Online Puja Services

పిల్లలకి చదువు బాగా రావాలంటే ఇలా ఈ ఒక్క నామం చాలు !

3.134.104.173

పిల్లలకి చదువు బాగా రావాలంటే ఇలా ఈ ఒక్క నామం చాలు !
- లక్ష్మీరమణ 

పిల్లలకి చదువు సరిగ్గా రావడం లేదని బాధపడిపోయే తల్లిదండ్రులు ఈరోజుల్లో కోకొల్లలు. ఎందుకంటె మనం ఉన్నది ఒక పోటీ ప్రపంచంలో కదా ! అందుకే రేపటి పిల్ల భవిష్యత్తుకి ఆసరమైన విద్యపైన మనకి అంతటి జాగ్రత్త .  ఒకవేళ ఇవాళ వాళ్ళు సరిగ్గా ఆ విద్యలో రాణించకపోతే, రేపు వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో అనే ఆందోళన. దీనికి సంతాన ధర్మం ఒక అద్భుతమైన దారి చూపించింది. ఒకే ఒక్క నామం రోజూ స్నానం చేసుకున్న తర్వాత పఠించేలా , పిల్లలకి అక్షరాభ్యాసం అయినా నాటి నుండీ అలవాటు చేస్తే చాలు . భగవంతుని అనుగ్రహంతో  బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు కూడా పరివర్తనని పొందగలరని విశ్వాసం . మాత్రాలకే మహామంత్రంగా చెప్పబడిన ఆ నామాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం . 

 
శ్లో|| ఈశాన స్సర్వవిద్యాన మీశ్వర సర్వ భూతానాం|
          బ్రహ్మాధిపతి బ్రహ్మణాధిపతి బ్రహ్మశివోమే అస్తు సదాశివోం||

సర్వ విద్యలకు అధిపతి ఈశానుడు. సర్వ భూతాలకూ / ప్రాణులకూ అధిపతి  ఈశ్వరుడు.  బ్రహ్మము అంటే బ్రహ్మగారికి  ప్రభువు , భ్రాహ్మణములకు  అంటే వేదములకు అధిపథి అయిన, ఆ పరబ్రహ్మే శివుడు. అటువంటి సదాశివుడు నాకు శుభములను ఒసగుగాక! అని ఈ శ్లోకానికి అర్థం . ఇది వేదము చెప్పిన మాట ! 

అంటే, మనని సృష్టించినవాడు అయిన బ్రహ్మకి కూడా గురువైనవాడు ఆ ఈశ్వరుడు.  కనుక ఆయనే ఆదిగురువు అని అర్థం చేసుకోవాలి . గురువు అనుగ్రహం లేకుండా ఏ విద్యా కూడా అబ్బదు. ఫలించదు. సదా శుభాలనిచ్చే ఆ పరమేశ్వరుని గురు స్వరూపమే శ్రీ దక్షిణామూర్తి. అందువల్ల పిల్లలు ఎప్పుడైతే చిన్నగా మాట్లాడం నేర్చుకుంటూ ఉంటారో అప్పటినుండీ వారిచేత ఈ దక్షిణామూర్తి శ్లోకాన్ని చదివించడం ఉత్తమమైన ఫలితాన్నిస్తుంది ఆధ్యాత్మికవేత్తలు తెలియజేస్తున్నారు. 

గురవే సర్వలోకానాం 
భిషజే భవ రోగిణాం 
నిధయే సర్వ విద్యానాం 
శ్రీ దక్షిణా మూర్తయే నమ: 

ఇంతేకాదు , సర్వ వేదములకీ అధిపతి అయిన ఆ దక్షిణామూర్తి మంత్రాన్ని కూడా వేదశాస్త్రం మనకి స్పష్టంగా చెబుతోంది. పైగా అది మంత్ర రాజమని పేర్కొంది. ఇంతటి గొప్ప మంత్రాన్ని గురువు ఉపదేశం లేకుండా కూడా పఠించవచ్చని , దాని ఫలితం అద్భుతంగా ఉంటుందని పేర్కొంది. 

ఆ మహా మంత్రమే ‘శివాయ గురవే నమః’ ఇంతే ! ఇంకా దీనికి ఏవిధమైన అక్షరాలనీ జోడించవలసిన అవసరం లేదు. పలకడం ఎంతో సులభం. చిన్నారులు కూడా అతి సులభంగా నేర్చుకోగలిగిన ఈ మహామంత్రంలో పంచాక్షరి తో పాటు ‘గురవే’ అనే మూడక్షరాలు చేరడం వల్ల అష్టాక్షరిగా మారి, అనంతమైన ఫలాన్ని అనుగ్రహిస్తుంది .  దీనివల్ల జ్ఞానం ప్రాప్తిస్తుంది అని చెప్పారు.

 కాబట్టి ఈ రెండు, ఒకటి దక్షిణా మూర్తి శ్లోకం, తర్వాత ఈ అష్టాక్షరీ నామం పిల్లలకి రోజూ చెప్పుకోవడం , జపం చేయడం అలవాటుగా చేయండి.  వాళ్ళు ఖచ్చితంగా  విద్యల్లో ఉన్నత శ్రేణిని పొందడం మీరు గమనిస్తారు.  

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore