాణం చెయ్యడం శక్యమా! ఎలాగ, స్వామీ! 

అని ఆ స్వామికి తన గోడు వెళ్లబోసుకుంటూ , చింతాక్రాంతమైన అలోచనా పరంపరలు అనే వర్షధారల్ని కురిపిస్తూ , నత్కీరుడు అనే మేఘుడు ఉత్తర దిశకు నడిచాడు. 

ఇక దక్షిణ దిక్కున నత్కీరుడు లేడు. వర్షాకాలం వెళ్ళిపోయి, శరత్కాలం వస్తే ఎంత తెరిపిగా ఉంటుందో - అంత తెరిపిగా ఉంది దక్షిణ దేశం. దక్కిణ దిక్కున ఉన్న కవుల ముఖ పద్మాలు సంతోషంతో వికసించాయట. శరదృతువులో పంకజాలు వికాసం పొందినంత ఆనందం దక్షిణాపథ కవుల ముఖాల్లో కనబడుతోంది. నత్కీరుడు వెళ్ళిపోయాడంటే - పీడ విరగడయ్యిందిరా, భగవంతుడా అని తక్కిన కవులంతా సంతోషించారని. 

ఇది ఆ కవుల మాత్సర్యాన్ని తెలీజేయడంకన్నా నత్కీరుడి అహంకారాన్నీ దౌష్ట్యాన్నీ తెలియజెబుతోంది. వాళ్ళని అంతగా ఏడిపించుకు తిన్నాడన్న మాట. ఇది నత్కీరుడి సహజ లక్షణమన్నమాట. అదే దూకుడు శివుడిమీదా చూపించాడు. ఫలితం అనుభవించాడు. 

ఇలా నానా కష్టాలు పడి నత్కీరుడు వెళుతోంటే, కుమార స్వామి ప్రత్యక్షమై "శివుడు కైలాసం చూడ మన్నాడే కానీ ఉత్తర దిశా కైలాసం అనలేదు కదా. అంచేత దక్షిణ కైలాసం చూచినా చాలు. కుష్ఠురోగం మానిపోతుంది" అని చెబుతాడు.

ఆయన ఉపదేశం పుణ్యమాఅని ,  దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిని పొందిన శ్రీకాళహస్తి ని దర్శించాడు . అలా  నత్కీరుడు శాపవిముక్తుడయ్యాడు. ఆనందంతో శివుని ప్రస్తుతించాడు . దాంతో శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పటికి నత్కీరుడి అహంకారం పటాపంచలు అయ్యింది మరి . అహంకార మేఘాలు తొలగిన నిర్మలమైన ఙ్ఞానోదయంతో అడిగాడు - ‘ఈ  సంసారము, దుఃఖా వాసానందంబు, దీని వర్జింపంగా నే సుఖము గలుగు దయనన్నా సుఖమున గూర్పవే ! కృతార్థుడ నగుదున్ ప్పుడు’ అని . మోక్షాన్ని కోరాడు . లయకారుడు సంతసించి ఆ కవికి సాయుజ్యం అనుగ్రహించాడు. అదీ కథ . 

కాబట్టి వినయంతో మెలగడం, విజ్ఞుల పట్ల గౌరవంతో మెలగడం ఎప్పుడూ మేలని తెలుసుకుంటే మంచిది .  శుభం . 

ధూర్జటి మహాకవి విరచిత “శ్రీకాళహస్తి మాహాత్మ్యం” లోని “నత్కీరుడి” కథ !
 (ఇది ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి “పద్యకవితా పరిచయం” నుండి గ్రహింపబడినది.)

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda