Results 1 to 4 of 4

Thread: కర్మ మార్గం (1)

          
   
 1. #1
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  కర్మ మార్గం (1)

  మనం చేసే ప్రతీ పనీ కర్మగానే చెప్పవచ్చు . మన ఇప్పటి స్థితి గతించిన జన్మ యొక్క కర్మల ఫలితమైతే ,భవిష్యత్తులో పొందే స్థితి ; ప్రస్తుత కర్మల ఫలితాన్ని బట్టి ఉంటుంది . కాబట్టి మనమెలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి . కర్మ యొక్క ఉద్దేశ్యం ఆత్మను మేల్కొల్పడానికే . శరీరం ద్వారా మనసును స్వాధీనపరచుకొనే పద్ధతినే కర్మ మార్గం అంటారు. ఇహలోక దృష్టి, దేహంమీద అభిమానమూ ఉండేవారికి కర్మయోగమే చెప్పబడింది. మోక్ష సాధనాల్లో ఒకటిగా కర్మయోగాన్ని భగవద్గీత ప్రతిపాదించింది. ఇది స్వయంగా మోక్షాన్ని కల్గించ లేదని కొందరు అంటారు. కర్మయోగం మొదట చిత్త శుద్ధిని కల్గించి , తద్వారా జ్ఞానం కల్గి మోక్షాన్ని పొందిస్తుందని చెబుతారు. పాప పుణ్యాలను దగ్గరకు రానీయక ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చెయ్యడమే దీన్లో చాతుర్యం లేదా యుక్తి.


  వివిధ సంకల్పాలతో మానవులు కర్మలను చేస్తారు. కీర్తికోసమో , ధనాశతోనో , అధికార వాంఛతోనో ఇలా అనేక కోర్కెలతో పనులను చేస్తారు. ఎలాంటి కోరికలూ లేకుండా కూడ , కర్మలు చేసే మహనీయులూ ఉన్నారు. కర్మ చేయడానికి మనలను ప్రేరేపించేది స్వార్ధమే. సాధనతో ఈ స్వార్ధపరత్వాన్ని నశింప చేస్తే , నిస్స్వార్ధంగా కర్మ చేయ కలిగే సమయం వస్తుంది . ఇలాంటి స్థితి రాగానే మన శక్తులన్నీ ఏకమై జ్ఞానం కలుగుతుంది .


  మనం చేసే ప్రతీ పనీ , యజ్ఞం అనే విశాల దృక్పధంతో గీతలో చెప్పబడింది. చతుర్విధ వర్ణోచిత కర్మలూ యజ్ఞంగా చెప్పబడ్డాయి. యజ్ఞం చేసేవాడు యజమాని. యజ్ఞం యొక్క స్వభావం త్యాగం. అంటే యజమాని తనకున్న దాన్లో కొంత పరులకోసం త్యాగం చెయ్యడమే యజ్ఞకర్మలో ఇమిడి ఉండే భావం. అన్ని ప్రాణులలో ఈశ్వరుడు ఉన్నాడు. ప్రాణులను /భూతములను తృప్తి పరిస్తే , ఈశ్వరుడిని తృప్తి పరచినట్లే. అదే మానవ సేవయే మాధవ సేవ అని చెప్పడమంటే.


  శాస్త్రోక్త కర్మలు కొన్ని ఈలోకంలో ఫలితాన్ని ఇస్తాయి. కొన్ని కర్మలను ఆచరించడం వల్ల మరణానంతరం ఫలితాన్ని ఇస్తాయి. ఈ లోకంలో ఇంద్రాది దేవతలను గురించి యజ్ఞ యాగాలు చేసే వారు కూడ పరమాత్మను కర్మ మార్గము చేత ఉపాసిస్తున్నట్లే. ఇలాంటి కర్మల వల్ల , శీఘ్రమే కర్మల ఫలితాన్ని పొందుతారు. ఇలా శీఘ్రమే ఫల ప్రాప్తిని కల్గించే కర్మలు ; జ్ఞాన సాధకాలు కాకపోయినా , చిత్త శుద్ది కోసం పండితులు సైతం ఈ మార్గాన్నే అనుసరిస్తుంటారు. ఎందు చేతనంటే చిత్త శుద్ది లేకుండా పరమాత్మను పొందే జ్ఞాననిష్ఠ లభించదు కాబట్టి. కర్మ యోగాన్ని అందరూ పాటించ వచ్చు. కర్మలు కాయిక, వాచిక ,మానసికములని మూడు విధాలు.


  కాని కర్మ సిద్ధాంత ప్రకారం వీటిని కర్మలని అనరు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏ పనులు చెయ్యడం వల్ల కాని,చెయ్యకపోడం వల్ల గాని ; చేసే వాడికి పాప పుణ్యాలు కల్గుతాయో , అలాంటి బంధ కారణమైన పనులను కర్మ అంటారు.


  అకర్మ అంటే ఏ పనీ చెయ్యకుండా ఉండటం కాదు. కర్మ ఫలాన్ని ఆశించకుండా, నేను చేస్తున్నాను అనే అహంభావం వదలి , కర్మలు చేస్తే ; కర్మలు చేసే వాడికి కర్మఫలం అంటదు. ఫలాన్ని ఇవ్వడానికి శక్తిలేని కర్మను అకర్మ అంటారు. కర్మ సిద్ధాంతం ప్రకారం స్వర్గ, నరకాలను గాని ; పునర్జన్మను గాని కలిగించే శక్తి లేకపోడం వల్ల ఇట్టిది కర్మ కాదు. అంటే కర్మ కానిది అకర్మ.


  వికర్మ స్వర్గాది ఫలాలను కోరి చేసే ఏపనైనా వికర్మ అనబడుతోంది. వికర్మ అంటే విపరీతకర్మ లేక నిషిద్ధ కర్మఅని అర్ధం. పుణ్యకర్మలు సైతం నిషిద్దాలే. వాటి ఫలితాలను అనుభవించడానికి మరో జన్మ నెత్తవలసి ఉండటం వల్ల. అంచేత వేదాంత శాస్త్ర దృష్టిలో గాని , ముముక్షువు యొక్క దృష్టిలో గాని ఇట్టి కర్మ నిషిద్ధ కర్మ గానే భావించబడు తోంది.  ఏది వికర్మగా చెప్పబడినదో , దాన్నే ఫలాపేక్ష లేకుండ ఈశ్వరార్పణ బుద్ధితో గాని, లోక కళ్యాణం కోసం గాని చేస్తే అప్పుడది ఆకర్మగా అవుతుంది. దీన్నే కర్మయోగం అంటారు. అకర్మ వికర్మల కార్యాచరణంలో భేదం లేదు. భేదం కేవలం సంకల్పం లోనే.

 2. #2
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  కర్మ మార్గం (2)

  గుణాలను బట్టి కర్మ సాత్వికము, రాజసికము, తామసికము అని మూడు విధాలుగా ఉంది.
  సాత్విక కర్మ ఇది అకర్మ . దీన్లో అహంకార మమకారాలు ఉండవు.
  రాజసిక కర్మ ఇది వికర్మ. ఫలాశ,అహంకారాలతోను; ప్రయాస తోను చేయబడేది.
  తామసిక కర్మ ఇది అజ్ఞానంతో తన సామర్ధ్యం తెలియక మొహంతో ప్రారంభించబడేది. ఇవి హింస,నాశనాలకు దారి తీస్తాయి. ఇవి పాప హేతువులు.


  అజ్ఞానం చేత సుఖాన్నే అత్యున్నత ప్రాప్తి అనుకోడంవల్ల మనం కష్టాల్ని అనుభవిస్తున్నాం. సంసారంలో సుఖ దు:ఖాలని అనుభవించిన తర్వాతే వైరాగ్యమూ , ప్రశాంతతా కలుగుతాయి. ఎందుకంటే సంసారంలోని విషయాలన్నీ తుచ్చ మైనవని విషయానుభవం తర్వాతే గ్రహించ గల్గుతా౦ . అపుడే ఆత్మ సమర్పణ భావం వస్తుంది. సన్యసించ కుండా సంసారంలో ఉంటూ భగవంతుడిని కొలవటం కొంచెం కష్టమే. ఐనా గృహస్థుడు తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ , జీవనోపాధికి సక్రమంగా ధనార్జన చేసి ; కుటుంబాన్నీ,తనపై ఆధారపడి జీవించే బంధువర్గాన్నీపోషిస్తూ తన పరిస్థితిని బట్టి , అర్ధించిన వారికి సహాయ పడాలి. దరిద్రులు , దుర్బలులూ , పనిచెయ్యని బిడ్డలూ, వృద్ధులైన తల్లి తండ్రులూ, స్త్రీలు వీరంతా గృహస్తుడిపై ఆధారపడతారు. అంతే గాక ముముక్షువులకు భిక్షను ఇచ్చి పోషించేది కూడ గృహస్థుడే. అంటే సంఘానికంతకూ అతడే ఆధారం. ఆర్జించే వారిలో ముఖ్యుడు. ముందుగా విద్యకు, పిదప ధనార్జనకూ శ్రమపడి ప్రయత్నించాలి . ధర్మ మార్గంలో సంపాదించి , దాన్లో కొంత భాగాన్నిసేవా భావంతో ధర్మ కార్యాలకు వినియోగించాలి . కాబట్టి నిస్స్వార్ధంగా కర్మల ఫలాన్నిఈశ్వరార్పణ చేస్తూ సాధనచెయ్యాలి.


  ప్రతీ పనిలోనూ మంచి , చెడుల కలయిక ఉంటుంది . అందువల్ల వాటిఫలితాన్ని ఇచ్చి తీరుతాయి . ఫలితాలు మంచివైనా,చెడు వైనా,వాటిని అనుభవించటానికి మరల జన్మనెత్త వలసి ఉంటుంది . అందుచేత కర్మఫలములందాసక్తి లేకుండా కర్మలుచేయడం వల్ల , అవి మనలను బంధించవు. దుష్ట సంస్కారాలను మంచి సంస్కారలచేత మార్చడం వల్ల , మన మనస్సును స్వాధీనం చేసుకోగల్గుతాం. నిష్కామకర్మ చేసే నైపుణ్యం సంపాదించుకో గల్గుతాం. ఇలా నిష్కామ కర్మలు చేయడం అలవాటయ్యాక మంచి సంస్కారాల్నీ వదిలెయ్యాలి . అపుడే ఆసక్తుడల్లా అనాసక్తు డవుతాడు . కావున కర్మచెయ్యి . కాని నీవుచేసే పనిచేతకాని , ఆలోచన చేతకాని మనసులో సంస్కారం కలుగకూడదు . కోర్కెలు విడచిపెట్టి , ఏకర్మను చేస్తున్నా నీకోసం చేయడంలేదని గ్రహించు . అపుడు దాని ఫలితం నీకు చెందదు . ఇలా జీవిత వ్యాపారమేది చేసినా , వాటిమీద ఆసక్తి లేకుండట౦వల్ల , సాక్షిగా ఉండి కర్మను కర్మకోసమే చేయబడి,అదొక ఆరాధనగా మారుతుంది. అత్మానుభవం లభిస్తుంది.


  కర్మయోగం మనలను నేను అనేది లేకుండా చేసి , సర్వం నీవే అనే భావాన్ని కలిగించి అహంకార త్యాగాన్ని కలుగజేస్తుంది . ఈలోకంలో కనిపించే సుఖదుఖ్ఖాలన్నీ సంసారంలోని అనివార్య పరిస్థితులు . కాని అవి క్షణికములే . దుఖ్ఖం కర్మచేత రాదు. సంగం (మమకారం) చేత కల్గుతుంది. అన్ని యోగాలకూ వైరాగ్యమే మూలం. నేను , నాది అనేవి మానసిక పాశాలు. స్వార్థచింతన , మమకారమూ లేకుండా నీకర్మను నిర్వర్తిస్తే ఏదోషమూ ఉండదు . కాబట్టి దేన్నిచూసినా , దేన్నిఅనుభవించినా , దేన్నివిన్నా ,దేన్నిచేసినా సర్వమూ భగవదర్పిత భావంతో చెయ్యి . ఏమీ ఆశించక , కర్మఫలాన్ని భగవంతుడికే సమర్పించు . ఏపనినైనా నిర్బంధంతో చేస్తే అది సంగాన్ని కల్గిస్తుంది .

 3. #3
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  కర్మ మార్గం (3)

  కాబట్టి వాంఛలు లేకుండ కర్మలను చెయ్యి. ఇంద్రియాలనీ తమ వ్యాపారాలను చెయ్యనీ . కాని ఏ కెరటానికీ నీ మనస్సును లొంగ నీయకు. బధ్దుడవు కాకు. ప్రేమతో చేసే ప్రతీ పనీ ఆనందాన్ని కలుగ జేస్తుంది. ఎలాంటి బాధ, అసూయ, స్వార్ధమూ లేని విధంగా కుటుంబ సభ్యులను, లోకాన్నీ ప్రేమించ కలిగినప్పుడు , నీవు అసంగుడవు కాదగ్గ స్థితిని పొందినట్లు గ్రహిస్తావు. ఇలా ప్రేమ పరమావధిని పొందితే , ప్రకృతి బంధాల నుంచి విముక్తులమై ప్రకృతిని యదార్ధ స్వరూపంలో చూడ గలుగుతాం. ప్రతి వస్తువునూ ఫలాపేక్ష లేకుండా లోకానికి సమర్పించ గల్గితే కర్మలు బంధాన్ని కలిగించవు.


  ఈ లోకానికి మనం సుఖాన్ని గాని , దుఖాన్ని గాని పెంచలేం. భూమి మీద సుఖ, దుఖాల శక్తుల మొత్తం ఎప్పుడూ ఒక్కటే . కాకపోతే మనం చేసేది అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటూ దాన్ని తోస్తాం. ఈ ప్రపంచమంతా దుఖంతో కూడుకున్నదే. పరోపకారం చెయ్యడమే మనం చెయ్యగల ఘన కార్యం. ప్రపంచం మంచిది కాని , చెడ్డది కాని కాదు. ప్రతీ వ్యక్తీ తనకు తానే ఒక లోకాన్ని నిర్మించుకుంటాడు. మన మనోస్థితిని బట్టి జీవితం మంచిదిగా గాని చెడ్డదిగా గాని కన్పిస్తుంది. మనకి కలిగే ఉపయోగాన్ని బట్టి మంచి అని గాని చెడు అని గాని చెబుతాం. వాస్తవానికి ఈ ప్రపంచం పరిపూర్ణంగానే ఉంది. నిస్సంగత్వాన్నిఅలవరచుకొని కర్మలు చేస్తే, ఏ పాప పుణ్యమూ అంటదు. ఈ విశ్వంలో దేన్నైనా నీవు లోబరచుకొంటే తప్ప , దానికి నీ మీద ఎలాంటి ప్రభావమూ ఉండదు. మనో నిగ్రహం కలిగితే ఏదీ మంచి చెడులుగా అనిపించదు. అహంకారం తొలగి జీవ భ్రాంతి పోతే దుఃఖ మయంగా తోచిన ప్రపంచం ఆనందమయంగా తోస్తుంది. ఏ యోగమైన పట్టుదలతో సాధించాలి . సంసార మోహాన్ని వదలడం ఎంతో కష్టమైన పని. విషయాలను తెలిసికొని , వాటిని అనుభవించి , మనస్సుతో వాటిని క్రమంగా సంగరహితం అయ్యేవరకూ విడవాలి. దేనితోనూ తాదాత్మ్యం చెందకుండా మనస్సును స్వతంత్రంగా ఉంచుకోవాలి.


  అనేక మార్గాలచే ఒక గమ్యాన్ని చేరగలమనేది వేదాంతంలో అంశం . కర్మ, భక్తి , జ్ఞాన , యోగ మార్గాలని వేర్వేరుగా నిర్దేశించబడినా ఒకయోగం మరొక దానితో కలిసేఉంటుంది . ఏది ప్రధానంగాఉందో దానికా పేరుపెడతారు . అన్నిటి గమ్యమూ మోక్షమే . అలాంటి గమ్యాన్ని స్వార్ధరహిత కర్మ మూలంగా పొందటమే కర్మయోగం . స్వార్ధ రాహిత్యాన్ని స్వయంగానే సాధించుకోవాలి . అపుడు ప్రతి క్షణమూ అనుభూతిగానే ఉంటుంది . ఇదే కర్మ యోగ రహస్యం . కర్మయోగి వైరాగ్యం కర్మ ఫలాలలో అనాసక్తత,ఇహపరాలలో ఎలాంటి ఫలభోగ వాంఛలేకుండా ఉండటం.


  దేహం ఉన్నంత వరకు చేసే అన్నపాన, స్నానాది కర్మలు నిత్య కర్మలు. ఇవి స్వాభావికాలవడం చేత దోషాలు కాదు. అలాగే అనారోగ్యానికి ఔషధాలు తీసుకోడం కూడ దోషాలు కావు. ఎందుకంటే వీటి వల్ల రాబోయే కాలంలో ఫలం కలుగదు కాబట్టి. వీటిని నైమిత్తిక కర్మలు/ శాంతి కర్మలు అంటారు. నిత్య నైమిత్తిక కర్మలు దోషాలు కావు. నిషిద్ధ కర్మలే త్యజించవలసినవి.


  సకామకర్మలు ఇవి ఫలాన్ని ఆశించి చెయ్యబడతాయి. ఆ ఫలాన్ని అనుభవించడానికి మరొక జన్మ అవుసరమై సంసారంలో చిక్కుకోవాలి. అంటే జనన మరణాలు, ఈ సంసారమూ తొలగాలంటే సకామ కర్మలు చెయ్యకూడదు. కాని ముందు సకామ బుద్దితోనే కార్మలు చేస్తుండాలి. కాని ఫలాన్ని భగవంతుడికే అర్పించాలి. అలా చేస్తుండగా క్రమంగా ఫలాసక్తి నశించి నిష్కామ కర్మయోగం లభిస్తుంది. అపుడు ఈశ్వరేచ్చానుసారంగా పనులు జరుగుతూంటాయి. కర్తృత్వ భావం లేనపుడు రజస్తమస్సులు అణిగి సత్వంకూడా శుద్ధ సత్వమై ఈశ్వరేచ్చానుసారంగా వర్తిస్తుంది. జ్ఞానోదయం అయ్యేవరకూ విహితమైన కర్మలు చేస్తూ , తర్వాత వాటిని వదిలెయ్యాలి.

