Results 1 to 4 of 4

Thread: జ్ఞానమార్గం-(1)

          
   
 1. #1
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  జ్ఞానమార్గం-(1)

  జ్ఞానమార్గం లేక జ్ఞానయోగం అనేది ; క్షణికమైన ఇహపర సౌఖ్యాల యందు వాంఛను పోగొట్టి, రాగాది ద్వేషాలను నశింప జేసి మనశ్శుద్ధిని కలిగిస్తుంది. బ్రహ్మైక్యజ్ఞానాన్ని కలిగించే సులభమైన మార్గంగా చెప్పబడింది. పరమాత్మను గురించిన జ్ఞానమే జ్ఞానమంటే. ఈ జ్ఞాన యోగాన్ని శ్రద్ధ, భక్తి , ధ్యానములతో ఆచరించ లేక మాయచే మోహించ బడిన జనులు దారేషణ , పుత్రేషణ , ధనేషణలనే ఈషణత్రయం చేత సంసారంలో తిరుగాడుతూ ఉన్నారు. అన్ని విద్యలూ అహంకారాన్ని పెంచేవిగా ఉంటె , బ్రహ్మ విద్య బ్రహ్మత్వాన్ని పొందించి , శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది. జ్ఞాన యోగం మహోత్కృష్ట మైనది. అంచేత ఇది అనేక జన్మల సంచిత కర్మలను భస్మం చేసి ఆత్మజ్ఞానాన్ని కల్గిస్తుంది. తనే బ్రహ్మమని తెలిసికోవడం జ్ఞానానికి పరాకాష్ఠ . అజ్ఞానమంటే నేను, నాది,ఈ శరీరమే నేను అనుకోవడం వంటివి. జ్ఞానప్రాప్తి అనేది భక్తి ,కర్మ మార్గాలలో కుశలత సంపాదించిన తర్వేతే లభిస్తుంది. మనస్సు శుద్ధి ఐన తర్వేతే జ్ఞానానికి అర్హత వస్తుంది. ఇది బుద్ది కుశలత గలవారికి మార్గంగా చెప్పుకోవచ్చు. శ్రవణ, మనన , నిదిధ్యాసనలనేవి జ్ఞాన సాధనాలు. వీటిని నిరంతరమూ అభ్యాసం చేస్తే జ్ఞానయోగం నిరతిశయ సుఖాన్ని కలిగించి శాశ్వతమైన మోక్షాన్ని కలిగించే రాచ బాటగా చెబుతారు.


  భగవద్గీతలో, మోక్షమార్గమైన భగవద్భక్తి యందు శ్రద్ధ కలిగి , ఎల్లపుడూ స్వామిని కీర్తిస్తూ శమ, దమాది నియమాలతో ఆ పరాత్పరుడిని సేవిస్తుంటారో, ఎవరు శ్రవణ మనన నిదిధ్యాసనలందు సమర్ధులో అట్టి ఉత్తమ, మధ్యమ, మందాధికారులందరికీ ఈజ్ఞాన యోగము ఆచరణీయంగా చెప్పబడింది. మానవుడు అజ్ఞానంచేత;ఇంద్రియ లోలుడై , దృశ్య ప్రపంచమందలి విషయాలూ , కన్పించే వస్తువులూ వాస్తవంగా తోచి , సుఖాలకోసం మార్గాలను వెదుకుతు౦టాడు. ఒకటి లభించిన తర్వాత మరొకటి ఇలా కోర్కెలకు అంతులేక , సంతృప్తి లభిస్తుందని ఆశతో, జీవితంలో పరుగులు పెడుతుంటాడు. చేదు అనుభవాలు ఎదురౌతూనే ఉంటాయి. ఐనా సంతుష్టి కల్గుతుందనే ఆశ మాత్రం చావదు. ఇలా మోసపోయి జవసత్వాలుడిగి మరణిస్తాడు. ఇదే మాయ. జ్ఞానమనే శబ్దం చేత బ్రహ్మమును , బుద్ది వృత్తినీ కూడ చెప్పడానికి ఉపయోగించడం జరుగుతోంది. ఆత్మ బుద్ది యందు ప్రసరించడం వల్ల , బుద్ధిలో కలిగే ధర్మాన్ని జ్ఞానం అంటాం. అజ్ఞానం ప్రకాశింప బడేదైతే జ్ఞానం ప్రకాశించేది. బ్రహ్మమును తెలుసుకొనే వివేకమే బ్రహ్మ జ్ఞానం. వేదాంత గ్రంధాలలో ముఖ్యంగా భగవద్గీతలో జ్ఞాన అనే శబ్దం అనేక మార్లు ఉపయోగించబడింది.


  ప్రతీ ప్రాణి సత్వరజస్తమో గుణాలతో కూడి ఉంటుంది. రజస్తమో గుణాలు అణగి, సత్వ గుణం వృద్ది చెందితే సాత్విక జ్ఞానం కలుగుతుంది. దాని వల్ల వేర్వేరుగా ఉండే సర్వ భూతముల యందూ అవిభక్తమై,నాశరహితమై, ఏకమై ఉండే పరమాత్మ తత్వాన్ని చూడకల్గుతాం. ఆత్మ స్వరూపమందు ఎల్లపుడూ మనస్సును నిల్పి , మోక్షమందే దృష్టి కలిగి ఉండటం జ్ఞానమని , దీనికి విరుద్ధమైనది అజ్ఞానం అనీ భగవద్గీతలో చెప్పబడింది. జ్ఞానమనే అగ్ని ఆగామి సంచిత కర్మలను కూడ దగ్ధం చేస్తుందని చెప్పబడింది. అంచేత అజ్ఞానమనే సంసారాన్ని జ్ఞానం చేత తొలగించు కోవాలి. బ్రహ్మ మొదలుకొని సూక్ష్మమైన జీవరాసుల వరకు ఉండే,అన్ని జీవులలోను బుద్ది సాక్షికి స్థానమైన ఆత్మగా ప్రకాశించే కూటస్థ చైతన్యమే అంతర్యామి. ఎనుబదినాలుగు లక్షల జీవరాసులలోనూ చైతన్య స్వరూపమైన ఆత్మ ఏకరూపంగానే ప్రకాశిస్తోంది. బ్రహ్మచైతన్యరూపమైన ఆత్మ, కర్మరూప విశేషమగు జీవుడూ ఒక్కటే అని తెలుసుకునే విద్వాంసుడు ఆత్మయందే క్రీడిస్తూ ఆత్మయందే ఆసక్తి గలవాడై; సుఖదుఃఖానుభవాల
  నుండి , సంసారమునుండీ విడువబడు చున్నాడు.

 2. #2
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  జ్ఞానమార్గం-(2)

  దేహము పంచభూత సంబంధమైనది. ఇంద్రియాలతో సంబంధపడి లోకవ్యవహారాన్ని సాగిస్తుంటుంది. మనస్సే అన్ని కర్మలకూ మూలం. మనస్సు , ప్రాణముల ఏకరూపమే జీవుడు. అంచేత అన్ని కర్మలకూ దేహమే కారణమని చెప్పబడుతోంది. తనకు ఇష్టమని అనుకోవడం సుఖబుద్ది. అయిష్టం అనుకోవడం దుఃఖబుద్ది. జ్ఞానేంద్రియాలు గ్రహించే శబ్ద స్పర్శ రస రూప గంధాలనే ఇంద్రియ వ్యవహారమంతా సుఖదుఃఖాలకు కారణం. దేహం మరణించే స్వభావం కలది. ఆత్మకు ఉపాధి(ఆశ్రయం). ఈ ఆత్మ దేహంతో కలసి ఉన్నపుడు ,అహంకార రూపమైన ఇష్టా , అయిష్టాల సంబంధంతో వ్యవహరిస్తూంటుంది. వాస్తవానికి ఆత్మకు రాగ ద్వేషాదులు ఉండవు. ఐనా దేహాత్మ బుద్ది వల్ల రాగద్వేషాలు కలుగుతున్నాయి. దేహాత్మ బుద్ది నశిస్తే రాగద్వేషాలు ఉండవు. దేహాత్మ బుద్ది అంటే - దేహమే ఆత్మ అనుకొనే భావన.


  మానవుడు తన ఇచ్చానుసారంగా కర్మలు చేస్తూ, ఆకర్మలఫలాలను పొందుతూ ఉంటాడు. మనస్సుకు దేనిమీద ఆసక్తి ఉంటుందో, అదే కర్మకు బీజమవుతుంది. సంసారంలో చిక్కుకొన్న జీవుడు; ఇష్టప్రకారం చేసిన కర్మ ఫలాలను ఈలోకంలోనే అనుభవించి, మరణ సమయంలో కర్మరూప వాసనలనే బీజములతో కూడినవాడై తిరిగి ఈలోకంలో కర్మ చెయ్యడానికి జన్మిస్తున్నాడు. ఇలా జీవుడు కర్మవశుడై తనకు తానుగా సంసారంలో పడుతూంటాడు. కాని జ్ఞానం కలిగినవాడు నిషిద్ధమైన కర్మలజోలికి పోకుండా, కర్మఫలాలందు ఆసక్తిలేకుండా నిష్కామకర్మలను చెయ్యడంచేత ఈలోకంలోనే పరమాత్మను పొందుచున్నాడు. కాబట్టి బ్రహ్మమును తెలుసుకునే ఆత్మజ్ఞానం(బ్రహ్మ విద్య) మోక్ష ప్రాప్తికి సాధనంగా ప్రతిపాదించ బడడింది.సృష్టికర్తకు కూడ కారణమైన ఆ పరబ్రహ్మను దర్శించినవాడు పుణ్యపాపముల నుండి విముక్తుడై బ్రహ్మానందమును పొంది సర్వోత్తమమైన పదవిని పొందుచున్నాడు. అలా గాక కొంత సందేహము, కొంత అనుభవము ఉండి మనస్సును జయించని వారికి సమాధానము దొరకక, కర్మ మరియు జన్మలనుండి విముక్తి లభించదు. అట్టి వారు మతము,ధర్మము, ఆచారముల పేరుతో సగుణ సాకారరూపమైన ప్రకృతి విషయాలందు సత్యత్వ భ్రమ కలిగి ఉంటారు. అందువల్ల సత్యం తెలియక ఆత్మానాత్మ వివేకము ఉండదు.


  వాస్తవానికి అజ్ఞానమే దుఖ్ఖానికి కారణం. ఇంద్రియములవల్ల కాని, ఇంద్రియలోలత్వం వల్ల కాని సుఖించిన వాడెవడూ లేడు. ఈప్రపంచంలో వస్తువులన్నీ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడి, కొంత కాలం తర్వాత మార్పుచెందేవే. అదేవిధంగా మన భోగములూ, సంపద, జ్ఞానం, అహంకారం అన్నీ మరణించేవే. అనిత్యమైన వస్తువుల విషయాలలోనే మార్పు ఉండగలదు. అదేవిధంగా మనశరీరమూ, మనస్సూ కూడా నిత్యములు కావు . కాబట్టి మార్పు చెందుతూంటాయి. ఉదాహరణకు మనం ఒకక్షణంలో సంతోషంగా ఉంటె, మరొక క్షణంలో ఉద్వేగానికి లోనై మనస్సు వికారాలకు లోనౌతుంది. మనశరీరం కూడ వయస్సు పెరిగేకొద్దీ మార్పులు చెందుతూనే ఉంటుంది. మన చుట్టూఉండే ప్రపంచమూ మార్పు చెందేదే. అసలు దేశ , కాల ,మాన , పరిస్థితులన్నీ మనస్సు నుండే కల్పించబడుతాయి. అదే విధంగా భగవంతుడినీ మనమే ఊహించి ఇలా ఉంటాడని సృష్టించు కుంటున్నాం. అంటే మనసు లేకపోతే ఈవ్యక్త ప్రపంచమూ లేనట్లే గదా.

 3. #3
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  జ్ఞానమార్గం-(3)

