Results 1 to 4 of 4

Thread: యోగ మార్గము (1)

          
   
 1. #1
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  యోగ మార్గము (1)

  యోగ మార్గము లేక రాజ యోగము
  ఈ రాజయోగాన్ని పతంజలి మహర్షి సూత్ర రూపం లో శాస్త్రీకరి౦చాడు. రాజయోగానికి "యోగ" అని ,అష్టాంగ యోగమని, క్రియా యోగమనీ పిలుస్తారు. జ్ఞానానికంతా ప్రత్యక్షానుభూతే పునాది. ఈ అనుభూతిని కలిగే విధానాన్ని బోధించేదే యోగశాస్త్రం. బాహ్య విషయాలను గ్రహించటానికి ఆత్మకు మనస్సే సాధనం . మనస్సే సంకల్ప వికల్పాలకు కేంద్రం. ఒక ఇంద్రియ విషయంతో సంయోగం చెందటానికి గాని, సంయోగం చెందకుండా ఉండటానికి గాని సమర్దవంత మైనది ఈ మనస్సే. అంతరంగంలోని విషయాలను పరిశీలించటానికి సాధనలను చూపడమే రాజయోగం ఉద్దేశించబడింది.


  మనసు యొక్క వృత్తి అలోచి౦చటమేకదా. అసలు మనసంటేనే ఆలోచనల సముదాయం. చిత్తవృత్తులను అరికట్టి మనసును అంతర్ముఖం చేసి , మనస్సుతోనే దాని స్వభావాన్ని గ్రహించాలి. శోధించాలి. అపుడు ప్రత్యక్షానుభూతి కలుగుతుంది. మనస్సు,బుద్ది , అహంకారాలను కలసి యోగులు చిత్తము అంటారు. ఒక వస్తువును గ్రహించాలంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సు ఆ వస్తువుయొక్క ఆకారాన్ని పొందాలి . అట్టి ఆకారాలను చిత్త వృత్తులు అంటారు. యోగం అంటే చిత్త వృత్తులను నిరోధించడం అని అంటారు.


  దీన్లో సాధన ప్రధానంగా బోధించ బడుతుంది. ఈ యోగం వల్ల సరైన జ్ఞానం కలిగి తన నిజ స్వరూపాన్ని తెలుసుకొని ప్రకృతి బంధం నుంచి విముక్తి, తద్వారా ముక్తిని పొందటం ముఖ్యమైన ఆశయం. అతీంద్రియ జ్ఞానము , అద్భుత శక్తులూ కలుగుతాయి. చిత్త వృత్తులన్నీ నిరోధించ బడటం వల్ల మనస్సుకు శాంతి లభిస్తుంది. మనం ఆస్తిక దర్శనాలలో యోగ దర్శనం గురించి మూడు భాగాలలో విపులంగా తెలుసు కున్నాం. ఇప్పుడు క్లుప్తంగా మళ్ళీ చూద్దాం.


  సాంఖ్యులు ప్రకృతి, పురుషుడు (జీవుడు) అనే రెండే మూల తత్వాలను అంగీకరిస్తే, యోగ దర్శనంలో వీటితో బాటు ఈశ్వరుడిని కూడ అంగీకరిస్తారు. సత్వరజస్తమో గుణాలతో సామ్యావస్థలో ఉండే ప్రకృతి , పురుష సంయోగంతో ఈ గుణాలలో హెచ్చు తగ్గులు ఏర్పడి, సృష్టికి నాంది పలుకుతుంది. ముందు బుద్దితత్వం ఏర్పడి, అది అహంకారంగా రూపు దిద్దుకొని ఆ అహంకారం నుంచి పంచ జ్ఞానేంద్రియాలు , పంచ కర్మేంద్రియాలు, మనస్సూ పుడతాయి. అహంకారం యొక్క తమో గుణం ప్రధానంగా పంచ భూతతన్మాత్రలు ( సూక్ష్మ భూతాలు), పంచ మహా భూతాలు జనిస్తాయి. ఇలా ప్రకృతితో కలిపి ఇరువది నాలుగు తత్వాలను సాంఖ్యులు అంగీకరిస్తారు. యోగ మార్గం వీటితో బాటు ఈశ్వరుడిని అంగీకరిస్తుంది. అన్ని దర్శనాలూ కూడ దుఖాన్ని తొలగించుకొని కైవల్య పదాన్ని పొందడానికే ఉద్దేశించ బడ్డాయి.


  బుద్ధికి పురుషుని చైతన్యం వల్ల విచక్షణా జ్ఞానం కలుగు తోంది. ఇలా చైతన్యవంతమైన బుద్ధి, అహంకార రూపంగా రూపు దిద్దుకొని నేను, నాది అనేది ఏర్పడి అవిద్యకు కారణం అవుతుంది. అవిద్యచేత జీవుడు రాగ ద్వేషాలకు, సుఖ దుఖాలకూ లోనవుతుంటాడు. ఇలా అవిద్యకు లోనైన జీవుడు కర్మలచేత , జనన మరణాల సంసారమనే చక్రంలో బంధింపబడి తిరుగుతూ ఉంటాడు. ఇలా, ప్రకృతివిషయాలతో తాదాత్మ్యం చెందటం వల్ల అవిద్యచేత కప్పబడినవాడై ప్రకృతి, పురుషుల వివక్షత కోల్పోవడం జరుగుతుంది.


  ఈ ఇరవైనాలుగు తత్వాలనూ అవగాహన చేసుకుని , తనను ప్రకృతి తత్వాల నుండి వేరుచేసు కోగల్గితే ,విచక్షణా జ్ఞానం కల్గి ప్రకృతికంటే తాను భిన్నుడని తెలుస్తుంది. ప్రకృతి యొక్క సంబంధం తొలగడమే విముక్తి చెందటం. ప్రకృతి సంయోగం బంధమైతే, దాని నుంచి విముక్తి పొందటమే మోక్షం లేక కైవల్యం. ప్రతి జీవునిలోను పురుషుడు నిక్షిప్తమై ఉన్నాడు. ఆ ఉన్నత పురుషుని స్వభావం; జాగరూకత /ఎరుకతో చూడగలిగితే బంధం తొలగి సత్యం అవగతం అవుతుంది.

 2. #2
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  యోగ మార్గము (2)

  సత్యాన్ని గ్రహించి , అంతరాత్మలో దాని అనుభవాన్ని పొంది , సత్య దర్శనం చేసినపుడు సంశయాలు తొలగి,అజ్ఞానం నశించి సమస్త కర్మలూ నశిస్తాయని వేదాలు చెబుతున్నాయి. ఏకమైనప్పటికీ ఏది అనేకంగా ప్రకాశిస్తుందో , దేన్లోనించి అనేకమైనవి నిర్మాణమౌతున్నాయో , అలాంటి ఏకత్వాన్ని కనుక్కోటమే అన్ని శాస్త్రాల పరమావధి. అంతరంగాన్ని బట్టే మన బాహ్య ప్రపంచముంటుంది. అంతశ్శక్తులను నేర్పుతో నడిపి ,ప్రకృతిని స్వాధీనం చేసుకుంటే ప్రకృతి నియమాలను అతిక్రమించ కలుగుతాం .


  ఈ యోగ సాధన ఎనిమిది అంగాలుగా విభజించబడింది. అందుచేతనే దీన్ని అష్టాంగ యోగమని అంటారు.
  అష్టాంగ యోగంలో ఎనిమిది అంగాలూ - యమము , నియమము, ఆసనము, ప్రాణా యామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అనేవి.
  1) యమంలో
  అహింస - మనసుచేత , మాట చేత , లేదా మన చర్యల వల్ల కాని ఏ ఒక్కరికీ హాని కల్గించకుండా ఉండటం.
  సత్యం - ఉన్నది ఉన్నట్లుగా తెలుపటం . అంటే అబద్ధం ఆదకుండటం.
  అస్తేయం - ఇతరుల సొత్తు దొంగిలించ కుండటం.
  బ్రహ్మచర్యం - సర్వ కాల సర్వావస్థల్లోనూ మనో వాక్కాయ కర్మలా పరిశుద్ధంగా ఉండటం .
  అపరిగ్రహం - ఏ దుస్థితిలో ఉన్నా ఇతరులనుండి ఏదీ తీసుకొకుండటం . ఎందుకంటే ఏదైనా పరులనుంచి తీసుకుంటే దాత యొక్క పాపాల్లో కొంత పాపం తీసుకున్నట్లే నని శాస్త్రాలు చెబుతున్నాయి. అదీగాక పరిగ్రహణం వల్ల అల్పులమై హృదయ శుద్ధిని కోల్పోతాం.
  ఇవి యమం లోకి వస్తాయి. వీటిని పాటించటం వల్ల మనస్సు శుద్ది అవుతుంది.


  2) నియమం
  శౌచం - బాహ్య శౌచం అంటే తన శరీరాన్నిశుభ్రం చేసుకోడము, శుభ్రమైన వస్త్రాలను ధరించడం, నివసించే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమూ వంటి బాహ్య పరిశుభ్రత. అంతర శౌచం అంటే మనస్సులో కామ క్రోధాలకు తావివ్వక మలిన వాసనలను వదలి శుద్ధ వాసనలు కలిగి ఉండటం.
  సంతోషం అన్ని ప్రాణులకు సంతోషం అవుసరమే. ముఖ్యంగా యోగాభ్యాసికి సంతోషం లేకుండా సాధన కొనసాగించ లేడు. అంచేత సంతోషం సాధన క్రమం తప్పకుండా చేస్తూ పురోగతిని పొందటానికి తోడ్పడుతుంది.
  తపస్సు ఏకాదశి మొదలైన పర్వ దినాలయందు ఉపవాసాలు, జాగరణ చెయ్యడం వంటి వాటి వల్ల ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది .
  స్వాధ్యాయం -- శాస్త్ర అధ్యయనం ,మంత్ర జపం వంటివాటి వల్ల సత్వ శుద్ది కలుగుతుంది. అధ్యయనం చేసి ఇతరులకు కూడ వినిపించడం వంటివి స్వాధ్యాయం లోనికి వస్తాయి.
  ఈశ్వర ప్రణిధానం - సంకీర్తనలు, భక్తిభావంతో భగవంతుని ఆరాధన , ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చెయ్యటం, యోగం నిర్విఘ్నంగా పొందటానికి భాగావతుడిని శరణు పొందటం వంటివి ఈ కోవలోకి వస్తాయి. ఇవి నియమం లోకి వస్తాయి. యమ నియమాలు యోగ సిద్ధికి ఉపకరిస్తాయి.
  తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అనే ఈ మూడూ కలసి క్రియాయోగం అనబడుతోంది.  3) ఆసనం --ఏ ఆసనంలో సాధకుడు స్థిరంగా, సుఖంగా ఎక్కువ కాలం కూర్చోగలడో అలాంటి ఆసనంలో అభ్యాసం కొన సాగించాలి. పద్మాసనం గాని, అర్ధ పద్మాసనం గాని, వజ్రాసనం గాని ఎన్నుకోవచ్చు. తల , మెడ, వక్షం ,వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి. శరీరం స్థిరంగా ఉన్నపుడే చిత్తము కూడ స్థిరంగా నిలుస్తుంది. తూర్పు లేక ఉత్తర ముఖంగానే ఆసనం ఏర్పరచుకోవాలి అని పెద్దలు చెబుతారు. కొద్ది రోజులు అభ్యాసం చేస్తే స్తిరాసనం సిద్ధిస్తుంది. ఆసనం సిద్ధించాక నాడీశౌచం అనే క్రియను చెయ్యాలని కొందరి రాజయోగుల అభిప్రాయం.


  కుడిచేతి బొటనవ్రేలుతో కుడి ముక్కుపుటాన్ని మూసి , ఎడమ ముక్కురంధ్రముతో మెల్లగా గాలిని పీల్చి ; కుడిచేతి చూపుడువ్రేలు లేక మధ్య వ్రేలుతో ఎడమ ముక్కుపుటాన్ని మూసి, కుడి బొటనవ్రేలును వదలి, గాలిని వెంటనే మెల్లగా విడిచి పెట్టాలి. అలాగే పిదప ఎడమవేపు ముక్కుపుటాన్ని మూసిఉంచుతూ కుడి వైపు నుంచి గాలిని పీల్చి గాలిని ఎడమ వైపు నుంచి వదలి పెట్టాలి . ఈ విధంగా మార్చి, మార్చి రోజుకు ఐదు సార్లు వరకు , పదిహేను రోజుల నుండి నెల రోజుల వరకు చేస్తే నాడీశౌచం లభిస్తుందని అంటారు. దీన్నే నాడీ శోధన అని కూడా అంటారు. ఆ తర్వాత ప్రాణాయామం చెయ్యాలి.

 3. #3
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  యోగ మార్గము (3)

  4) ప్రాణాయామం
  శ్వాసను నియంత్రించటం వల్ల మనస్సు వికారం చెందక ప్రశాంతంగా ఉండి, ధ్యేయ సాధనకు ఉపకరిస్తుంది. ప్రాణాయామానికి శ్వాస నియంత్రణ కేవలం ఒక సాధన. మన శరీరంలో జరిగే ప్రతి చిన్నపనీ ప్రాణశక్తి/జీవశక్తి వల్లనే. మనోవృత్తి కూడా సూక్ష్మమైన ప్రాణవ్యాపారమే. ఊపిరితిత్తులను ఈ ప్రాణశక్తి కండరాల చలనరూపంలో కదిలిస్తుంది. నాడులనుంచి కండరాల్లోకి వెళ్లి, కండరాలనుంచి ఊపిరితిత్తులకు చేరి వాటిని కదలించే స్నాయుశక్తే ప్రాణశక్తి. ప్రాణాయామంలో ఈప్రాణాన్నే నిరోధించి ప్రాణవ్యాపారాలన్నిటిని మనవశ౦ చేసుకుంటాం. మనిషి తన శక్తులన్నిటినీ ఏకాగ్రం చేస్తే, శరీరంలో ప్రాణశక్తి వశమవుతుంది. ఇలాంటి చిత్త ఏకాగ్రతను ఎలా పొందాలో చెప్పేదే రాజయోగం. సత్యం తెలుసుకొని అత్మసాక్షాత్కారాన్ని కలిగించే అత్యున్నత స్థితే సమాధిస్థితి. మానసికశక్తి రూపంలో వ్యక్తమయ్యే ప్రాణాన్ని, మానసిక సాధనతో నిరోధించే ప్రాణాయామ భాగాన్ని రాజయోగం అంటారు.


  శ్వాస నియంత్రణ శరీరచలనానికి ఒక క్రమమైన పద్ధతిని ఏర్పాటు చేస్తుంది. దీని వల్ల సంకల్ప బలం కలుగుతుంది. ఈ సంకల్పబల ప్రవాహాన్ని వెన్నుపూస మధ్యలో ఉండే సుషున్నూ నాడిద్వారా కుండలినీశక్తిని మేల్కొలిపి , పైకి ప్రవహించేలా చేస్తే , అతీంద్రియజ్ఞానం కల్గి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. కుండలినీశక్తి ఒకో చక్రాన్నీదాటుకుంటూ పైకి వెళుతున్నపుడు మనస్సులో పొరలు తొలగిపోతాయి.


  ప్రాణాయామం చేసే విధానం గురించి
  మేరు దండంలో(వెన్నెముక మధ్యలో) మూలాధారం మొదలుకొని బ్రహ్మరంధ్రం వరకు సుషున్నూనాడివ్యాపించి ఉంటుంది. దీన్లో కుండలినీ శక్తి ఉంటుంది. సుషున్నూనాడికి ఎడమప్రక్క ఇడానాడి(చంద్ర నాడి),కుడిప్రక్క పింగళనాడీ(సూర్య నాడి) ఉంటాయి. ముక్కుకు ఎడమప్రక్క ఇడానాడి , కుప్రక్క పింగళనాడీ అంతమవుతాయి. కాని సుషున్నూనాడి (బ్రహ్మ నాడి) బ్రహ్మరంధ్రాంతం వరకూ వ్యాపించి ఉంటుంది.వెన్నెముక యందు గుద స్థానము మొదలు సహస్రారము వరకు మూలాధారము, స్వాధిష్టానము ,మణిపూరకము, అనాహతము, విశుద్ధము , ఆజ్ఞేయము, సహస్రారము అనే ఏడు చక్రాలు ఉన్నాయి. చక్రము అంటే, ఇక్కడ నాడీ కూటమి అనే అర్ధం చేసుకోవాలి. వీటిని గురించి కుండలినీ యోగంలో విపులంగా తెలుసుకుందాం.