 4. #4
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  కర్మ మార్గం (4)

  మనస్సులో మాలిన్య దోషాలు, దేహాది అహంకారము పోతే చిత్త శుద్ది కలుగుతుంది. అప్పుడు సాధనలో పురోగతి లభిస్తుంది. విహిత కర్మలను అంటే చెయ్యవలసిన పనులను కర్తవ్యతా బుద్ధితో చెయ్యడమే కర్మయోగమంటే. మనస్సు అంతర్ముఖమై, పరమాత్మ ఆశ్రయమైనపుడు, ఇంద్రియాల చేత చెయ్యబడే పనులవల్ల; మనోవృత్తులు ఉదయించవు. గనుక కామ వాసనలూ ఉండవు కాబట్టి అది నిష్కామ కర్మ అవుతుంది. అట్టి మనోవృత్తులు ఉదయించని స్థితినే ఆకర్మము అని అంటారు. అందుకే కర్మకు ఫలము కూడ ఉండదు. సంకల్పంతో కలసి అంతః కరణంలోవృత్తులు జనించినపుడే ఆ కర్మ బంధకారణం అవుతుంది.


  కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతరింద్రియ సంబంధమైన పనులన్నీ శరీరంతో చేయబడుతున్నాయి. ఈపనులలో ఆసక్తి లేకుండా గనుక చెయ్యగల్గితే , అవి కర్మఫలాలను కలిగించ లేవు. అట్టి వాడే అన్ని శాస్త్రముల యందూ అధికారి. జ్ఞానికి ఫలాపేక్ష, దేహేంద్రియాభిమానము, కర్తృత్వాభిమానమూ లేకుడటం వల్ల కర్మలు చేసినా ; కొంచెమైనను కర్మము చెయ్యని వాడే. అట్టి వాడు లోకసంగ్రహార్ధం/ శరీర యాత్రకోసం కర్మలను చేసినా దోషం లేదు. సమస్త కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యడం వల్ల దోషముండదు. జ్ఞాన సిద్ధికి కర్మమార్గము సాధనమని చెప్పబడింది. నిష్కామ కర్మయోగంతో కూడిన విహిత కర్మలను చెయ్యటం అందరికి యోగ్యమే.


  కర్మయోగి ఏ సిద్ధాంతాన్నీ నమ్మనక్కర లేదు. స్వార్ధ రాహిత్యాన్ని మాత్రం కర్మాచరణ ద్వారా స్వయంగా సాధించాలి. అహంకారం వదలుకొన్నపుడే నిష్కామ కర్మాచరణం సాధ్యం. నేను , నా వారు అనే భావం లేకుండా ఉండాలి.
  అహంకారంతో చేసే పనులు ప్రవృత్తి.
  అహంకార మమకారాలను వదలి చేసే పనులు నివృత్తి ; ఈ పనులకు కర్మత్వం ఉండదు.
  ప్రవృత్తి వల్ల సంసారము, నివృత్తి వల్ల మోక్షమూ లభిస్తాయి.


  తామరాకు పై నీటి బిందువు నిలిచి ఉన్నా అది తామరాకును అంటనట్లు ; కర్మయోగి ఎట్టి పనిచేసినా ఏ కర్మనూ చెయ్యనివాడే. కోరికలను జయించక సన్యసించిన వాడు ఏకాంతవాసములో ఉండి ఏకర్మనూ చెయ్యకున్నను , సమస్త కర్మలూ చేసిన వాడే అవుతున్నాడు. కర్మయోగులకూ, కోర్కెలు లేని వారికీ భగవదనుగ్రహం వల్ల హృదయ గ్రంధి క్షీణించి అహంకార మమకారాలు నశిస్తాయి. జనన మరణ సంసార చక్రం నుంచి విముక్తి కలుగుతుంది. కర్మయోగం వల్ల చిత్త శుద్ది , చిత్త శుద్ది వల్ల తత్వ జ్ఞానము, తత్వజ్ఞానం వల్ల ముక్తీ కలుగుతాయి.

Thread Information

Users Browsing this Thread

There are currently 1 users browsing this thread. (0 members and 1 guests)

Members who have read this thread: 0

Bookmarks

Posting Permissions

 • You may not post new threads
 • You may not post replies
 • You may not post attachments
 • You may not edit your posts
 •