  ఈ ప్రపంచంలో గల వస్తు సముదాయమంతా బ్రహ్మంచేతనే వ్యాపించబడి ఉ౦ది. అభాస అంటే లేనిది ఉన్నట్లుగా కన్పించటం. మీరు , నేను , మనకు కన్పించే వస్తు సమూహమూ కేవలం భ్రాంతి రూపాలు. అఖండమై ఆనంద స్వరూపమై వెలిగే ఒకేవస్తువు తప్ప , వేరే ఏదీ లేదు. అదే ఏకైక సత్పదార్ధమైన ఆత్మ. ప్రకృతి , జగత్తు , భగవంతుడు విడిగా లేరు. ఉన్న ఏకైక సత్పదార్ధ౦ ను౦చే నామరూపాల మూలంగా ఇవన్నీ కల్పించబడు తున్నాయి. ఈ భ్రాంతినే మాయఅంటారు. ఇక్కడ స్వామి వివేకానంద మాయను గురించి చెప్పే ఉదాహరాణతో మరింత బోధపడుతుంది. సముద్రంపై ఒక కెరటం ఉంది. అది సముద్రానికన్న భిన్నంగాలేదు కదా. కాని దానిలో కెరటమనే భిన్నత ఉంది . ఈ బేధానికి కారణం నామ రూపాలే . అంటే మనసున గల భావమూ , ఆకారమూ. కాని తరంగ రూపాన్ని సముద్రం నుంచి వేరుచేసి భావించలేం. కెరటం / తరంగం అణిగిన క్షణం లోనే రూపం నశిస్తుంది. కాని ఆ రూపం భ్రాంతి కాదు. తరంగమున్నంత కాలమూ రూపం ఉంది. కావున దాన్ని చూడక తప్పలేదు. ఇదే మాయ. ఈ విధంగా ప్రపంచమంతా దేశ ,కాల , నిమిత్తాలతో కల్పించబడిన ఒక విశేష రూపమనవచ్చు. వీటన్నిటికీ ఆ తరంగమే ఆధారం. తరంగం అణగగానే అవి అదృశ్య మవుతాయి. ఈ మాయను ఏ మానవుడు దాటుతాడో , వానికది అదృశ్యం అవుతుంది. అపుడు ముక్తుడవుతాడు.


  భగవంతుడు జ్ఞానాతీతుడు. ఏది తెలుసుకోవాలన్నా, ఏది తెలుసుకున్నా, బ్రహ్మం మూలంగానే బ్రహ్మంనందే తెలుసుకోవాలి. నీ ఆత్మకు మూలమతడే. అతడేసత్యం. అదే ఆత్మ. నీవే అది. ఉన్నదల్లా ఒకేవస్తువు. రెండవదేదీ లేదు. ప్రపంచమే దైవం అనేది వేదాంత బోధ . అన్నిటా దైవాన్ని చూడాలి. ఇదే ప్రపంచాన్ని విడనాడటమంటే. జీవన్మరణములు , సుఖ దుఖ్ఖములు వంటి ప్రతి విషయంలోనూ దైవం సమానంగా నిలిచి ఉంటాడు. కష్టాలకు మూలం కోరికలే. వాటిని త్యజించండి. త్యజించడం అంటే సత్యం తెలిసికొని ఏ ఒక వస్తువూ మీ స్వంతం అని కాని , దాన్లో మీకూ కొంత భాగం ఉందని కాని, భావించ వద్దు. మీరు ఊహించుకునే రూపంలో జగత్తు ఎప్పుడూ లేదని గ్రహించండి. జగత్తు ఒక స్వప్నదృశ్యం. నిజంగా ఉన్నది దైవమే. సర్వమూ దైవమే ఐనపుడు నేనెవరు , మీరెవరు ? ఇలాంటి భావనతో నిస్స్వార్ధంగా కర్మలు చేయమని వేదాంతం చెబుతోంది .


  ఈ విశ్వమంతా బ్రహ్మం వ్యాపించి ఉంది. అభాస అంటే లేనిది ఉన్నట్లుగా కన్పించడం. మీరు, నేను , మనకు కన్పించే అన్ని వస్తువులూ కేవలం భ్రాంతి రూపాలు. అఖండము, ఆనంద స్వరూపమై వెలిగే సత్పదార్ధం తప్ప వేరే ఏమీ లేదు. నామరూపాలనే భేదాలను తొలగిస్తే , విశ్వమంతా ఏకరూపమై ప్రకాశిస్తుంది. ప్రకృతి, జగత్తు ,భగవంతుడు విడిగా లేరు. ఉన్న ఏకైక సత్పదార్ధం నుంచే నామ రూపాల మూలంగా ఇవన్నీ కల్పించ బడు తున్నాయి. తాను వెదికే దేవుడు తన అత్మేనని చివరికి తెలుసుకుంటాడు. శాశ్వతానందాన్ని పొందుతాడు. ఇదంతా ద్వైతంతో ప్రారంభమై, విశిష్టాద్వైతం ద్వారా పరిపూర్ణ అద్వైతంలో ముగుస్తుంది . బ్రహ్మంతో ఐక్య భావాన్ని పొందటమే మన పరమ గమ్యం.