  విధానం ముందు కుడి ముక్కును బొటన వ్రేలితో మూసి, ఎడమవేపు ముక్కుతో గాలిని మెల్లగా పీల్చాలి. ఇపుడు చిటికెన వ్రేలు లేదా చూపుడు వ్రేలుతో ఎడమవేపు ముక్కును కూడ మూసి , లోపల ఉన్న గాలిని క్రిందిభాగాన ఉన్న మూలాధార చక్రాన్ని తడుతున్నట్లుగా భావిస్తూ అక్కడ కొంతసేపు నిలపాలి. తర్వాత బొటన వ్రేలును కుడి ముక్కుపుటం మీద నుంచి తీసి గాలిని మెల్లగా వదలాలి. ఇపుడు ఎడమవేపు ముక్కును చిటికెన వ్రేలుతో మూసి , కుడి ముక్కు నుంచి గాలిని మెల్లగా పీల్చాలి. పైన చెప్పినట్లు రెండు ముక్కు పుటాలనూ మూసి లోపలగల గాలి క్రిందనున్న మూలాధారంపై ఒత్తిడి కలుగజేస్తున్నట్లు భావిస్తూ అక్కడ గాలిని కొంతసేపు నిలపాలి. పిదప ఎడమ ముక్కుపై నున్న వ్రేలును తీసి వేసి గాలిని ఎడమ ముక్కు ద్వారా మెల్లగా వదలాలి. ఇలా లోపలికి పీల్చినపుడు దాన్ని పూరకము అని, లోపల బంధించి నపుడు కుంభకమనీ, బయటకు వదిలేటపుడు రేచకమనీ అంటారు. ఇలా ఎడమ వేపునుంచి గాలి పీలిస్తే దాన్ని కుడి వేపునుంచి బయటకు వదలాలి. అట్లే కుడి వేపునుంచి గాలి పీలిస్తే దాన్ని ఎడమ వేపు నుంచి వదలాలి. పూరకము, కుంభకము, రేచకమూ ఈ మూడు కలసి ఒక ప్రాణాయామం అవుతుంది. పూరించిన వేపునుంచి మరల పూరించ కూడదు. రేచించిన వేపునుంచే పూరించాలి.


  ఈ సాధనకు కాల నియమాన్నిపాటించాలి. పూరక , కుంభక , రేచకముల నిష్పత్తి 1:4:2 గా ఉండాలని చెబుతారు. అంటే 4 క్షణాలు పూరకమైతే , 16 క్షణాలు కుంభకము , 8 క్షణాలు రేచకము అవుతాయి. అభ్యాసం చేస్తూ ఈ కాల పరిమితిని పెంచుకోవాలి. ఇప్పటిదాక మనం చెప్పుకున్న దాన్లో గాలిని లోపల కుంభించడం జరిగింది. ఇలా కుంభించడం వల్ల మనలో ఉన్న నాడులన్నీ వాయువుతో నింపబడి దశవిధ వాయువుల చలనాన్ని ప్రేరేపిస్తాయి. అపుడు హృదయ కమలం వికసిస్తుందని విజ్ఞులు చెబుతారు.
  ఈ నిష్పత్తినే పాటిస్తూ పైన చెప్పిన విధంగా శ్వాసనుఒక వేపు నుండి మెల్లగా పీల్చి , మరో వేపు నుండి మెల్లగా వదలి గాలిని స్థంబింప చెయ్యాలి. అంటే రేచించిన పిదప కొంత సమయం పూరించకుండా ఉండటం అన్నమాట. దీన్నే బాహ్య కుంభకం అంటారు.


  నాడీశోధన, ప్రాణయామంలో బాహ్యకుంభకము, మామూలు ప్రాణయామం ఈమూడూ చెయ్యడం వల్ల నాడీశుద్ది కలుగుతుంది. ప్రాణాయామం అభ్యాసం చేసేటపుడు చెమటలు పడుతుంటే అది అధమ ప్రాణాయామంగాను, దేహంలో చలనం కలుగుతున్నట్లయితే అది మధ్యమమనీ , దేహం పైకి లేస్తున్నట్లు అనుభవం చెందితే అది ఉత్తమ ప్రాణయామమని చెబుతారు. ప్రాణాయామం వల్ల చిత్తవృత్తి నిరోధం కలిగి పర్యవసానంగా కుండలినీశక్తి జాగృతం అవుతుంది. అసలు రాజయోగం అనే పేరు వినగానే మనకు ప్రాణాయామమే అనేంత ప్రాచుర్యంలోకి వచ్చినది.


  ప్రాణాయామంలో కుంభకాన్ని ఎవరంతట వారు చెయ్యకూడదు. యోగపరిజ్ఞానం తెలిసిన నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే అభ్యాసం చెయ్యాలి అని పెద్దలు అంటారు. ఎడమ వేపునుంచి గాలి పీలిస్తే దాన్ని కుడి వేపునుంచి బయటకు వదలాలి. అట్లే కుడి వేపునుంచి గాలి పీలిస్తే దాన్ని ఎడమ వేపు నుంచి వదలాలి. పూరించిన వేపునుంచి మరల పూరించ కూడదు. రేచించిన వేపునుంచే పూరించాలి. ఇలా గాలిని మెల్లగా ఒకవేపునుంచి పీల్చి, పీల్చిన సమయానికి రెట్టింపు సమయాన్ని తీసుకొంటూ, మెల్లగా వదలాలి. దీన్నీ,నాడీశోధననూ, శ్వాసను గమనించడం వంటివాటిని ఎవరైనా చెయ్యవచ్చును.

