Results 1 to 2 of 2

Thread: మానవ ధర్మము - మతము.

          
   
 1. #1
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  మానవ ధర్మము - మతము.

  ధర్మం అనేది మానవ కుటుంబంలోను, సంఘంలోను, దేశంలోను, మతమందు ఇతరులతో ఉండే సంబంధాన్ని చక్కదిద్దేది . మానవుని ధర్మాచరణ తన బుధ్ధి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి మానవుడూ తన జీవనవిధానంలో కొన్ని నైతిక విలువలను ఆచరించవలసి ఉంటుంది. వాటిని పురుషార్ధములు అని అంటారు. అవి ధర్మము, అర్ధము ,కామము, మోక్షము అనే నాలుగూను.


  ధర్మం అంటే వేదంలో చెప్పబడిన యజ్ఞయాగాదులు. మనస్సుతోను, వాక్కుతోను , శరీరంతోను శాస్త్రంలో విధించబడిన కర్మలను చేస్తూ, చెయ్యకూడని కర్మల జోలికి పోకుండా ఉండటం వల్ల సుఖం కల్గుతుంది. ఈ ధర్మాన్ని ఆధారంగా చేసుకునే సకల ప్రపంచమూ నడుస్తోంది. అంటే ఇతరులకు హాని జరగకుండా మనం ప్రవర్తించాలి.


  అర్ధము అంటే ధన ధాన్య వస్తు వాహనాలు మొదలైనవి. ఈ ధనాన్ని సంపాదించాలంటే ధర్మానికి లోబడి సంపాదించాలి. అంటే న్యాయ మార్గంలో సంపాదించాలి. అలా సంపాదించిన దానిలో కొంత భాగాన్ని శాస్త్రంలో చెప్పబడినట్లుగా దాన,ధర్మాలకు వినియోగించి , మిగిలిన దాన్ని భార్యా పుత్రులతో ధర్మానికి లోబడి అనుభవించాలి. ఇక మూడవదైన కామం కూడ, ధర్మానికి విరుద్ధం గాని కామాన్ని అనుభవిస్తూ జీవించాలి.( పుట్టిన ప్రతీ వాడూ మూడు రుణాలతో పుట్టడం జరుగుతుంది. వేదాలను చదవటం వల్ల ఋషుల రుణమూ, యజ్ఞయాగాదులు చెయ్యడం వల్ల దేవతల రుణమూ , సంతానాన్ని పొందటం వల్ల పిత్రు దేవతల రుణమూ తీరుతాయని శాస్త్రం). అందుచేత కామం కూడ ఒక పురుషార్ధంగా పరిగణించడం జరిగింది.


  ఇక్కడ చెప్పిన ధర్మ, అర్ధ, కామములనే మూడూ ఆనందాన్ని కలుగ జేస్తాయి. కాని అవి శాశ్వతం కాదు. ఇచ్చట చెప్పిన ధర్మం ఎందుకు శాశ్వతం కాదు అంటే - వాటివల్ల కల్గే సుఖాలు శాశ్వతాలు కాదు కాబట్టి. ఇలా ధర్మార్ధకామాలను అనుభవిస్తూ పవిత్రమైన జీవనాన్ని గడిపే వానికి నాల్గవదైన పురుషార్ధం -' మోక్షం' అప్రయత్నంగా లభిస్తుందని విజ్ఞులు చెబుతారు. మోక్షం పొందితే సంసారంలో తిరుగాడే చావుపుట్టుకలనే బంధంనుంచి విడుదల అవుతారు. అంచేత దీన్ని పరమ పురుషార్ధంగా చెబుతారు. దీన్ని చెప్పడానికే వేదాన్తమంతా అనేక శాఖలుగా విస్తరించింది.


  ఇలాంటి జీవన విధానాన్ని బోధించేది మతం. భగవంతుడనే వాడున్నాడనీ, జీవరాసులన్నీ ఆయన బిడ్దలనీ, ఆయన ప్రేమమయుడనీ మనం ఆయన్ని ఆరాధించాలనీ, చివరకు అంతా ఆయన గృహానికే పోవాలనే విషయంలో అన్ని మతాలకూ అభిప్రాయ భేదం లేదు. భగవంతుడు ఒక్కడే అయినా, వేర్వేరు మత ధర్మాలను బట్టి, వారి వారి అభిరుచులను బట్టి అనేకమైన పేరులతో పిలుస్తుంటారు. ప్రతీ మతానికీ ఒక ప్రవక్త గాని, వారిది అని చెప్పుకునే పవిత్ర గ్రంధామో ఉన్నాయి.