  ఈయోగం ఇంద్రియ నిగ్రహ సంబంధ మైనది. ఇంద్రియాలు ఆత్మకు పూర్తిగా లొంగి మనసుకు వశమైనపుడు యోగం సిద్దించినట్లే. ఇంద్రియాలు తమవశమై కోరికలు నశించినపుడు, అమృతత్వాన్ని పొందుతాడు. జనన మరణాలు శరీరానికే. అసలు నీవు పుట్ట లేదు. మరణించవు కూడ. భోగాసక్తి, అహంకార మమకారాలూ ఉన్నంత వరకు పునరావృత్తి పొందుతుంటాం. నిత్యమూ, త్రిగుణాతీతము, అనాది ఐన సత్పదార్ధాన్ని
  సాక్షాత్కరించుకున్నవాడు జనన మరణాల నుంచి విమోచన పొందుతాడు. నేను, నాదీ అనే భావనే అన్ని అనర్ధాలకూ మూలం. నేను నాది అనే భావం తొలగినపుడు సర్వం భగవంతునికే అర్పించబడి, హృదయం పవిత్రమై భక్తి పుడుతుంది. ఇలా జీవాత్మ పరిశుద్ధి చెందిన తక్షణం, అది భగవంతుని వైపు ఆకర్షించ బడి ఆ సాన్నిధ్యంలో నిలిచి ఉంటుంది.

 4. #4
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  జ్ఞానమార్గం-(4)

  ఎవరికోసం లోకమంతా వెదికి, వివిధ దేవాలయాల్లో విలపించి ప్రార్ధి౦చామో, ఎవరు మేఘాల చాటున దాగి ఉన్నాడనుకున్నామో; అతడు అన్ని వస్తువులకన్న అత్యంత దగ్గరలో ఉన్నాడు. అది మన ఆత్మయే.
  'తత్వమసి' (అది నీవే)అన్నది, అన్నిఉపనిషత్తుల చివరిమాట. మనం ఆత్మ సహజలక్షణమైన ప్రజ్ఞానాన్ని మళ్లీ ప్రకటించుకోవటమే. అజ్ఞానం తొలగిపోయినపుడు తాను వెదికే దైవం తన ఆత్మయేనని తెలుసుకుంటాడు. అదే 'అహం బ్రహ్మస్మి' అనే ఉపనిషద్వాక్యం. మనం చెయ్య వలసిన దల్లా శాస్త్రవచనం,గురూపదేశాల ద్వారా విన్న విషయాలను బుద్దికుశలతతో మనన౦ చెయ్యాలి. మనస్సు చేతనే మనస్సును జయించి, ఇంద్రియాలను వశపరచుకొని, అహంకార మమకారములు, కర్తృత్వ భావమూ లేకుండా,సుఖదుఖాలందు సమభావ౦తో ఉండాలి. జరిగే పనులను కేవల౦ సాక్షిగాచూస్తూ, అత్మయందే స్థిరమైన బుద్దికల్గి, ఆత్మయే తానని తెలిసి ఆనందానుభూతిని పొందటం.

  మనస్సు సూక్ష్మ పదార్ధమైన ఆకాశ పదార్ధం. బ్రహ్మము జ్ఞానాతీతమైనది. దేన్ని తెలుసుకోవాలనుకున్నా బ్రహ్మమందే, బ్రహ్మం మూలంగానే తెలుసుకోవాలి. అన్ని వస్తువుల్లోనూ ఈశ్వరుడుండగా అతనికై, మనం మరో చోటికి వెళ్లడం ఎందుకు? మహత్తర నదీతీరంలో కూర్చొని దప్పికతో చస్తున్నాం. ఆనందమయ జగత్తు ఇక్కడే ఉంది. కాని అది అజ్ఞానం వల్ల మనకు కన్పించడం లేదు. అహోరాత్రాలూ మనం దాన్లోనే నివసిస్తున్నా అది మనకు ఆనందమయంగా తోచడం లేదు.

  జ్ఞానయోగి వైరాగ్యం సమస్త అనుభవానికీ నిలయం ఆత్మయే కాని ప్రకృతి కాదని ముందునుంచీ గ్రహించాలి. మనలో ఉండే అంతఃకరణాన్నిమంచీచెడుల విచక్షణా జ్ఞానాన్ని గ్రహించేటపుడు బుద్ది అంటారు. బుద్ది నిశ్చయించిన దాని పూర్వాపరాలను చింతన చేసి, క్రియారూపంలో పెట్టేటపుడు చిత్తము అంటారు. ఇలాంటి అంతఃకరణ శక్తి, బుద్ది రూప వ్యవహారాలనే కేవలం చేస్తూండటాన్ని జ్ఞానమార్గం అంటారు. అంటే విషయం ఇదీ అని తెలిసికోడం. ఈ మార్గంలో విచారణ ప్రధానం. విషయం ఇదీ అని తెలుసుకొని , దాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించి అనుభవంలోకి తెచ్చుకోవాలి.