 4. #4
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  యోగ మార్గము (4)

  5) ప్రత్యాహారం
  అలవాటుగా బయట సంచరించే మనసును అరికట్టి, అంతర్గతంచేసి ఇంద్రియాల నుంచి విముక్తి కలిగించటం. అంటే మనస్సును నిగ్రహించి చిత్తము స్వస్వరూపాన్ని పొందటమే. అంటే మనస్సుతో ఐక్యమవ్వడం అన్నమాట. దీన్నే ప్రత్యాహార మంటారు.


  6) ధారణ
  మనస్సుని నిగ్రహించి వశంచేసుకున్న చిత్తాన్ని ఒక లక్ష్యంమీద నిల్పి ఉంచాలి. అలా లక్ష్యాన్ని౦చి చెదిరి పోకుండా చిత్తాన్ని ఉంచడాన్ని ధారణ అంటారు.


  7) ధ్యానము
  చిత్తాన్ని లక్ష్యం మీదనుంచి చెదరి పోకుండా ఉంచటం వల్ల, అహం అనేది పోయి మనసు నశించి ధ్యేయ వస్తువే మిగిలి, అదే అవుతాడు. మనస్సును ఏకభావ ప్రవాహంగా కొంతకాలం నిలప గలగటం- ధ్యానం. ధ్యానం గురించి విపులంగా తర్వాత తెలుసుకుందాం.


  8) సమాధి
  ఈ స్థితిలో ఏలక్ష్యమూ లేకుండా చిత్తాన్ని ఉంచినపుడు జ్ఞాన స్వరూపమూ, శాశ్వతమూ, సర్వవ్యాప్తమై వెలిగే
  స్వస్థితిని సాధకుడు పొందుతాడు. అంటే అర్ధం మాత్రమే భాసిస్తుంది. ఇదే యోగుల గమ్యమైన సమాధిస్థితి.
  సమాధులు సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని రెండు రకాలు.
  సంప్రజ్ఞాత సమాధి - దీన్లో చిత్తవృత్తులు శాంతించే ఉంటాయి కాని బీజరూపంలో సంస్కారాలు మిగిలి, సమయం వచ్చినపుడు తిరిగి మొలకెత్తడానికి అనువుగా ఉంటాయి. కాబట్టే దీన్ని సబీజ సమాధి అంటారు. ధ్యాన, ధారణా, సబీజ సమాధులను పొందిన యోగికి సర్వశక్తులు, సర్వజ్ఞత్వము కలుగుతాయి గాని ముక్తుడు కాలేడు. ఇంకా పునర్జన్మను కలిగించే కర్మబీజాలు ఉంటాయి. అణిమాది సిద్ధులు కలుగుతాయి.
  అసంప్రజ్ఞాత సమాధి దీన్లో నేను అనే అహంకారం ఉండదు. బీజరూపంలో ఉండే చిత్త వృత్తులు నశిస్తాయి. కర్మబీజం దగ్ధమై ఉండటంవల్ల నిర్బీజ సమాధి అని అంటారు. దీన్లో వాసనలు నశించి, మనోనాశనము కూడ కలగటం వల్ల, యోగి పరమాత్మను తెలిసికొని ముక్తిని పొందుతాడు.


  యోగదర్శనం, సాంఖ్యదర్శనం అనే శీర్షికలలో వివరంగా ఉన్నదాన్నికూడ, దీనితో జతపరచి చదివితే సరైన అవగాహన లభిస్తుంది. రాజయోగి వైరాగ్యం తనకు ప్రకృతితో ఉండే సంబంధం కేవలం తాత్కాలికం అని , తాను శాశ్వతమైన ఆత్మయే గాని ప్రకృతిని గానని స్వానుభవంతో గ్రహిస్తాడు.

Thread Information

Users Browsing this Thread

There are currently 1 users browsing this thread. (0 members and 1 guests)

Members who have read this thread: 0

Bookmarks

Posting Permissions

 • You may not post new threads
 • You may not post replies
 • You may not post attachments
 • You may not edit your posts
 •