  కాని హిందూ మతంలో అలాంటి ఒక ప్రవక్త గాని, ఫలానాదే వాళ్ళ గ్రంథమని గాని చెప్పలేం. అందుచేత పండితులు వేదాన్ని ప్రమాణంగా అంగీకరించారు. వేదం అపౌరుషేయం. అంటే మానవ మాత్రులేవరో చెప్పినది కాదు. ప్రాచీన ఋషులు సమాధినిష్ఠలో వారు ప్రత్యక్షంగా సాక్షాత్కరించుకున్న సత్యాలను గ్రహించి, వాటిని శృతి రూపంగా (వాక్కు ద్వారా) తర్వాతి తరాల వారికి అంద జేశారు. అనాదిగా ఇది కొనసాగుతూ వస్తుండటం వల్ల దీనికి సనాతన ధర్మమనీ, వైదిక ధర్మమనీ అంటాం.

 2. #2
  Senior Member
  status.
   

  Join Date
  20th February 2012
  Posts
  2,520
  Rep Power
  0

  ద్వైతం

  ద్వైత సాంప్రదాయానికి మూల పురుషుడు మధ్వాచార్యుల వారు. వైష్ణవ సాంప్రదాయంలో వీరిది సద్వైష్ణవం అంటారు. వీరి విచారణను తత్వవాదం అని చెబుతారు . మధ్వాచార్యులవారికి తల్లితండ్రులు వాసుదేవ అని నామకరణం చేసేరు. క్రమంగా ఆనంద తీర్ధుడని, పూర్ణ ప్రజ్ఞ అనీ మద్వాచార్యులని నామాంతరాలు పొందేరు.
  ముఖ్య ప్రాణమైన వాయువు యొక్క మొదటి అవతారం హనుమంతుడు. రెండవ అవతారం భీముడు .
  శ్రీ మధ్వాచార్యుల వారు ముఖ్య ప్రాణం యొక్క మూడవ అవతారంగా చెప్పబడినది.


  బ్రహ్మసూత్ర భాష్యం , అనుభాష్యం , న్యాయ వివరణం , అనువ్యాఖ్యానం అని సూత్ర ప్రస్థానంపై భాష్యం రచించేరు. వీటితో బాటు మొత్తం ముప్పై ఏడు రచనలను చేసేరు. వీటన్నిటినీ కలిపి సర్వమూలం అని పిలుస్తారు.

  వీరి ద్వైతం ప్రకారం జీవాత్మ , పరమాత్మలు వేర్వేరుగా ఉంటాయి. అవి ఎప్పటికీ ఒక్కటి కాలేవు. జీవుడు ఎప్పటికీ నారాయణుడు కాలేడు. ఈ భేదం శాశ్వతంగా ఉంటుంది.


  శ్రుతిలో చెప్పబడిన బ్రహ్మము - హరి లేక విష్ణువే . నారాయణుడని కూడ పిలుస్తారు. విష్ణువు సర్వ శ్రేష్ఠుడనీ , వైకుంఠం లేక స్వర్గం ఆయన నివాస స్థానం అనీ అక్కడ ఆయన సతి లక్ష్మీ దేవితో ఉంటాడనీ బోధిస్తారు. హరి సర్వ స్వతంత్రుడనీ, ఏ పేరుతో పిలచినా అది విష్ణువునే సూచిస్తుందని అంటారు.


  జీవాత్మలూ , జగత్తు కూడ సత్యమైనవే కాని స్వతంత్రమైనవి కావు. హరి కన్న భిన్నమైనవి. జీవులందరూ హరిపై ఆధారపడి ఉంటారు. జీవులు హరికి సేవ చెయ్యడానికే. పరిపూర్ణమైన భక్తి , సరైన జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుంది. ముక్తి అంటే బ్రహ్మముతో ఐక్యమవ్వడం కాదు. దుఖం పోయి ఆనందమయ స్థితిని పొందటమే.
  ముఖ్యంగా అయిదు విషయాలను ఎప్పటికీ భిన్నమైనవి అని చెబుతారు. అవి
  1) జీవుడు ఈశ్వరుడు ఎప్పుడూ భిన్నమైన వారే. ఇక్కడ ఈశ్వరుడు అంటే బ్రహ్మము లేక విష్ణువు.
  2) జడమైన వాటికి, ఈశ్వరునకు భేదం ఉంది.
  3) రెండు జీవులు ఎపుడూ ఒకే లక్షణాలను కలిగి ఉండరు. రెండుజీవులకు మధ్య ఉండే భేదం.
  4) జడమైన వాటికీ జీవునకూ భేదం ఉంది .
  5) రెండు జడమైన పదార్దాలకూ భేదం ఉంటుంది.


  జగత్తు ఎలా సత్యమో , అలా ఈ భిన్నత్వమూ సత్యమే.
  ఇలా ఈశ్వరునికీ జీవుడికీ , జీవుడికీ జగత్తుకీ , ఈశ్వరునికీ జగత్తుకీ ,జీవుడికీ జీవుడికీ , జగత్తులోని విషయాలలోనూ భిన్నత్వం చెప్పటం వల్ల ద్వైతంగా చెప్పబడుతోంది.

Thread Information

Users Browsing this Thread

There are currently 1 users browsing this thread. (0 members and 1 guests)

Members who have read this thread: 0

Bookmarks

Posting Permissions

 • You may not post new threads
 • You may not post replies
 • You may not post attachments
 • You may not edit your posts
 •