  జీవన్మరణాలు శరీరానికే. నీవు పుట్ట లేదు. మరణించవు. ఒకే ఆత్మ ఉఉంది, ఒకే సత్త. మనలో ఉండే ఎన్నో మూఢనమ్మకాలని వదలిపెట్ట వలసి వస్తుంది. ఐనా దీక్షతో సత్యాన్వేషణ చేసేవారు ఈ లోకంలో కొందరే ఉంటారు. జగత్తును ఇంద్రియాల ద్వారా జీవాత్మల సమూహంగా, పారమార్ధిక జ్ఞానంద్వారా బ్రహ్మంగా తెలుసుకుంటున్నాం. జగత్తులో బ్రహ్మం అనబడే ఒకే సద్వస్తువు ఉందనేది అద్వైత సిద్ధాంతం. మిగిలినదంతా అసత్తు. మాయ మహిమతో అంతా బ్రహ్మం నుంచే కల్పితం అవుతోంది. బ్రహ్మంతో ఐక్యం చెందటమే మన పరమగమ్యం. అజ్ఞాన రూపమైన మాయను తొలగించు కోవడమే మన స్వస్వరూపాన్ని తిరిగి పొందటం.

  సుఖం ఆత్మలోనే ఉంది. దేశ,కాల, నిమిత్తాలకు లోబడేదంతా మాయ. సుఖ దుఃఖాలు కలిసే ఉంటాయి. ఇది మంచిది, కేవలం ఇది మంచిది అనిగాని, ఇది చెడ్డది , కేవలం ఇది చెడ్డదని చెప్పగలిగే వస్తువేదీ లేదు. ఈరోజు మంచిదిగా తోచేది రేపు చెడుగా తోచవచ్చు. మంచీ చెడులు ప్రత్యేక వస్తువులు కాదు. రెండూ ఒక వస్తువే. ఆ వస్తువు మనకు కనిపించడంలో ఉండే ఎక్కువ తక్కువలకే ఆపేర్లు. ఒకరికి దుఃఖ కారణమైన వస్తువు మరొకరికి సుఖమైనది కావచ్చును. మార్పు అనేది ప్రకృతి సంబంధమైన వాటికే. నిత్యమైన ఆత్మకు ఏ వికారాలూ ఉండవు. ఆత్మ అనంతం. అఖండం. అదే నీ యదార్ధ మైన రూపం. చేసే మంచి పనులవల్ల ఆత్మకూ మనకూ మధ్య గల ప్రకృతి అనే పొర పలుచబడి, నిత్య శుద్ధమైన బ్రహ్మము క్రమాధికంగా సాక్షాత్కరిస్తుంది. అఖండమైన బ్రహ్మము దేశ, కాల పరిస్థితుల ద్వారా జగత్తుగా మారింది. కాలం మనోవృత్తులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి దానికి ఉనికి లేదు. అసలు దేశ, కాల నిమిత్తాలనే వాటికి వస్తు సంబంధం లేని ఉనికే లేదు.

  ప్రతీ కార్యానికీ ఒక కారణం ఉంటుంది. అంటే ఆ కార్యానికి ముందు, దానికి కార్యభూతమైన మరొక కార్యం జరిగి ఉండాలి. ఈ పూర్వపరత్వ సంబంధాన్నే నిమిత్త న్యాయం అంటారు. ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ ఒకదాంతో మరొకటి సంబంధాన్ని కలిగే ఉంటాయి. కాని అఖండమైన బ్రహ్మంలో మాత్రం కారణం ఉండదు. ఎందుకంటే అదే సర్వ స్వతంత్ర మైనది గనుక. అనంత వస్తువైన ఆత్మలో మార్పు ఉండదు. మన యదార్ధ తత్వమైన పరిపూర్ణత్వాన్నిచేరుకోవడానికే మన ప్రయత్నమంతా.

Thread Information

Users Browsing this Thread

There are currently 1 users browsing this thread. (0 members and 1 guests)

Members who have read this thread: 0

Bookmarks

Posting Permissions

 • You may not post new threads
 • You may not post replies
 • You may not post attachments
 • You may not edit your posts
 •